గణేశుడి ఉత్సవాలు.. కళాకారులకు సిరుల పండుగ!

గణేశుడి ఉత్సవాలు.. కళాకారులకు సిరుల పండుగ!

వినాయక చవితి వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ నగరంలో గణేశ్ విగ్రహాలు తయారుచేసే కళాకారులకు చేతినిండా పని దొరుకుతుంది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా రాజస్థాన్ నుంచి హైదరాబాద్​కు వలస వచ్చిన వేలాదిమంది కళాకారులు వివిధ డిజైన్లలతో రంగురంగుల వినాయక విగ్రహాలను తయారుచేశారు. ఈసారి వినాయక చవితి సందర్భంగా.. అందంగా, అత్యద్భుతంగా వినాయకుడి ప్రతిరూపాలు రూపుదిద్దే కళాకారుల జీవనం, మట్టి విగ్రహాల విశిష్టత వంటి విశేషాలతో స్పెషల్ స్టోరీ. 

రేపే ( సెప్టెంబర్​ 14)  వినాయక చవితి. పండుగ నాడు ప్రతిష్టించే వినాయకుడి విగ్రహాల రూపకల్పన మాత్రం ఎప్పుడో మొదలైంది. ఆల్రెడీ మన హైదరాబాద్‌‌లో గణేష్ విగ్రహాల ఆగమనాల సందడి కూడా షురూ అయింది. ఈ సందడే వందలాది మంది విగ్రహ కళాకారులకు ఉపాధి కల్పిస్తోంది. 

మట్టి నుంచి గణనాథుడిని తీర్చిదిద్దుతూ... తమ జీవనానికి కొత్త బాటలు వేసుకుంటున్నారు. ఈ ఏడాది మట్టి విగ్రహాలకు ఆదరణ పెరగడంతో విగ్రహ కళాకారులకు చేతినిండా పని దొరికింది. పగలు, రాత్రి తేడా లేకుండా విగ్రహాలకు రూపమిచ్చి.. పండుగను ఘనంగా తీర్చిదిద్దడంతోపాటు తమ కుటుంబాలకు ఉపాధి కల్పించుకుంటున్నారు కళాకారులు. 

ధూల్‌‌పేట్ ప్రాంతంలో గణేష్ విగ్రహాల తయారీ ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. స్థానికంగా తయారీ ఖర్చులు పెరగడం, బయట రాష్ట్రాల నుంచి వస్తున్న రెడీమేడ్ విగ్రహాల పోటీ వంటి సవాళ్లు కూడా కళాకారులపై ప్రభావం చూపుతున్నాయి. ఏడాది కాలంలో 9 నెలలపాటు వినాయక విగ్రహాలు తయారుచేస్తున్నామని, దీని ద్వారా ఏడాదిపాటు కళాకారులకు ఉపాధి లభిస్తుందని గణేశ్ విగ్రహ తయారీ కళాకారుడు కందుల పవన్ చెప్పారు. 

హైదరాబాద్ నగరంలో లక్షమందికి పైగా ఉన్న  కళాకారులు మట్టితో కుండలే కాదు వినాయక విగ్రహాలను తయారుచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఏడాదిలో 8 నెలలపాటు వినాయక విగ్రహాల తయారీ ద్వారా తమకు ఉపాధి లభిస్తుందని వినాయక విగ్రహాల తయారీ కళాకారుడైన రావులపల్లి విజయ్ చెప్పారు. 

వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాలే కాకుండా వినాయక మండపాల్లో దీపాలు పెట్టేందుకు వీలుగా మట్టి కంచులను కూడా తయారుచేస్తున్నామని కళాకారుడు అశోక్  చెప్పారు. మొత్తం మీద వినాయక ఉత్సవాలు తమకు ఉపాధితోపాటు వెలుగులు నింపుతున్నాయన్నారు.

మట్టి గణేశ విగ్రహాల సౌందర్యాన్ని పెంచేలా వీటికి బంగారు రంగు పూస్తున్నామని కళాకారుడు విరాట్ చెప్పారు. వందశాతం సహజమైన మట్టితో తయారు చేసిన పర్యావరణ అనుకూల విగ్రహాలు నీటిలో ఈజీగా కరిగిపోయేలా రూపొందించామన్నారు. మట్టి గణేష్ విగ్రహాలు జలాశయాలను కాలుష్యం నుంచి రక్షించడంలో సాయపడతాయని విరాట్ వివరించారు.

ఉచితంగా లక్ష విగ్రహాల పంపిణీ

కాలుష్య నియంత్రణకు వీలుగా పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేసేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా లక్ష మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయించింది. హైదరాబాద్ పరిధిలోని సర్కిళ్లు, జోనల్ కార్యాలయాల ద్వారా సెప్టెంబర్ రెండో వారంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు.

 భక్తులతోపాటు కాలనీ సంక్షేమ సంఘాలకు వీటిని అందించారు. మొత్తం లక్ష విగ్రహాలను మూడు పరిమాణాల్లో అందించారు. ఇందులో 70 వేల 8 అంగుళాల విగ్రహాలు, 20 వేల ఒక అడుగు విగ్రహాలు,10 వేల1.5 అడుగుల ఎత్తు విగ్రహాలు ఉన్నాయి. కళాకారుల నుంచి వీటిని కొనుగోలుకు జీహెచ్ఎంసీ గరిష్ఠ ధరలను కూడా నిర్ణయించింది. 

8 అంగుళాల విగ్రహానికి రూ.34.30, ఒక అడుగు విగ్రహానికి రూ.142, 1.5 అడుగుల ఎత్తు విగ్రహానికి రూ.220 వరకు చెల్లించనుంది. విగ్రహాల తయారీ, సరఫరా కోసం టెండర్ ప్రక్రియ ద్వారా ఏజెన్సీలను ఎంపిక చేశారు. ప్రతి కేటగిరీలో అత్యల్ప ధరను కోట్ చేసిన సంస్థకు అవకాశం ఇచ్చారు. గణేష్ ఉత్సవాలకు వారం రోజుల ముందు నుంచే విగ్రహాలను పంపిణీ చేశారు. ఏ యేటికాఏడు పర్యావరణ హిత మట్టి గణపతులకు ప్రజల్లో డిమాండ్ పెరుగుతోందని విగ్రహ తయారీదారు ప్రభాకర్ చెప్పారు.

పెరిగిన విగ్రహాల ధరలు

ముడిసరుకుల ధరలు పెరగడంతో వినాయక విగ్రహాల ధరలు కూడా ఈ ఏడాది పెరిగాయి. మట్టి గణపతులకు భక్తుల ఆదరణ పెరగడంతో ఈ ఏడాది మట్టి ధరలు మూడు రెట్లు పెరిగాయి. హైదరాబాద్ నలుమూలల ఉన్న చెరువులు, కుంటల నుంచి మట్టిని తీసుకునేందుకు నిషేధం విధించడంతో తాము ఖమ్మం, విశాఖపట్టణం, పశ్చిమబెంగాల్ ప్రాంతాల నుంచి మట్టిని తెప్పించుకోవాల్సి వస్తుందని రావులపల్లి విజయ్ చెప్పారు. గతంలో ట్రాక్టరు మట్టి రూ.5 వేలకు లభించగా, ఇప్పుడు వీటి ధర రూ.15 వేలకు పెరిగిందని చెప్పారు. దీనివల్ల మట్టి గణపతుల ధరలు కూడా పెంచాల్సి వచ్చిందని ఆయన వివరించారు. 

నగరం నలుమూలలా..

సిటీలోని నలుమూలలా విగ్రహాలు తయారుచేసే కేంద్రాలున్నాయి. మణికొండ లాంకోహిల్స్ నానక్ రాంగూడ దగ్గరున్న విరాట్ క్లే గణేశా ఆర్ట్స్​లో కళాకారులు ఎకో ఫ్రెండ్లీ, పేపర్, కలర్ క్లే వంటి వివిధ రకాలుగా గణేశ్ విగ్రహాలను తయారుచేస్తున్నారు.

ప్రతీ విగ్రహాన్ని కళాకారులు తమ కళానైపుణ్యంతో తీర్చిదిద్దుతున్నారు. హ్యాండ్ మేడ్, ఎకో ఫ్రెండ్లీ, ఇంట్లోనే నిమజ్జనం చేసుకునేలా విగ్రహాలను తయారుచేస్తున్నారు. గంగానది మట్టితో విగ్రహాలు తయారుచేశారు. మదీనాగూడలోని దీప్తి శ్రీ నగర్​లో క్లే గణేశా ఐడల్స్ పాలెం ఆర్గానిక్స్ నేచురల్ మట్టితో తయారుచేస్తున్నారు. నిజాంపేటలోని వసంత్ నగర్ కాలనీలో ప్రశాంత్ ఐడల్స్ మట్టి విగ్రహాలను తయారుచేస్తున్నారు. గుర్రంగూడలోని శ్రీశ్రీ అవెన్యూలో ఎఫ్టానేశాలో ఎకో ఫ్రెండ్లీ ఐడల్స్ తయారుచేస్తున్నారు. గండిమైసమ్మ రోడ్డులోని బౌరంపేటలో జైగణేశా ఆర్ట్స్ మట్టి విగ్రహాలను తయారుచేస్తోంది.

తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు..

ధూల్‌‌పేట్‌‌లో స్థానిక కళాకారులతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కళాకారులు కూడా విగ్రహాలను తయారుచేశారు. మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులు సీజన్ మొత్తం హైదరాబాద్‌‌లోనే ఉండి గణేశ్​ విగ్రహాల తయారీ, రంగులు, అలంకరణ పనుల్లో నిమగ్నమయ్యారు.

 తరతరాలుగా వస్తున్న శిల్పకళను కొనసాగిస్తూ.. గణనాథుడి రూపంలో తమ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. ఒక్క గణేశ్​ విగ్రహం వెనుక శిల్పి మాత్రమే కాదు... మట్టి పని, ఫ్రేమ్ తయారీ, మౌల్డింగ్, పెయింటింగ్, అలంకరణ, లోడింగ్ – ట్రాన్స్​పోర్ట్ వరకు అనేకమందికి సీజనల్ ఉపాధి లభిస్తోంది. ధూల్‌‌పేట్ నుంచి తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలకు కూడా విగ్రహాలు వెళ్తున్నాయి. 

పెరిగిన డిమాండ్

వినాయక విగ్రహం ధర సైజును బట్టి ఉంటుంది. ఎకో గణేశ్, గ్రీన్ గణేశ్, సీడ్ గణేశా, క్లే గణేశ్ విగ్రహాలు ఈ ఏడాది ట్రెండ్​గా మారాయి. అడుగు నుంచి 25 అడుగుల ఎత్తు వరకు విగ్రహాలను రూ.500 ల నుంచి రూ.50వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ ఏడాది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వినియోగాన్ని తగ్గించి చెరువులు, సరస్సులు, ఇతర నీటి వనరులను కాలుష్యం నుంచి కాపాడే ఉద్దేశంతో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘ఎకో గణేశ్, గ్రీన్ గణేశ్, క్లే గణేశ్’ కార్యక్రమంలో భాగంగా ఈ విగ్రహాలను పంపిణీ చేసింది.

ఎన్నెన్నో రకాల విగ్రహాలు

ఈ ఏడాది బొజ్జగణపతి, బాల గణేష్ విగ్రహాలకు గిరాకీ పెరిగింది. గల్లీ నుంచి అపార్టుమెంట్ సంఘాల దాకా కళాకారులు, పెయింటర్లు, రాజస్థాన్ రాష్ట్రం నుంచి వచ్చి గుడిసెల్లో ఉండి పనిచేస్తున్నారు. వేలాది మంది విగ్రహ కళాకారులకు ఉపాధి కల్పిస్తున్న వినాయక చవితి పండుగ, కళాకారుల కళా వైభవం, గణపతి విగ్రహాల తయారీలో 250 రకాలుగా తయారు చేస్తున్నారు. 

హైదరాబాద్​లో వినాయక  మట్టి విగ్రహాలను తయారుచేసే కళాకారులు వందలాదిమంది ఉన్నారు. నాగోల్​లోని కుంభ్‌కార్ మట్టి కలకృతి కేంద్రం మట్టి విగ్రహాల తయారీకి ప్రసిద్ధి. విరాట్ క్లే గణేశ్​ ఐడల్స్ కోల్‌కతా మట్టి, గంగా నది మట్టితో అందమైన, పర్యావరణ అనుకూల విగ్రహాలను ఒక అడుగు నుంచి 6 అడుగుల వరకు తయారుచేశారు. 

అబ్దుల్లాపూర్‌మెట్​లోని ఆర్ట్ ఆఫ్ ఇండియన్ పాటరీ, బేగంబజార్, ధూల్ పేట్ ప్రాంతాల్లో నిపుణులైన సంప్రదాయ కళాకారులు పెద్ద ఎత్తున విగ్రహాలను తయారుచేశారు. తాము కోల్‌కతాలో భూమి ఉపరితలం నుంచి 20 అడుగుల లోతులో లభించే మట్టిని, గంగా నదీతీరాల నుంచి సేకరించిన మట్టిని వినాయక విగ్రహాల తయారీకి ఉపయోగిస్తున్నామని విగ్రహ తయారీదారు విరాట్ చెప్పారు.  

మట్టి గణపతుల తయారీ

మట్టి గణపతులను సహజమైన మట్టి, నీరు, సహజ రంగులతో తయారుచేస్తారు. మంచి నాణ్యత గల మెత్తని మట్టిని తీసుకుని అందులో నుంచి రాళ్లు, చెత్త వంటి మలినాలను తొలగిస్తారు. మట్టికి కొద్దికొద్దిగా నీరు కలిపి మెత్తగా పిసికి, గట్టిగా కాకుండా సులభంగా ఆకారం వచ్చేలా తయారుచేస్తారు. 

పెద్ద విగ్రహాలైతే అవసరమైన ఆకారాన్ని నిలబెట్టేందుకు వెదురు లేదా ఇతర సహజ పదార్థాలతో ప్రాథమిక ఫ్రేమ్ తయారుచేస్తారు. సిద్ధం చేసిన మట్టిని ఫ్రేమ్‌పై పొరలుగా వేసి గణపతి శరీరం, పొట్ట, చేతులు, కాళ్లు, తొండం వంటి భాగాలకు ఆకారం ఇస్తారు. 

ముఖం, కళ్లు, చెవులు, కిరీటం, ఆభరణాలను మట్టితోనే జాగ్రత్తగా రూపొందిస్తారు. విగ్రహాన్ని నీడలో లేదా తగిన ఉష్ణోగ్రతలో నెమ్మదిగా ఆరబెడతారు. దీనివల్ల మట్టి గట్టిపడుతుంది. పూర్తిగా ఆరిన తర్వాత పర్యావరణానికి హాని అతితక్కువగా ఉండే సహజ లేదా నీటి ఆధారిత రంగులతో అలంకరిస్తారు. కళ్లు, వస్త్రాలు, పూలు, ఇతర అలంకరణలను జోడించి గణపతి విగ్రహం తయారీని పూర్తి చేస్తారు.