న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌కు రాకుండా తప్పించుకోవడానికి టాటా సన్స్ వేసిన ఎత్తుగడ ఫలించలేదు. తమ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోరుతూ అందజేసిన దరఖాస్తును ఆర్బీఐ తిరస్కరించింది.
ఈ నిర్ణయంతో దేశంలోని అతిపెద్ద వ్యాపార సమూహానికి చెందిన హోల్డింగ్ కంపెనీ పబ్లిక్ లిస్టింగ్ అనివార్యంగా మారింది. ఆర్బీఐ లిస్టులోని 16 అప్పర్ లేయర్ నాన్–-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలలో టాటా సన్స్ కూడా ఉంది. దీంతో ఈ సంస్థపై నిఘా మరింత పెరిగింది.
ఈ ఏడాది మార్చి నాటికి టాటా సన్స్ సంస్థ ఆస్తుల విలువ రూ.2.01 లక్ష కోట్లకు చేరింది. పబ్లిక్ లిస్టింగ్ కారణంగా కంపెనీపై బయటి వాటాదారులు, విదేశీ సంస్థల ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. స్టాక్ మార్కెట్లో నమోదు కాగానే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫలితాలను ప్రకటించాలి.
దీనివల్ల సెమీ కండక్టర్లు, రక్షణ రంగం వంటి భారీ ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టడం కష్టమవుతుంది. స్వల్పకాలిక లాభాల కోసం పబ్లిక్ ఇన్వెస్టర్లు డిమాండ్ చేసే అవకాశం ఉంది. అందుకే ఐపీఓకు వెళ్లడానికి టాటా సన్స్ ఇష్టపడటం లేదు.
