- తెలంగాణ ఆర్టీసీ క్లారిటీ
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచలేదని సంస్థ ప్రకటించింది. కేవలం పండుగల రద్దీ కోసం నడిపే స్పెషల్ బస్సుల్లో సాధారణం కన్నా 50 శాతం అదనంగా వసూలు చేస్తామని, ఇది ఎప్పటి నుంచో ఉందని వివరణ ఇచ్చింది. పండుగల టైంలో తిరుగు ప్రయాణంలో బస్సులు ఖాళీగా రావాల్సి వస్తున్నందున డీజిల్, నిర్వహణ ఖర్చుల భర్తీకి మాత్రమే ఈ అదనపు వసూళ్లు ఉంటాయని స్పష్టత ఇచ్చింది. ఆర్టీసీ బస్సు ఛార్జీలను అడ్డగోలుగా పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల జేబులకు చిల్లులు పెడ్తోందంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ లో చేసిన పోస్టును యాజమాన్యం ఖండించింది.
స్పెషల్ బస్సు చార్జీలను సాధారణ చార్జీలతో పోల్చి చూపడం కరెక్ట్ కాదని పేర్కొంది. 2003 నాటి జీవో నెంబర్ 16 ప్రకారం పండుగలు, జాతరల కోసం నడిపే స్పెషల్ బస్సుల్లో ప్రయాణించే వారికి మాత్రమే 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నామని
స్పష్టం చేసింది.
