న్యూఢిల్లీ: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు మొదటి రోజు సమావేశాలు, పాలసీ చర్చల అనంతరం నేతలకు రాత్రి పూట ఘనంగా విందు ఏర్పాటయింది. ఢిల్లీలోని భారత్ మండపంలో విదేశీ అధినేతలు, ఇతర ప్రముఖుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా గాలా డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో భారతీయ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా ఆహారం, సంగీతం ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మెనూ ప్రత్యేకతలు
భారతదేశంలోని వివిధ ప్రాంతాల రుచులను ప్రతిబింబించేలా ఈ విందు మెనూని రూపొందించారు. ప్రాంతీయ క్లాసిక్స్ నుంచి ఓల్డ్ ఢిల్లీ స్ట్రీట్ ఫుడ్ వరకూ అన్నింటికీ ఇందులో చోటు కల్పించారు. ఖాండ్వి మిల్-ఫ్యూయిల్, ఖుంబ్ గలౌతి (పుట్టగొడుగు కబాబ్స్), పన్నీర్ లబాబ్దార్, గుచ్చి మార్మిక్, క్యారెట్ బీన్ పొరియల్, తక్కళి బెల్లే సారు (టొమాటో చారు), మిల్లెట్ పులావ్, బీట్‌రూట్ రైతా, వివిధ రకాల భారతీయ రొట్టెలు. ఓల్డ్ ఢిల్లీ ఫ్రూట్ క్రీమ్ విత్ జిలేబీ, షాహ్తూత్ ఫిర్నీ మొదలైన వంటకాలు ఉన్నాయి.
‘బ్రిక్స్ సింఫనీ’ సాంస్కృతిక ప్రదర్శన
అతిథులను అలరించేందుకు భారీ సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఐసీసీఆర్ ఆధ్వర్యంలో భారత్ సహా బ్రిక్స్ దేశాలకు చెందిన దాదాపు 160 మంది కళాకారులు ‘బ్రిక్స్ సింఫనీ’ పేరుతో ప్రదర్శన ఇచ్చారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్ వంటి శాస్త్రీయ నృత్యాలతో పాటు భారతీయ సంప్రదాయ వాద్య వాయిద్యాలు ఈ విందు ప్రత్యేకతను మరింత పెంచాయి.
