మీటర్ రీడర్లను తొలగించడం లేదు.. పుకార్లను నమ్మొద్దు : మెట్రో వాటర్ బోర్డు

మీటర్ రీడర్లను తొలగించడం లేదు.. పుకార్లను నమ్మొద్దు : మెట్రో వాటర్ బోర్డు
  • మంగళవారం ప్రత్యేక సమావేశం

హైదరాబాద్ సిటీ, వెలుగు: మెట్రో వాటర్ బోర్డులో పనిచేస్తున్న మీటర్ రీడర్లను తొలగించడం లేదని, ఈ అంశంలో వస్తున్న వార్తలు పుకార్లేనని వాటర్ బోర్డు స్పష్టం చేసింది. వారిని ఉద్యోగాల నుంచి తొలగించే ఉద్దేశం తమకు లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని కోరింది. తమను క్రమబద్ధీకరించాలని కోరుతున్న మీటర్ రీడర్ల విజ్ఞప్తిపై వాటర్ బోర్డు సానుకూలంగా స్పందించింది. వారిని అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ విధానంలో కొనసాగించాలని కోరుతూ ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించామని, ప్రస్తుతం ఈ అంశం సర్కారు పరిశీలన ఉందని పేర్కొంది. 

ఈ నేపథ్యంలో మంగళవారం ప్రభుత్వ స్థాయిలో ప్రత్యేక సమావేశం జరగనుందని అధికారులు తెలిపారు. సర్కారు నిర్ణయానికి అనుగుణంగానే తదుపరి చర్యలు ఉంటాయన్నారు. ఉద్యోగుల విజ్ఞప్తుల మేరకు గతంలో చేపట్టిన కొత్త టెండర్ల ప్రక్రియను బోర్డు తాత్కాలికంగా నిలిపివేసిందని తెలిపారు. 

మరోవైపు, మీటర్ రీడర్లకు సంబంధించి ఏజెన్సీలకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను గురువారం విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై ఎలాంటి అపోహలకు తావివ్వకుండా, కేవలం అధికారిక సమాచారాన్నే పరిగణలోకి తీసుకోవాలని కోరారు.