న్యూఢిల్లీ: రెండు దేశాలు ఒకరి బలాల నుంచి మరొకరు నేర్చుకోవడానికి, పరస్పరం మద్దతిచ్చుకోవడానికి భారత్, చైనాలకు అవకాశం ఉందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అన్నారు. బ్రిక్స్శిఖరాగ్ర సమావేశం 2026లో పాల్గొనేందుకు శనివారం ఢిల్లీ వచ్చిన జిన్ పింగ్.. సాయంత్రం ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. చైనా ఎల్లప్పుడూ భారతదేశంతో తన సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక కోణంలోనే చూసిందని జిన్‌పింగ్ అన్నారు.
‘రెండు దేశాల జాతీయ పరిస్థితులు వేర్వేరు అయినప్పటికీ, మనం ఒకరి బలాలు మరొకరు పూర్తిగా నేర్చుకోవచ్చు, పరస్పరం మద్దతునిచ్చుకోవచ్చు, కలిసి విజయం సాధించవచ్చు, ఉమ్మడి అభివృద్ధిని సాధించవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు. ‘ఈ శతాబ్దంలో ఎన్నడూ చూడని తీవ్రమైన మార్పులు, మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశాలుగా, గ్లోబల్ సౌత్‌లో ముఖ్యమైన సభ్యులుగా చైనా, భారతదేశాలకు గణనీయమైన బాధ్యత ఉంది. ఇరుపక్షాలు మానవజాతి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, మన ప్రజల శ్రేయస్సును పట్టించుకోవాలి. ప్రధాన దేశాల పాత్రను పోషించడానికి కలిసి పనిచేయాలి. ప్రపంచ శాంతి, స్థిరత్వం, అభివృద్ధి, శ్రేయస్సుకు సానుకూల శక్తిని అందించాలి’ అని ఆయన అన్నారు.
బార్డర్లో శాంతితోనే బంధాలు బలపడ్తయ్: మోదీ
ఇరు దేశాల మధ్య సంబంధాల్లో పురోగతి సాధించాలంటే సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం తప్పనిసరని ప్రధాని నరేంద్ర మోదీ చైనాకు స్పష్టం చేశారు. అభిప్రాయ భేదాలు వివాదాలుగా మారొద్దని ఆకాంక్షించారు. సరిహద్దులకు సంబంధించిన వివాదాలను అర్థం చేసుకోవడానికి ఇరు దేశాలు ఇప్పటికే అమలులో ఉన్న ఒప్పందాలను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.
దీనికి భిన్నంగా, సరిహద్దు వివాదాన్ని ద్వైపాక్షిక సంబంధాలలోని ఇతర అంశాల నుంచి వేరుగా చూడాలని చైనా వాదిస్తోంది. మోదీ, జిన్‌పింగ్ సమావేశానికి ముందు రెండు ప్రభుత్వాల మధ్య అనేక ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. గత నెల చివరిలో బీజింగ్‌లో జరిగిన ప్రత్యేక ప్రతినిధుల చర్చల్లో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పాల్గొన్నారు.
ఈ చర్చల్లో సరిహద్దు గుర్తింపు, సరిహద్దు దాటిన సహకారం, ఎల్ఏసీ వెంట శాంతిని కాపాడుకోవాల్సిన అవసరం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. భారత్, -చైనా సరిహద్దు చర్చల కోసం దోవల్, వాంగ్ ప్రత్యేక ప్రతినిధులుగా నియమితులయ్యారు. 3,488 కి.మీ సరిహద్దు వివాదానికి పరిష్కారం కనుగొనేందుకు 2003లో ఈ పదవులను ఏర్పాటు చేశారు.
