హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ప్రజలకు క్యూర్  బిల్లు శాపమే.. ఆస్తి పన్ను డబుల్ అయితది

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ప్రజలకు క్యూర్  బిల్లు శాపమే.. ఆస్తి పన్ను డబుల్ అయితది

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించి, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాస్తూ బ్యూరోక్రాట్ల చేతిలో పెత్తనం పెట్టడం నగర ప్రజల ఆకాంక్షలకు పూర్తిగా విరుద్ధమని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా అమల్లో ఉన్న 1955 జీహెచ్‌ఎంసీ చట్టాన్ని రాత్రికి రాత్రే మాయం చేసి తెచ్చిన ఈ బిల్లు.. పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆస్తిపన్ను భారాన్ని రెట్టింపు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన అసెంబ్లీలో క్యూర్ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడారు.

ఈ బిల్లు ప్రకారం సీఎం చైర్మన్‌గా వ్యవహరిస్తారని.. దీంతో మేయర్లు, కార్పొరేటర్లకు పరిమిత అధికారాలే దక్కుతాయని పేర్కొన్నారు. స్థానిక సంస్థల అధికారాలకు ఇది గొడ్డలిపెట్టు లాంటిదని, ఎన్నికైన పాలకవర్గాలన్నీ కేవలం ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయే ప్రమాదం ఉందన్నారు. హైదరాబాద్ ప్రజలకు బ్యూరోక్రాట్ల పెత్తనం కాదని.. పూర్తిస్థాయి అధికారం కావాలని స్పష్టం చేశారు.  ఇప్పటికే డీలిమిటేషన్ డివిజన్లను చట్టవిరుద్ధంగా మార్చేశారని ఆరోపించారు.

హైడ్రా ఓ రాజ్యాంగేతర సంస్థగా అడ్డగోలుగా వ్యవహరిస్తోందని, చివరకు ప్రత్యేక పోలీసుస్టేషన్‌లో క్రిమినల్ కేసులు నమోదు చేసే స్థాయికి దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగులో క్యూర్ అంటే నయం చేయడం అని అర్థం అయినప్పటికీ, ఈ బిల్లు మాత్రం నగరానికి తీవ్రమైన హాని చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.