పేదల స్థలాలను 22ఏలో చేర్చి నరకం చూపిస్తున్నరు..వెంటనే వారి స్థలాలను 22ఏ నుంచి తొలగించాలి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

పేదల స్థలాలను 22ఏలో చేర్చి నరకం చూపిస్తున్నరు..వెంటనే వారి స్థలాలను 22ఏ నుంచి తొలగించాలి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
  • ధరణితో రూ.30 వేల కోట్ల భూమిని బీఆర్ఎస్​ కాజేసింది 
  • ధరణి లావాదేవీలపై ఇంకెప్పుడు కాగ్​కు రిపోర్ట్​ఇస్తరని నిలదీత

హైదరాబాద్, వెలుగు: పేదల స్థలాలను 22ఏలో చేర్చి వారికి రాష్ట్ర ప్రభుత్వం నరకం చూపిస్తున్నదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. వెంటనే వారి స్థలాలను 22ఏ నుంచి తొలగించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం.. ప్రభుత్వ, అసైన్డ్, సీలింగ్, సీలింగ్ మిగులు, దేవాదాయ, వక్ఫ్ భూములను రక్షించాల్సిన 22ఏ నిబంధన ఇప్పుడు పేదల పాలిట శాపంగా మారిందన్నారు. ఏ భూమి 22ఏలోకి వెళ్తుందో, ఏ భూమి బయటకు వస్తుందో స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతో బడా నేతలు లొసుగులను వాడుకుంటూ రాత్రికి రాత్రే పేదలకు చెందిన 60 గజాలు, 100 గజాల ఇళ్లను నిషేధిత జాబితాలో పెట్టి నరకం చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు.

22ఏతో పేద ప్రజలను ఇబ్బంది పెట్టినందుకు మంత్రి పొంగులేటి సారీ చెప్పారని..దీనికి క్షమాపణ చెపితే సరిపోదని తన పదవికి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన అసెంబ్లీలో 22ఏపై చర్చ సందర్భంగా  మాట్లాడారు. "గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణితో రూ.30 వేల కోట్ల విలువైన భూమిని కొల్లగొట్టింది. ఇప్పుడు రూ.33 వేల కోట్ల విలువ చేసే భూములను ఫీనిక్స్, అన్విత, సువర్ణ వంటి రియల్ ఎస్టేట్ సంస్థలు కబ్జా చేస్తుంటే ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం కొమ్ముకాస్తోందని నిలదీశారు. అలాగే హైదరాబాద్ పరిధిలో ఆదిత్య కన్‌‌స్ట్రక్షన్స్ సంస్థ మూసీ నాలా, చెరువును ఆక్రమించి 60–70 అంతస్తుల టవర్లు నిర్మిస్తున్నట్లు సర్వే ఆఫ్ ఇండియా టోపోషీట్ ఆధారంగా స్వయంగా హైడ్రా నోటీసులు ఇచ్చినా, ఆ భవనాన్ని కూల్చకుండా ఎందుకు రక్షిస్తున్నారని ప్రశ్నించారు.

నాడు ధరణి, నేడు భూభారతి అని పేర్లు మార్చినా వ్యవస్థలో ఎలాంటి మార్పు రాలేదని ఏలేటి మహేశ్వర్​రెడ్డి విమర్శించారు. ధరణి లావాదేవీల పూర్తి వివరాలను ఇప్పటివరకు కాగ్ ఆడిట్‌‌కు ఎందుకు సమర్పించలేదో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. ధరణి నిర్వహణ బాధ్యతలను విదేశీ సంస్థ అయిన ఐఎల్ అండ్ ఎఫ్ఎస్‌‌కు కట్టబెట్టిన వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని కోరారు. పలు జిల్లాల్లో కలెక్టర్లు చేసిన తప్పిదాలు బయటపడినా వారిపై ఎలాంటి విచారణ జరపలేదని ఆరోపించారు. అన్యాక్రాంతమైన అటవీ, వక్ఫ్, దేవాదాయ, భూదాన్ భూములు లక్షల ఎకరాల్లో ఉన్నాయని, కేవలం 26 లక్షల ఎకరాల భూములను లెక్కగట్టినా నేటి మార్కెట్ విలువ ప్రకారం రూ.26 లక్షల కోట్ల విలువవుతుందని చెప్పారు. ఆ భూములను స్వాధీనం చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వ అప్పులన్నీ తీరిపోయి సంక్షేమ పథకాలకు పుష్కలంగా నిధులు సమకూరుతాయని సూచించారు.