కాశీబుగ్గ, వెలుగు: ఎస్‌ఐఆర్-2026లో భాగంగా శనివారం వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న స్పెషల్ క్యాంపెయిన్ ప్రక్రియను కలెక్టర్ సత్య శారద పరిశీలించారు. కొత్తవాడ ఆటోనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, శివనగర్ ప్రభుత్వ పాఠశాలతో పాటు మామునూర్‌లోని 166, 167, 168 పోలింగ్ కేంద్రాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఫామ్-6, 7, 8 దరఖాస్తుల స్వీకరణ, ఎస్‌ఐఆర్‌లో భాగంగా నోటీసుల పంపిణీ, సంబంధిత పత్రాల పరిశీలన, రికార్డుల నమోదు తదితర ప్రక్రియలను పరిశీలించారు.
ఓటర్ల నుంచి వచ్చిన అభ్యంతరాలు, దరఖాస్తుల పరిశీలనపై ఆఫీసర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా చూడడంతో పాటు, అనర్హులు లేదా తప్పుగా నమోదైన వివరాలపై వచ్చే అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో వరంగల్ ఆర్డీవో సుమ తదితరులు పాల్గొన్నారు.
