ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవులు బీసీలకే ఇవ్వాలి: బీసీ ఇంటెలెక్టువల్స్ ఫోరం 

ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవులు బీసీలకే ఇవ్వాలి: బీసీ ఇంటెలెక్టువల్స్ ఫోరం 
  •  రాబోయే ఎమ్మెల్సీ స్థానాలనూ బీసీ వర్గాలకే కేటాయించాలి
  •     బీసీ సంఘాల నేతలు, మేధావుల డిమాండ్​
  •     కేబినెట్​లో బీసీల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గుతున్నది: చిరంజీవులు
  •     భవిష్యత్తులో జీరోకు చేరే ప్రమాదం ఉందని ఆందోళన 
  •     సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో  రౌండ్ టేబుల్ సమావేశం 

హైదరాబాద్/ హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవులను తక్షణమే బీసీ వర్గాలకు కేటాయించాలని పలువురు ప్రజాప్రతినిధులు, మేధావులు, బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు ప్రభుత్వంలో, చట్టసభల్లో సముచిత వాటా కల్పించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

 ‘56 శాతం బీసీలు.. రాజకీయ రంగంలో వాటా ఎక్కడ?’ అనే అంశంపై బీసీ ఇంటెలెక్టువల్స్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు అధ్యక్షతన శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవులతో పాటు రాబోయే ఎమ్మెల్సీ స్థానాలు, గవర్నర్  కోటా సీట్లను బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఇప్పటివరకు రాజకీయంగా తగిన గుర్తింపునకు నోచుకోని వడ్డెర, కుమ్మరి, నాయీబ్రాహ్మణ లాంటి ఎంబీసీ కులాలకు ప్రాధాన్యం కల్పించాలని కోరారు.

తగ్గుతున్న బీసీ మంత్రుల సంఖ్య..

ఈ సందర్భంగా చిరంజీవులు గణాంకాలతో కూడిన ప్రజెంటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను ప్రదర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో 2009లో ఐదుగురు బీసీ మంత్రులు ఉండగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో ఆ సంఖ్య నలుగురికి, 2018లో ముగ్గురికి తగ్గిందని, ప్రస్తుతం కేవలం ఇద్దరికే పరిమితమైందని వివరించారు. ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్తులో బీసీల మంత్రివర్గ ప్రాతినిధ్యం శూన్యానికి చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ లాంటి జిల్లాల్లోనూ ప్రాతినిధ్యం దారుణంగా పడిపోయిందన్నారు. ఖమ్మం జిల్లాలో మున్నూరు కాపు సహా బీసీలకు కేబినెట్ ప్రాతినిధ్యం లేకపోవడం అన్యాయమని తెలంగాణ విట్టల్ అన్నారు. మెజారిటీ జనాభా ఉన్నప్పటికీ అధికారంలో తగిన వాటా లేకపోవడం తీవ్రమైన అన్యాయమని, బీసీల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. బీసీలు ఐక్యంగా ఉన్నప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని, రాబోయే జనగణనలో ప్రతి బీసీ కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. 

సమావేశంలో బీజేపీ నేత తాడూరి శ్రీనివాస్, కటకం నరసింహారావు, గుజ్జ సత్యం, వట్టే జనార్దన్ యాదవ్, అడ్వకేట్లు రాజు, పొన్నం దేవరాజు, ఎర్ర సత్యనారాయణ, రిటైర్డ్ డీఆర్వో సూర్యనారాయణ, ఇలి వెంకన్న, దుర్గయ్య గౌడ్, మెట్టు సూర్యప్రకాశ్, బైరి శేఖర్, కర్ణాటి మనోహర్, చిన్నారాములు ముదిరాజ్, చెన్న శ్రీకాంత్, బొంగు ప్రసాద్, నీరజ గౌడ్, లింగేశ్, చోళ రాజేశ్వర్ యాదవ్ తదితర బీసీ సంఘాల ప్రతినిధులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.