డాలర్ ఆధిపత్యానికి బ్రిక్స్ బ్రేక్!.. లోకల్ కరెన్సీల్లోనే దేశాల మధ్య వాణిజ్యం

డాలర్ ఆధిపత్యానికి బ్రిక్స్ బ్రేక్!.. లోకల్ కరెన్సీల్లోనే దేశాల మధ్య వాణిజ్యం
  • ఏక పక్ష యుద్ధాలు, టారిఫ్​లపై అభ్యంతరం
  • పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలపై ఆందోళన
  • 11 సభ్య దేశాల మధ్య పరస్పర ఆర్థిక సహకారం
  • స్టార్టప్స్, ఇన్నోవేషన్, పెట్టుబడులకు ప్రయార్టీ
  • ఉగ్రవాదంపై రాజీలేని పోరు.. పహల్గాం దాడిపై ఖండన
  • ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’కు సదస్సు ఆమోదం
  • యూఎన్ భద్రతా మండలి విస్తరణే ప్రధాన ఎజెండా
  • భారత్, బ్రెజిల్​కు చైనా, రష్యా సంపూర్ణ మద్దతు
  • గ్లోబల్ సౌత్ రూల్ టేకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాదు.. రూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావాలి
  • బార్డర్​లో శాంతితోనే బంధాలు బలపడ్తాయ్​: మోదీ
  • బ్రిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏ దేశానికీ వ్యతిరేకం కాదని కామెంట్
  • ప్రపంచ శాంతి కోసం కలిసి పనిచేద్దాం: జిన్​పింగ్​

న్యూ ఢిల్లీ: అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలర్ ఆధిపత్య ప్రభావాన్ని తగ్గించే దిశగా బ్రిక్స్ దేశాలు కీలక అడుగు వేశాయి. కూటమి దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరెన్సీల్లో నిర్వహించేలా ప్రోత్సహించాలని తీర్మానించాయి. దేశాల మధ్య ఆర్థిక సహకారం, స్టార్టప్స్ కోసం కొత్త నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను సృష్టించాలని నిర్ణయించాయి.  సులభతర వాణిజ్యం కోసం క్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెల్లింపుల వ్యవస్థల అనుసంధానంపై అధ్యయనం చేయాలని తీర్మానించాయి. బ్రిక్స్ పేమెంట్ టాస్క్ ఫోర్స్ ద్వారా సభ్య దేశాల బ్యాంకింగ్, మెసేజింగ్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పరస్పరం కలిసి పనిచేసేలా ఏర్పాట్లను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.   మారుతున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులకు తగ్గట్టుగా అంతర్జాతీయ వేదికల్లో సమూల మార్పులు రావాల్సిందేనని కూటమి కుండబద్ధలు కొట్టింది. శనివారం దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో సభ్యదేశాలన్ని ఏకాభిప్రాయంతో ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ను ఆమోదించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ) సంస్కరణలు, ఉగ్రవాదంపై రాజీలేని పోరు, రక్షణాత్మక వాణిజ్య విధానాలకు స్వస్తి పలకడమే లక్ష్యంగా విడుదల చేసిన ఈ తీర్మాన పత్రంలోని వివరాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పింగ్ సహా సభ్యదేశాల అధినేతల సమక్షంలో జరిగిన ఈ సదస్సులో గ్లోబల్ సౌత్ దేశాల గళాన్ని కూటమి బలంగా వినిపించింది. కాగా, విభేదాలు పక్కన పెట్టి ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా యూఏఈ, సౌదీ అరేబియా ఈ డిక్లరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆమోదం తెలిపాయి.

*కూటమి దేశాల మధ్య అంతర్గత వాణిజ్యాన్ని డాలర్‌‌కు ప్రత్యామ్నాయంగా లోకల్‌‌ కరెన్సీలో నిర్వహించాలని నిర్ణయించింది.

*ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో వర్ధమాన దేశాల పాత్ర పెరగాలని డిక్లరేషన్ తేల్చిచెప్పింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ముఖ్యంగా భారత్, బ్రెజిల్‌‌కు భద్రతా మండలిలో కీలక హోదా కల్పించేందుకు తాము కట్టుబడి ఉన్నామని చైనా, రష్యా వెల్లడించాయి.

*పశ్చిమాసియాలో కొనసాగుతున్న సైనిక ఘర్షణలను ఖండిస్తూ.. ఏకపక్ష యుద్ధ చర్యలు అంతర్జాతీయ శాంతికి విఘాతమని నేతలు స్పష్టం చేశారు. సముద్ర వాణిజ్య నౌకల భద్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా సుంకాలు (టారిఫ్‌‌లు) పెంచడం, పర్యావరణం ముసుగులో విధించే ఆంక్షలు గ్లోబల్ సరఫరా గొలుసును ఛిన్నాభిన్నం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

*2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద మారణకాండను డిక్లరేషన్ అత్యంత తీవ్రంగా ఖండించింది. 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ దాడిని ప్రస్తావిస్తూ.. ఉగ్రవాదానికి ఎలాంటి సాకు లేదా సిద్ధాంతం వర్తించదని పేర్కొంది. సరిహద్దు దాటి జరిగే ఉగ్రవాదం, ఉగ్రవాదులకు దక్కే ఆర్థిక సహాయం, సురక్షిత స్థావరాల నిర్మూలనకు ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చింది. ఉగ్రవాదాన్ని ఏ మతంతోనూ ముడిపెట్టకూడదని స్పష్టం చేసింది.

*అంతర్జాతీయ నిర్ణయాలు తీసుకునే ప్రక్రియల్లో ‘గ్లోబల్ సౌత్’ (అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల) భాగస్వామ్యాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ వ్యవస్థను ‘అధికారిక పిరమిడ్’లా కాకుండా, ‘భాగస్వామ్య వేదిక’గా మార్చాలని తీర్మానించారు.

*గ్లోబల్ గవర్నెన్స్  సంస్కరణల కోసం ప్రధాని మోదీ ప్రతిపాదించిన 10 సూత్రాలను బ్రిక్స్ సంస్కరణల రోడ్‌‌మ్యాప్‌‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 

*బ్రిక్స్ దేశాల నాయకులు మహిళలను కీలక నిర్ణయాధికారులుగా, ఆర్థిక వృద్ధి చోదక శక్తులుగా గుర్తించారు. మహిళా వ్యాపారవేత్తలకు పెట్టుబడులు, సాంకేతికత, మార్కెట్ అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ, 
2026 అక్టోబర్‌‌‌‌లో జరగనున్న 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ ద్వారా ఈ సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.

ఆధిపత్యం వద్దు.. భాగస్వామ్యం ముద్దు: ప్రధాని మోదీ

సదస్సు ముగింపు సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు.  ‘‘భారత బ్రిక్స్ అధ్యక్షతను విజయవంతం చేయడంలో మీరందించిన క్రియాశీలక సహకారానికి, మద్దతుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని కూటమితోపాటు సభ్య దేశాలకు తెలిపారు. ఈ ఏడాది జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఒక చారిత్రక మైలురాయి అని, బ్రిక్స్ 20వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. మానవ జీవితంలో 20 ఏండ్ల వయస్సు అనేది పరిపక్వత, బాధ్యతలతో కూడిన సరికొత్త దశకు నాంది పలుకుతుందని వివరించారు. ‘‘కాలం చెల్లిన పాత సంస్థలతో ఆధునిక ప్రపంచాన్ని నడపడం అసాధ్యం. ప్రాతినిధ్యం, బాధ్యత, విధివిధానాల రూపకల్పనలో సమూల సంస్కరణలు తక్షణ అవసరం. భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో, వాటిని నియంత్రించే నిబంధనల రూపకల్పనలో గ్లోబల్ సౌత్ దేశాలకు సమాన వాటా దక్కాలి. నేడు మనం ఆమోదించిన ఢిల్లీ డిక్లరేషన్ మన ఉమ్మడి లక్ష్యాలకు స్పష్టమైన రోడ్‌‌మ్యాప్‌‌ను అందించింది. ఈ సంకల్పాన్ని క్షేత్రస్థాయి ఫలితాలుగా మార్చాల్సిన గురుతర బాధ్యత మనందరిపై ఉంది’’ అని స్పష్టం చేశారు.

రూల్ టేకర్‌‌‌‌గా కాదు.. రూల్‌‌ షేపర్‌‌‌‌గా ఉండాలి

గ్లోబల్ సౌత్ దేశాలు ఇతరులు రూపొందించిన నిబంధనలను పాటించే స్థాయి (రూల్‌‌ టేకర్‌‌‌‌) నుంచి అంతర్జాతీయ నిబంధనలను నిర్దేశించే (రూల్ -షేపర్) స్థాయికి ఎదగాలని మోదీ పిలుపునిచ్చారు.  గ్లోబల్ సౌత్ దేశాల దౌత్యవేత్తలకు అవసరమైన చర్చల నైపుణ్యాలు, చట్టపరమైన శిక్షణ అందించడంలో భారత్ నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుత సంక్షోభాల్లో ముందుంటున్న ఈ దేశాలకు ప్రపంచ నిర్ణయాధికారాల్లోనూ సముచిత స్థానం దక్కాలని తేల్చిచెప్పారు. గ్లోబల్ గవర్నెన్స్‌‌లో సమూల మార్పుల కోసం 10 అంశాలతో కూడిన ‘బ్రిక్స్ రిఫార్మ్ రోడ్‌‌మ్యాప్’ను వచ్చే సదస్సు నాటికి సిద్ధం చేయాలని ప్రధాని మోదీ ప్రతిపాదించారు.

బ్రిక్స్ ఎవరికీ వ్యతిరేకం కాదు 

బ్రిక్స్ కూటమి ఏ దేశానికీ లేదా కూటమికీ వ్యతిరేకం కాదని, అందరినీ కలుపుకొని ముందుకు సాగడమే తమ విధానమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.  20 ఏండ్లు పూర్తి చేసుకున్న బ్రిక్స్ కూటమి కార్యకలాపాలు నిరంతరాయంగా సాగేందుకు వీలుగా ‘బ్రిక్స్ కంటిన్యుటీ అండ్ ఇంప్లిమెంటేషన్ మెకానిజం’ను ఏర్పాటు చేయాలని సూచించారు.  రెండు దశాబ్దాల ప్రస్థానం తర్వాత బ్రిక్స్ కూటమి పరిపక్వత సాధించే స్థాయికి  చేరుకుందని పేర్కొన్నారు. గత ఇరవై ఏండ్లలో భిన్న దృక్పథాలను గౌరవిస్తూ, పరస్పర ఏకాభిప్రాయంతో నడుస్తూ బ్రిక్స్ అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించిందని తెలిపారు.  బ్రిక్స్ దేశాల మధ్య ఉన్న ఐక్యత, ఏకాభిప్రాయాన్ని ప్రపంచ వేదికపై స్పష్టమైన, ఆచరణాత్మక ఫలితాలుగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని పిలుపునిచ్చారు.

గ్లోబల్ సౌత్ అగ్రగామి కూటమిగా..

బ్రిక్స్ దేశాలు ‘గ్లోబల్ సౌత్’ దేశాలకు అగ్రగామిగా నిలవాలని, వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఆత్మనిర్భరతకు ఇది ఒక నమూనా అని జిన్‌‌పింగ్ కొనియాడారు. అంతకుముందు ప్రధాని మోదీ కూడా బ్రిక్స్ కూటమిని బలోపేతం చేయాలని, ప్రపంచ సంస్కరణల కోసం పిలుపునిచ్చారు. గ్లోబల్ సౌత్ దేశాలు ప్రపంచ సంక్షోభాల్లో ముందుంటున్నప్పటికీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం వెనుకబడి ఉంటున్నాయని, ఈ ప్రివిలేజ్ పిరమిడ్‌‌ను భాగస్వామ్య వేదికగా మార్చాలని పిలుపునిచ్చారు.

అగ్రనేతలకు  మోదీ ఘన స్వాగతం

18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపం వేదికైంది. శనివారం జరిగిన ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు వచ్చిన కూటమి దేశాల అగ్రనేతలకు మోదీ ఆత్మీయ స్వాగతం పలికారు. రష్యా అధ్యక్షుడు  పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌‌పింగ్, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తాహ్ ఎల్-సిసి, అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌‌తో పాటు ఇతర సభ్య దేశాల ప్రతినిధులను ప్రధాని మోదీ స్వయంగా ఆహ్వానించారు. ప్రధాని మోదీ ప్రతిపాదించిన ‘హ్యుమానిటీ ఫస్ట్’ అనే ప్రజాకేంద్రీకృత సిద్ధాంతాన్ని భారత్ తన అధ్యక్ష ప్రసంగంలో స్పష్టం చేసింది. ఈ స్పూర్తితోనే, ‘సవాళ్లను తట్టుకునే శక్తి, వినూత్న ఆవిష్కరణలు, పరస్పర సహకారం, సుస్థిర అభివృద్ధి సాధనే ధ్యేయం’గా (రెసిలియెన్స్, ఇన్నోవేషన్, కో-ఆపరేషన్ అండ్ సస్టెయినబిలిటీ) బ్రిక్స్ సదస్సును భారత్ విజయవంతంగా ముందుకు నడిపించింది. 

పశ్చిమాసియా యుద్ధంతో ప్రయోజనం లేదు

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంతో  ప్రపంచానికి ఎలాంటి ఉపయోగంలేదని చైనా అధ్యక్షుడు షీ జిన్‌‌పింగ్ అన్నారు. ఈ సంఘర్షణ అంతర్జాతీయ సమాజం ఉమ్మడి ప్రయోజనాలను దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈ యుద్ధం ఆ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని సాధించడంలో తన వంతు పాత్ర పోషించడానికి తోటి బ్రిక్స్ సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉంది’ అని ఆయన అన్నారు. అలాగే, బ్రిక్స్ దేశాలన్నీ అన్ని రకాల రక్షణవాదాలను వ్యతిరేకించాలని, ప్రపంచ వాణిజ్య సంస్థ కేంద్రంగా పనిచేసే వాణిజ్య వ్యవస్థకు మద్దతు ఇవ్వాలన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన శిక్షాత్మక సుంకాలను ప్రస్తావిస్తూ, ఏకపక్ష సుంకాలను వ్యతిరేకించాలని, అన్ని రకాల సంరక్షణవాదాన్ని తిరస్కరించాలని బ్రిక్స్ దేశాలను కోరారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌లో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని జిన్ పింగ్ ప్రతిపాదించారు.

15 వేల మంది పోలీసుల బందోబస్తు

బ్రిక్స్ సదస్సు, జిన్‌‌పింగ్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 15,000 మందికి పైగా పోలీసు సిబ్బంది, 200 కంపెనీల బలగాలను మోహరించారు. విమానాశ్రయం నుంచి శాంతిపథ్ వరకు 700లకు పైగా సీసీటీవీ కెమెరాలతో పాటు, తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌‌ను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. శనివారం సాయంత్రం ప్రధాని మోదీతో జిన్ పింగ్​ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
15