- మరో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా జిమ్మీ టాటా నియామకం
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. బ్యాంక్ బోర్డు శనివారం సమావేశమై, ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఆర్‌బీఐ ఆమోదం కోసం పంపింది.
ప్రస్తుత ఎండీ, సీఈఓ శశిధర్ జగదీశన్ మరోసారి పదవిలో కొనసాగనని ఇప్పటికే ప్రకటించారు. ఆయన పదవీ కాలం వచ్చే నెల 26తో ముగుస్తుంది. ఈ క్రమంలోనే కొత్త సీఈఓ ఎంపికను బ్యాంక్ వేగవంతం చేసింది. కొత్తగా ఎంపికయ్యే వ్యక్తి మూడేళ్లు పదవిలో ఉంటారు.
2023లో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌తో విలీనం తర్వాత షేర్లు పెద్దగా రిటర్న్స్ ఇవ్వకపోవడం, కార్పొరేట్ గవర్నెన్స్‌పై వచ్చిన ప్రశ్నల నేపథ్యంలో ఈ నాయకత్వ మార్పు జరుగుతోంది. శ్రీనివాస రంగన్‌ను మరో ఏడాది పాటు (నవంబర్ 2026 నుంచి 2027 వరకు) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
జిమ్మీ టాటాను మూడేళ్ల కాలానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించాలని నిర్ణయించింది. వీటితో పాటు పర్యవేక్షణ, సబ్సిడరీల సమన్వయం పెంచేందుకు మరో హోల్-టైమ్ డైరెక్టర్ పోస్టును సృష్టించనున్నారు. దీంతో బోర్డులోని హోల్-టైమ్ డైరెక్టర్ల సంఖ్య నాలుగుకి చేరుతుంది.
