- క్యూర్ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ అభ్యంతరం
- అంశాలవారీగా స్పష్టత ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు
- బిల్లుల ఆమోదం తర్వాత సభ నిరవధిక వాయిదా
హైదరాబాద్, వెలుగు: కోర్ అర్బన్ రీజియన్ సమగ్ర పరిపాలన (క్యూర్) బిల్లుతోపాటు రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్యాలను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘తెలంగాణ ప్రజా విశ్వాసం బిల్లు’కు శాసనమండలి (పెద్దల సభ) ఆమోదం తెలిపింది. మండలిలో ఈ రెండు బిల్లులను పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టగా, ప్రజా విశ్వాస బిల్లుకు సభ్యుల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. క్యూర్ బిల్లుపై మాత్రం వాడీవేడి చర్చ జరిగింది.
అనంతరం ఆ బిల్లును కూడా మండలి ఆమోదించింది. ఈ సందర్భంగా రెండు బిల్లుల ప్రాముఖ్యతను మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన 'జన్ విశ్వాస' చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలోనూ చిన్నచిన్న నేరాలకు జైలు శిక్షలు లేకుండా కేవలం జరిమానాలు విధించేలా తెలంగాణ ప్రజా విశ్వాస బిల్లును రూపొందించినట్లు మంత్రి తెలిపారు.
వివిధ వ్యాపార సంబంధ చట్టాల్లోని చిన్నపాటి, సాంకేతిక ఉల్లంఘనలను నేరపూరిత పరిధి నుంచి మినహాయించడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలు చిన్నపాటి సాంకేతిక లోపాలకే జైలు శిక్షలు లేదా సుదీర్ఘ న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే భయం లేకుండా స్వేచ్ఛగా పెట్టుబడులు పెట్టేందుకు ఈ చట్టం తోడ్పడుతుందని వెల్లడించారు.
క్యూర్ బిల్లు రాజ్యాంగ ఉల్లంఘన: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యూర్ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి ఈ బిల్లును రూపొందించారన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల ప్రమేయం లేకుండా కేవలం సీఎం, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మాత్రమే అపెక్స్ కౌన్సిల్‌లో సభ్యులుగా క్యూర్ పాలసీని తయారు చేశారని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.
క్యూర్, ప్యూర్, రేర్ పేరిట కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. బిల్లులో అనేక సాంకేతిక సమస్యలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం పరిశీలించాలని సూచించారు. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ ఢిల్లీ, ముంబై సిటీల్లో రూపొందించిన పాలసీలను కోర్టులు తిరస్కరించాయని గుర్తుచేశారు. అనంతరం శ్రవణ్ లేవనెత్తిన అంశాలపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు.
బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి క్యూర్ బిల్లులోని పలు అంశాలను సభ దృష్టికి తీసుకొచ్చి, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బిల్లును పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని సూచించారు. క్యూర్ బిల్లుపై ఎమ్మెల్సీ శ్రవణ్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఏవీఎన్ రెడ్డి తెలిపిన అభ్యంతరాలపై మంత్రి శ్రీధర్‌బాబు వివరణ ఇచ్చారు. రాజ్యాంగ నిబంధనలకు పూర్తిగా అనుగుణంగానే క్యూర్ బిల్లును రూపొందించామని స్పష్టం చేశారు. క్యూర్ బిల్లుపై చర్చ ముగిసిన అనంతరం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభను నిరవధికంగా వాయిదా వేశారు
