- రూ.89 లక్షల కోట్లతో టాప్‌లో కొనసాగుతున్న ఎలాన్ మస్క్
- ఒకప్పుడు నెంబర్ 2 గా ఉన్న ఆర్నాల్ట్ ఇప్పుడు 11వ ప్లేస్‌లో
- ఆసియాలో అత్యంత ధనవంతుడు గౌతమ్ అదానీ
- బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో 18 వ స్థానం కైవసం
న్యూఢిల్లీ: అమెరికా టెక్ కంపెనీల హవా కొంచెం కూడా తగ్గడం లేదు. ప్రపంచ కుబేరుల జాబితాలో వీళ్ల ఆధిపత్యం కొనసాగుతోంది. తాజాగా ఫ్రాన్స్ ఫ్యాషన్ బ్రాండ్ లూయిస్విట్టన్అధిపతి బెర్నార్డ్ ఆర్నాల్ట్ బ్లూమ్‌బర్గ్ రియల్‌టైమ్ బిలియనీర్ ఇండెక్స్‌లో 11వ స్థానానికి పడిపోవడంతో టాప్ 10 స్థానాలను అమెరికన్లే దక్కించుకున్నారు. ఇరాన్ యుద్ధంతో దూబాయ్‌లో లూయిస్ విట్టన్ సేల్స్ పడిపోవడం, చైనాలో డిమాండ్ తగ్గడంతో ఆర్నాల్ట్ సంపద తగ్గుతోంది.
మరోవైపు ఏఐ విప్లవంతో పాటు స్పేస్ ఎక్స్ ఐపీఓ కారణంగా అమెరికా వ్యాపారవేత్తల సంపద దూసుకుపోతూనే ఉంది. 2012లో బ్లూమ్‌బర్క్ బిలియనీర్ ఇండెక్స్ ప్రారంభమైన తర్వాత మొదటి పది స్థానాలను కేవలం అమెరికన్లే దక్కించుకోవడం ఇదే మొదటిసారి. టెస్లా బాస్ ఎలాన్ మస్క్ ఏకంగా 935 బిలియన్ డాలర్ల (రూ.88.82 లక్షల కోట్ల) సంపదతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఈ ఒక్క ఏడాదిలోనే ఆయన సంపద 316 బిలియన్ డాలర్లు (రూ.30 లక్షల కోట్లు) పెరిగింది. గూగుల్ లారీ పేజ్ (290 బిలియన్ డాలర్లు), అమెజాన్ జెఫ్ బెజోస్ (278 బిలియన్ డాలర్లు) టాప్ మూడు పొజిషన్లలో ఉన్నారు.
ఆసియాలో అదానీ టాప్
కేవలం ఇండియాలోనే కాదు మొత్తం ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతుడిగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నిలిచారు. బ్లూమ్‌బర్గ్ రియల్‌టైమ్ బిలియనీర్ ఇండెక్స్‌లో ఆయన 18 వ ప్లేస్ దక్కించుకున్నారు. అదానీ సంపద 109 బిలియన్ డాలర్లు (రూ.10.35 లక్షల కోట్లు) గా ఉంది. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ 83 బిలియన్ డాలర్ల (రూ.7.88 లక్షల కోట్ల) తో 24 వ ప్లేస్‌లో ఉన్నారు. ఇండియాలో అంబానీ రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. కానీ, ఆసియాలో మాత్రం నాలుగో ప్లేస్‌కి పడిపోయారు. అదానీ సంపద ఈ ఏడాది రూ.2.28 లక్షల కోట్లు పెరగగా, ముకేశ్ అంబానీ సంపద రూ.2.3 లక్షల కోట్లు తగ్గింది.
