నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కమిషనరేట్ పరిధిలో ఆరు వారాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో 1,784 మంది మందుబాబులపై కేసులు నమోదు చేశారు. వారిలో 124 మందికి వారం రోజుల జైలు శిక్ష విధించగా, మిగిలిన వారికి రూ. 1.45 కోట్ల జరిమానా విధించినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు.
మద్యం తాగి వాహనాలు నడిపించవద్దని ఆయన సూచించారు. డ్రంక్ డ్రైవ్‌లో దొరికిన వారికి కోర్టు రూ.10 వేల నుంచి రూ.15 వేల ఫైన్ విధిస్తోందని, తరచూ పట్టుబడుతున్న వారిని జైలుకు పంపుతున్నారని చెప్పారు. పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆరు నెలల పాటు రద్దు చేస్తామని తెలిపారు.
