చెరువుల వద్ద నిమజ్జనానికి పర్మినెంట్ ఏర్పాట్లు.. గణేష్ మండపాలకు ఫ్రీ కరెంట్: సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి

చెరువుల వద్ద నిమజ్జనానికి పర్మినెంట్ ఏర్పాట్లు.. గణేష్ మండపాలకు ఫ్రీ కరెంట్: సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి ఉత్సవాలను అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోందని సీఎం రేవంత్‌‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీ ఆవరణలోని శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్‌‌లో హైదరాబాద్ నగర పరిధిలో గణేశ్ ఉత్సవ ఏర్పాట్లపై సీఎం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేశ్‌‌తో పాటు జీహెచ్‌‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ, హైడ్రా కమిషనర్లు, పోలీస్ ఉన్నతాధికారులు, గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. 

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంప్రదాయాన్ని పునరుద్ధరిస్తూ ఉత్సవ కమిటీల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే స్వయంగా ఈ సమీక్ష చేపట్టానని సీఎం తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఉత్సవాలు విజయవంతం చేసేందుకు నిర్వాహకుల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద ముందస్తుగా దరఖాస్తు చేసుకుని ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. 

నగరవ్యాప్తంగా ఎక్కడెక్కడ మండపాలు ఏర్పాటు చేస్తున్నారనే సమాచారాన్ని పోలీసు శాఖకు ముందుగానే తెలియజేస్తే ట్రాఫిక్ నియంత్రణ, పటిష్ట బందోబస్తు నిర్వహణకు వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. మండపాలకు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, ప్రత్యేక అతిథులను ఆహ్వానించే పక్షంలో ఆ వివరాలను తప్పనిసరిగా స్థానిక పోలీస్ కమిషనరేట్లకు అందించాలని నిర్వాహకులను సీఎం కోరారు. 

నిరంతరం పర్యవేక్షణ ఉండాలి..

చెరువుల అభివృద్ధి పనుల సమయంలోనే భారీ విగ్రహాల నిమజ్జనానికి వీలుగా క్రేన్ల ఏర్పాటు, అనువైన ప్లాట్‌‌ఫారాలు, వెడల్పాటి రహదారుల నిర్మాణంలో తగిన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్​రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు మున్సిపల్, పోలీస్ శాఖలు సంయుక్తంగా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని స్పష్టం చేశారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయడంతో పాటు వివిధ శాఖల మధ్య సమన్వయానికి ప్రత్యేక నోడల్ అధికారులను నియమించాలని ఆదేశించారు.