బాన్సువాడ ప్రజలే నా కుటుంబం : పోచారం శ్రీనివాస్రెడ్డి

బాన్సువాడ ప్రజలే నా కుటుంబం : పోచారం శ్రీనివాస్రెడ్డి

వర్ని, వెలుగు: తనతో పాటు తన కుటుంబం బాన్సువాడ నియోజకవర్గ ప్రజాసేవకే అంకితమవుతామని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. స్పీకర్​గా ఉన్న వ్యక్తి మరోసారి ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవడని అందరూ అనుకున్న సమయంలో తనను మళ్లీ గెలిపించి బాన్సువాడ ప్రజలు చరిత్ర తిరగరాశారని చెప్పారు. నిజామాబాద్​ జిల్లా చందూరు మండలంలో శనివారం జహీరాబాద్​ ఎంపీ సురేశ్​ షెట్కర్​తో కలిసి చందూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించడమే లక్ష్యమని తెలిపారు. రూ.106.40 కోట్లతో చందూరు, జాకోరా, చింతకుంట ఎత్తిపోతల పథకాలను నిర్మించామని చెప్పారు. వీటితో 9 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. రూ.258 కోట్లతో సిద్దాపూర్​ రిజర్వాయర్​ పనులు కొనసాగుతున్నాయని, ఈ పనులు పూర్తయితే మరో13 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. కాంగ్రెస్​ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తుందన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని తెలిపారు. అనంతరం చందూరులో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ఆగ్రోస్​ చైర్మన్​ కాసుల బాలరాజ్, డీసీసీబీ మాజీ చైర్మన్​ పోచారం భాస్కర్​రెడ్డి, పీసీసీ డెలిగేట్​ కూనిపూర్​ రాజిరెడ్డి, వర్ని ఏఎంసీ చైర్మన్​​సురేశ్​బాబా, జిల్లా నాయకులు వెలగపూడి గోపాల్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్​గౌడ్  పాల్గొన్నారు.