న్యూయార్క్: అమెరికా యంగ్ ప్లేయర్ బెన్ షెల్టన్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సంచలనం సృష్టించాడు. శుక్రవారం రాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్ షెల్టన్ 4–6, 6–3, 6–3, 7–5తో 11వ సీడ్ ఫ్రాన్సెస్ తియాఫో (అమెరికా)పై గెలిచి తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్‌కు అనూహ్యంగా చెక్ పెట్టిన షెల్టన్ ఈ మ్యాచ్‌లోనూ అద్భుతమైన సర్వీస్‌లతో ఆకట్టుకున్నాడు.
3 గంటలా 17 నిమిషాల మ్యాచ్‌లో 20 ఏస్‌లతో హడలెత్తించాడు. తొలి సెట్ చేజార్చుకున్నా.. తర్వాతి మూడు సెట్లలో బేస్‌లైన్ ఆటతో చెలరేగాడు. ఫలితంగా తన సర్వీస్‌లో 75 శాతం పాయింట్లు రాబట్టాడు. 11 బ్రేక్ పాయింట్లలో ఐదింటిని కాచుకున్నాడు. 47 విన్నర్లు, 31 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేశాడు. ఓవరాల్‌గా ఆండీ రాడిక్ (2003) తర్వాత మెన్స్ సింగిల్స్ టైటిల్ గెలుచుకునేందుకు షెల్టన్ ఒక్క విజయం దూరంలో ఉన్నాడు.
మరో సెమీస్‌లో టాప్‌సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–3, 7–6 (9/7), 7–6 (8/6)తో కరెన్ కచనోవ్ (రష్యా)పై నెగ్గాడు. దాదాపు మూడు గంటలు సాగిన మ్యాచ్‌లో జ్వెరెవ్ తొలి సెట్ ఈజీగా గెలిచినా.. తర్వాతి రెండు సెట్లను టైబ్రేక్‌లో సొంతం చేసుకున్నాడు. 15 ఏస్‌లు, 38 విన్నర్లు కొట్టాడు. మూడు బ్రేక్ పాయింట్లలో రెండింటిని సద్వినియోగం చేసుకున్నాడు.
