రాజీ మార్గమే రాజమార్గం... లోక్ అదాలత్ లో భారీ సంఖ్యలో కేసుల పరిష్కారం..

రాజీ మార్గమే రాజమార్గం... లోక్ అదాలత్ లో భారీ సంఖ్యలో కేసుల పరిష్కారం..
  • జాతీయ లోక్ అదాలత్ లో పలువురు జడ్జీలు
  • ఉమ్మడి నల్గొండ, మహబూబ్​నగర్, మెదక్​ జిల్లాల్లో  పెద్ద సంఖ్యలో కేసుల పరిష్కారం

నల్గొండ/వనపర్తి/హుజూర్ నగర్/ సిద్దిపేట రూరల్, వెలుగు:  రాజీ మార్గంతోనే కేసులకు సత్వర పరిష్కారమని, ఎలాంటి ఖర్చు లేకుండా వెంటనే న్యాయం పొందేందుకు లోక్​ అదాలత్​ చక్కటి వేదిక అని పలువురు జడ్జీలు తెలిపారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్​నగర్, మెదక్​ జిల్లాల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్​ అదాలత్​లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయి. 

ఎక్కడెక్కడ.. ఏ కేసులు పరిష్కారం...

నల్లగొండ జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌‌‌‌లో 12,283 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన జడ్జి పి. వసంత్ తెలిపారు. పెండింగ్, ప్రీ-లిటిగేషన్ కేసులు కలిపి పెద్ద సంఖ్యలో పరిష్కారం కాగా, బాధితులకు రూ. 8.5 కోట్లకు పైగా పరిహారం, రికవరీ సొమ్ము అందజేశారు. ముఖ్యంగా వాహన ప్రమాద కేసుల్లో రూ. 7.62 కోట్ల నష్టపరిహారాన్ని మంజూరు చేయడంతో పాటు, ట్రాఫిక్ చలాన్లు, క్రిమినల్, సివిల్, బ్యాంకు రికవరీ కేసులు కూడా పెద్ద సంఖ్యలో ఇరువర్గాల అంగీకారంతో ముగిశాయి. 

హుజూర్ నగర్ కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన మెగా లోక్ అదాలత్‌‌‌‌లో కక్షిదారులు ఎటువంటి వివాదాలకు తావులేకుండా సర్దుబాటుతో కేసులకు ముగింపు పలకాలని సీనియర్ సివిల్ జడ్జి నక్క శ్యాంసుందర్ కోరారు. అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన్ మాట్లాడుతూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే లోక్ అదాలత్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు సూచించారు.

వనపర్తి జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌‌‌‌లో వివిధ రకాల 6,617 కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన జడ్జి బాకరాజు శ్రీనివాసరావు వెల్లడించారు. కోర్టుల్లో పెండింగ్‌‌‌‌లో ఉన్న కేసులను సద్వినియోగం చేసుకుని ప్రశాంత జీవితాన్ని గడపాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో 1,639 క్రిమినల్ కేసులు, 19 సివిల్ కేసులు, 4,959 ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారం పొందాయి.

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా కేసుల పరిష్కారంతో పాటు దివ్యాంగుల సంక్షేమం, పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ, ఆర్ సేటి ద్వారా శిక్షణ, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. 

ఎంప్లాయిమెంట్ డిపార్ట్‌‌‌‌మెంట్ ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఇంటర్వ్యూలలో 175 మందికి గానూ 30 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు లీడ్ బ్యాంకు ద్వారా రుణాలను పొందే అవకాశాన్ని కల్పించినట్లు జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ చైర్మన్ సుదర్శన్ తెలిపారు.