జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల పట్టణంలోని వాణి నగర్ సమీపంలో కల్తీ పాలు కలకలం రేపాయి. స్థానిక చైతన్య డెయిరీ పాల కేంద్రంలో కొనుగోలు చేసిన పాల ప్యాకెట్ గమ్(జిగురు) రూపంలో మారడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితుడు లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. వాణి నగర్‌లోని చైతన్య డెయిరీ సెంటర్లో ఆయన పాల ప్యాకెట్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లారు.
ఆ ప్యాకెట్‌ను ఫ్రిడ్జ్‌లో ఉంచి అనంతరం విప్పి చూడగా పాలు పూర్తిగా జిగురుగా మారిపోయాయి. వెంటనే సదరు పాల కేంద్రానికి వెళ్లి నిర్వాహకుడిని నిలదీశారు. డెయిరీ నిర్వాహకుడు మరో పాల ప్యాకెట్ ఇస్తానని చెప్పాడు. కల్తీ పాలను విక్రయిస్తూ చిన్నారులు, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కల్తీ పాలు విక్రయిస్తున్న సదరు డెయిరీపై, వ్యాపారులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
