మట్టి గణపతికి పెరిగిన డిమాండ్.. గతంతో పోలిస్తే జనాల్లో ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలపై ఆసక్తి

మట్టి గణపతికి పెరిగిన డిమాండ్.. గతంతో పోలిస్తే జనాల్లో ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలపై ఆసక్తి
  •     వరంగల్ నగరంలో ఏటా 
  • 5 వేలకు పైగా గణనాథుల విగ్రహాల ప్రతిష్ఠాపన
  •     గతంతో పోలిస్తే జనాల్లో ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలపై పెరిగిన అవగాహన
  •     డిమాండ్ పెరగడంతో రేట్లు పెంచారంటున్న కొనుగోలుదారులు
  •     ముడి సరుకు ధరల పెరుగుదలే కారణమంటున్న వ్యాపారులు

హనుమకొండ, వెలుగు: గణనాథుడి ఉత్సవాలకు వేళైంది. సోమవారం వినాయక చవితి నేపథ్యంలో ఇప్పటికే పలుచోట్ల ఆగమన ఉత్సవాలు నిర్వహించారు. మండపాల నిర్వాహకులు గణపతి విగ్రహాల ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. కాగా, వరంగల్ నగరంలో కొన్నేండ్లుగా ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతి విగ్రహాల ట్రెండ్ కనిపిస్తోంది. ఓ వైపు పీవోపీ విగ్రహాలు నీటిలో కరగకుండా మిగిలిపోవడం, వాటర్​పొల్యూషన్​అవుతుండడంతో ప్రజలు పర్యావరణ హిత మట్టి విగ్రహాలకు మొగ్గుచూపుతున్నారు.

ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే ఈసారి మట్టి విగ్రహాలకు డిమాండ్ పెరిగింది. కానీ డిమాండ్‌‌‌‌‌‌‌‌కు తగ్గట్టుగా మార్కెట్‌‌‌‌‌‌‌‌లో మట్టి విగ్రహాలు అందుబాటులో లేకపోవడంతో కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో పీవోపీ విగ్రహాలను కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆఫీసర్లు కాస్త ముందుగానే తయారీదారులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తే పర్యావరణ హిత వినాయక విగ్రహాల ఉత్పత్తి మరింత పెరిగేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏటా 5 వేలకు పైగా విగ్రహాలు

వరంగల్ నగరంలో ప్రధానంగా ములుగు రోడ్డు నుంచి కాకతీయ మెడికల్ కాలేజీ, భద్రకాళి టెంపుల్ రోడ్డు, ఎంజీఎం సెంటర్ ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు అమ్మకానికి పెడుతుంటారు. వీటితోపాటు హనుమకొండ అంబేద్కర్ జంక్షన్, భీమారం, రామారం, చింతగట్టు క్రాస్, హసన్‌‌‌‌‌‌‌‌పర్తితోపాటు ట్రైసిటీ నలుమూలలా గణపతి ప్రతిమల విక్రయాలు జరుగుతున్నాయి.

 ఏటా వరంగల్ ట్రైసిటీ వ్యాప్తంగా 5 వేలకు పైగా వినాయక విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నట్లు పోలీసు ఆఫీసర్లు చెబుతున్నారు. కొన్నేండ్లుగా నగరంలో ప్రతిష్ఠిస్తున్న విగ్రహాల్లో సింహభాగం పీవోపీ విగ్రహాలదే. అయితే నిమజ్జనం అనంతరం పీవోపీ విగ్రహాలు నీటిలో ఈజీగా కరగకపోవడంతోపాటు, వాటిని అందంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగించే కెమికల్స్​ నీటి కాలుష్యానికి కారణమవుతున్నాయి.

ఎకో ఫ్రెండ్లీ గణపతికి పెరిగిన రేట్లు..

పీవోపీ విగ్రహాల వల్ల కాలుష్యం పెరుగుతుండటంతోపాటు సోషల్ మీడియా ద్వారా మట్టి విగ్రహాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. గతంలో పీవోపీ విగ్రహాలను ప్రతిష్ఠించిన వారిలో చాలామంది ఇప్పుడు మట్టి విగ్రహాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా ఈసారి ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతి విగ్రహాలకు డిమాండ్ పెరిగింది. మట్టి విగ్రహాలు ప్రధానంగా హనుమకొండ అంబేద్కర్ జంక్షన్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, రామన్నపేట, లేబర్ కాలనీ తదితర ప్రాంతాల్లో మాత్రమే లభిస్తున్నాయి. 

డిమాండ్ ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా సప్లయ్​ లేకపోవడం సమస్యగా మారింది. పెరిగిన డిమాండ్‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని తయారీదారులు ఈసారి ధరలను గణనీయంగా పెంచారని కొనుగోలుదారులు చెబుతున్నారు. గతంలో రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు ఉన్న కొన్ని మట్టి విగ్రహాల ధరలు ప్రస్తుతం రూ.10 వేలకుపైగా పలుకుతున్నాయని అంటున్నారు. 

నిరుడు రూ.15 వేల వరకు ఉన్న విగ్రహాలకు ప్రస్తుతం రూ.20 వేలకుపైగా ధర చెబుతున్నారని పేర్కొంటున్నారు. అయితే మట్టి ప్రతిమల తయారీకి అవసరమైన ముడిసరుకు ధరలు కూడా పెరిగాయని తయారీదారులు, వ్యాపారులు చెబుతున్నారు. ముడిసరుకు ధరల పెరుగుదల ప్రభావం విగ్రహాల ధరలపైనా పడిందని వివరిస్తున్నారు.

తయారీ తక్కువ.. డిమాండ్ ఎక్కువ

పీవోపీ విగ్రహాలు, పర్యావరణంపై జనాల్లో అవగాహన పెరిగినా అవసరానికి సరిపడా మట్టి విగ్రహాల సప్లయ్ లేకుండా పోయిందని  కొనుగోలుదారులు అంటున్నారు. వాస్తవానికి మట్టి, పీవోపీ విగ్రహాల తయారీని కార్మికులు నాలుగైదు నెలల ముందు నుంచే స్టార్ట్ చేస్తుంటారు. అవసరాన్ని బట్టి ఇతర ప్రాంతాల కార్మికులను రప్పించుకుని పనులు చేస్తుంటారు.

తయారీ మొదలు పెట్టే సమయంలోనే వారికి అవగాహన కల్పిస్తే తయారీదారులు పీవోపీకి బదులు మట్టి విగ్రహాల వైపు మల్లే అవకాశం ఉండేది. కానీ ఆ స్థాయిలో పొల్యూషన్ కంట్రోల్, మున్సిపల్ ఇతర శాఖల అధికారులు తయారీదారులకు అవగాహన కల్పించలేదనే విమర్శలున్నాయి. తయారీ సమయానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే ఓ వైపు మట్టి విగ్రహాల ఉత్పత్తి పెరగడంతో పాటు నీటి కాలుష్యం జరగకుండా ఉంటుందని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. మున్ముందైనా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలి

వినాయక చవితి సందర్భంగా ప్రతిష్ఠించే పీవోపీ విగ్రహాలను జలాశయాల్లో నిమజ్జం చేయడంతో నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గి జలచరాలు అంతరించిపోతున్నాయి. వాటి వల్ల మానవాళి మనుగడకు కూడా ముప్పు వాటిల్లుతోంది. అందుకే ప్రజలు పర్యావరణ హితమైన మట్టి విగ్రహాలనే నెలకొల్పాలి. ఆ దిశగా ఆఫీసర్లు తయారీదారులకు అవగాహన కల్పించాలి. పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి కృత్రిమ కొలనులు ఏర్పాటు చేసి, పర్యవరణాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి. 
- ప్రకాశ్, పర్యావరణ ప్రేమికుడు