- అలెగ్జాండర్స్ కంజెనిటల్ ఫ్యాక్టర్-7 డెఫిషియెన్సీ ఉన్న బాధితురాలికి ఆపరేషన్ సక్సెస్
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ దవాఖాన డాక్టర్లు మరో అరుదైన వైద్య విజయాన్ని సాధించారు. అరుదైన జన్యుపరమైన సమస్యతో బాధపడుతున్న గర్భిణికి విజయవంతంగా డెలివరీ చేసి తల్లీబిడ్డకు పునర్జన్మ ప్రసాదించారు. సూర్యాపేట జిల్లాకు చెందిన యడ్ల లక్ష్మికి ఐదు లక్షల మందిలో ఒకరికి మాత్రమే వచ్చే అలెగ్జాండర్స్ కంజెనిటల్ ఫ్యాక్టర్-–7 డెఫిషియెన్సీ అనే రక్త రుగ్మత ఉంది. గర్భిణిగా ఉన్న ఆమెను గత నెల 21న గాంధీ హాస్పిటల్లో చేర్పించగా, డాక్టర్లు ఈ వ్యాధిని గుర్తించారు.
ప్రసవ సమయంలో రక్తస్రావం ఆగక ప్రాణాలకే ముప్పు ఉండే క్లిష్ట పరిస్థితిలో వారు అప్రమత్తంగా వ్యవహరించారు. కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక చొరవతో కార్పొరేట్ హాస్పిటల్స్లో దాదాపు రూ.40 లక్షలు ఖర్చయ్యే అత్యంత ఖరీదైన రీకాంబినెంట్ ఫ్యాక్టర్–-7 ఇంజెక్షన్లను సమకూర్చారు.
డాక్టర్ల నిరంతర పర్యవేక్షణలో ఈ నెల 11న లక్ష్మి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఎలాంటి ఖర్చు లేకుండా సర్కారు దవాఖానలో ఈ హైరిస్క్ ప్రసవాన్ని విజయవంతం చేసిన గైనకాలజీ డాక్టర్లను డీఎంఈ వాణి, సూపరింటెండెంట్ ఉషారాణి అభినందించారు. డాక్టర్లకు బాధితురాలి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
