అభిజిత్ దీప్కే నాయకత్వంలో కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ విజయం తరువాత ఏం చేస్తుంది? దానికొక దీర్ఘకాలిక ప్రణాళికను నిర్మించుకోగలుగుతుందా! లేదా చాలా ఎత్తు ఎగిరిన ఒక గాలిపటంలాగ చినిగిపోతుందా అని చాలామందికి అనుమానం ఉంది. నాకూ ఉంది.
ఒక దళిత యువకుడు దేశంలో ఎన్నడూ లేని విధంగా అన్ని వర్గాల అమ్మాయిలను, అబ్బాయిలను మెప్పించి ఒక చైతన్యవంతమైన నాయకుడుగా ఎదిగిన దీప్కేను ఎక్కడో ఒకచోట ఇరికించి జనాలలోకి రాకుండా చేయాలనే పాలకపక్ష శక్తులు అతని మీద రకరకాల కేసులు పెట్టాలని ప్రయత్నం చేశాయి.
అతను అమెరికాలో చదివి ఎంఎస్ డిగ్రీ తీసుకోలేదని, అతను ఒక అబద్ధాలకోరుగా చూపించాలని పాలకపక్ష శక్తులు చూశాయి. ఇటువంటి దాడులను అంబేద్కర్ ఎన్నో ఎదుర్కొన్నాడు. నామీద అమెరికాలో నివసించే అగ్రకుల మేధావులు రాజీవ్ మల్‌హోత్రా నాయకత్వంలో పుస్తకాలు రాస్తారు.
ఇతను స్కాలరే కాదని సెమినార్లు పెట్టారు. రావణుని పది తలల్లోని ఒక తల అని రాసి, ఢిల్లీలో సెమినార్లు పెట్టి తిట్టారు. అయితే అభిజిత్ తనను విమర్శించినవారికి దీటైన సమాధానమిచ్చాడు. వాళ్ల నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన డిగ్రీ చూపిస్తే నేను నా డిగ్రీ మీడియా ముందు పెడతాను అని సవాలు చేశాడు. దానితో దిమ్మతిరిగిపోయింది. అభిజిత్‌కు ప్రపంచ గుర్తింపు ఉంది. కనుక వాళ్లు ఏమీ చేయలేక నోరు మూశారు.
స్కూల్ టీక్ కరో కార్యక్రమం
జంతర్ మంతర్ విజయం తరువాత అభిజిత్‌ను బీజేపీలో చేరాలి. లేకపోతే బాగుండదని బెదిరించిన వార్తలొచ్చాయి. కానీ అతను వెంటనే సీజేపీకి ఒక రూపమిచ్చి నాయకత్వం నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తూ దేశమంతటా స్కూల్ టీక్ కరో (స్కూళ్లను బాగుచేయండి) అనే కార్యక్రమం తీసుకుని సవాలు విసిరాడు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ స్కూళ్లను దాదాపు అంతమొందించే విధానం మొదలైంది. ప్రైవేటు స్కూళ్లకు ఎనలేని ఆదరణ దొరికింది.
ఆర్‌ఎస్‌ఎస్ అసలు రిజిస్ర్టేషన్ కూడా లేని సంస్థ తన అధీనంలోని వివిధ సంస్థల ద్వారా ఎన్నో ప్రయివేటు స్కూళ్లను నడపడమే కాకుండా, అదానీ, అంబానీ వంటి బడా పెట్టుబడిదారులు నడిపే స్కూళ్లకు ఎనలేని గౌరవం కల్పించారు. మోహన్ భగవత్, మోదీ వాళ్ల సంస్థలను, పెళ్లిళ్లకు అటెండ్ చేస్తూ వారి బిజినెస్ పెంచుకునే మార్గాలను సులభతరం చేస్తున్నారు. ప్రైవేటు కాలేజీలు, యూనివర్సిటీలు కుప్పలుతెప్పలుగా తెరవనిచ్చారు.
మహారాష్ట్ర స్కూళ్లు
అభిజిత్ దీప్కే ఆగస్టు 15న తన ఊరి స్కూలుకు పోయి పరిశీలించాడు. అది చాలా దారుణంగా ఉంది. ఆ ప్రాంతపు ఇతర స్కూళ్లను సందర్శించి ఫొటోలు తీయించాడు. అతడిని మీడియా ఫాలో అయింది. అనుమతి లేకుండా స్కూలుమీదకు పోయాడని కేసులుపెట్టించారు. కానీ ఆ రాష్ట్రంలోని స్కూళ్లు దారుణమైన స్థితి ప్రపంచ మీడియాను ఆకర్షించింది. అది ఆర్ఎస్‌ఎస్, బీజేపీ బాగా బలంగా ఉండి చాలాకాలంగా పరిశీలిస్తున్న రాష్ట్రం. కానీ ఆ రాష్ట్రంలో గత 60 ఏండ్లుగా మతం మీద, గుడుల మీద జరుగుతున్న చర్చలలో 100వ వంతు కూడా విద్యారంగం మీద జరగలేదు.
రోడ్లు, ఎయిర్‌పోర్టులు, సముద్ర పోర్టులు కట్టించడంలో కేంద్ర ప్రభుత్వ డబ్బు అంతా ఖర్చుపెడుతున్నారు. అంటే అందులో సగ భాగం అదానీ, అంబానీలకు లాభాల కింద ముట్టజెప్పడమన్న మాట. కానీ, కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న సెంట్రల్ విద్యాసంస్థల్ని హిందీ ఇతర ప్రాంతీయ భాషలకు కుదించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు దేశ ప్రభుత్వ స్థాయి జ్ఞానం రాకుండా చేయాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ చాలా పెద్ద ప్లాన్‌తో ఉన్నాయి. వాటిలో పనిచేసే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు నామమాత్రపు పదవులు, హోదా, కొంత ఆదాయంతో.. సమాజమేమైతాది అనే ధోరణిలో బతుకుతున్నారు. వాళ్లను గుడులు, తీర్థాలు, కైలాసయాత్రలు చేసి రావాలని ప్రోత్సహిస్తున్నారు.
బీబీసీ రిపోర్టు
అభిజిత్ దీప్కే ఈ కార్యక్రమం మహారాష్ట్రలో చేపట్టాక ప్రపంచ అతిపెద్ద టీవీ చానల్, బాగా నమ్మదగ్గ చానల్ బీబీసీ చాలా స్కూళ్లకు వెళ్లి ఆ ప్రాంతంలో తిరిగి సర్వే చేసింది. ఎన్నో స్కూళ్లు తిరిగాక వాటి స్థితి రికార్డు చేశాక అభిజిత్‌ను కూడా అది ఇంటర్వ్యూ చేసింది. చాలా గ్రామీణ స్కూళ్లకు బాత్‌రూంలు లేవు. గోడలు లేవు. విద్యార్థులైన అమ్మాయిలు, అబ్బాయిలు చాలాదూరం నడిచి వెళ్లాల్సి వస్తుంది. వర్రెలు, వాగులు ప్రతిరోజు దాటుకుంటూ వెళ్లాల్సి వస్తుంది.
ఈ స్థితి.. ముంబయిలో లక్షల కోట్లు పెట్టుబడులు, రాష్ట్రానికి చాలాపెద్ద బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఉంది. ఇదే ఆర్ఎస్‌ఎస్ పుట్టి ‘స్వయం సేవ’ అంటూ, జాతీయవాదమంటూ ప్రతినిత్యం ప్రచారం చేస్తున్న రాష్ట్రం. కానీ, బీబీసీ రిపోర్టు ప్రకారం ప్రభుత్వ స్కూళ్లు ఇక్కడ చాలా ఘోరంగా ఉన్నాయి. ఆ రిపోర్టుతో ఆ రాష్ట్రం పరువుపోయింది. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీప్కే చాలా స్పష్టంగా వివరించాడు.
ప్రైవేటు సెక్టార్ విద్య ధనవంతులకు, మధ్య తరగతికి చెందినది. కానీ శ్రమజీవుల పిల్లలకు విద్య రాకుండా చూడాలనే సిద్ధాంతం ఈ దేశంలో అమలు జరుగుతుందని. తను స్వయంగా ఒక ఇంజినీర్ కొడుకును కనుక తను ఇంగ్లిష్ మీడియంలో చదువుకోగలిగానని, ఉత్పత్తి రంగంలో పనిచేసే శ్రమజీవులు ఉన్నత చదువులకు ఎదగకుండా జాగ్రత్త పడుతున్నారని స్పష్టంగా చెప్పాడు.
మినిస్టర్ల ఇండ్లు, ఎమ్మెల్యేల ఇండ్లు ఎంతో ధగధగలాడుతుంటే స్కూళ్ల గోడలు, కప్పులు లేకుండా ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ దేశ భక్తి ఏది? ఇక్కడ ఉన్నది కుల, వర్గ భక్తి. 21వ శతాబ్దంలో గ్రామీణ పిల్లలకు ఇంగ్లీష్ రాకుండా, అసలు విద్య రాకుండా చూడడం ఎంత దారుణం.
ఆంధ్ర, తెలంగాణ స్థితి
ఈ మధ్య కాలంలో తెలంగాణలోని ఇంగ్లిష్ మీడియం స్కూళ్లను మళ్లీ కనీసం 5వ తరగతి వరకైనా తెలుగు మీడియంలో మార్చాలని కే.కేశవరావు కమిటీ రికమెండ్ చేసిందని వార్తలొస్తున్నాయి. ఈ ప్రయత్నమంతా బీజేపీ ఆంధ్ర నాయకులు వెంకయ్య నాయుడు, జయప్రకాశ్ నారాయణ (చంద్రబాబు మనిషి), జస్టిస్ ఎంవి రమణ వంటి వారి సలహాలతో చేస్తున్న పని. ఆంధ్రలో చంద్రబాబు అటువంటి ప్రయత్నం చేసి విరమించుకున్నాడు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
ఈ కేకే.. ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్‌లోకి వచ్చి, మళ్లీ బీఆర్‌ఎస్‌కు అధికారం రావడానికి ఇటువంటి రికమండేషన్ చేసి అది అధికారంలోకి రాగానే మళ్లీ అందులోకి పోయే ప్లాను తప్ప మరోటి లేదు. కే.కే.కు తెలంగాణ గ్రామాలలో ఎల్‌కేజీ నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం కావాలని ప్రజలలో ఎంత కోరిక ఉందో తెలియదు. ఆయనకు అసలు తెలుగు కూడా సరిగా రాదు.
కానీ ఈ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే ఇది బెస్ట్ అంశం. ఎందుకంటే ఇక్కడ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం పెట్టింది కేసీఆర్ ప్రభుత్వమే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు. కనుక స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం తీసేయగానే కేటీఆర్‌కు పెద్ద అవకాశం దొరుకుతుంది.
అప్పుడు తెలంగాణ సెంటిమెంటుతోపాటు ఇప్పుడు గ్రామాల్లో కొత్తగా నాటుకున్న ఇంగ్లిష్ మీడియం కోరిక కాంగ్రెస్‌ను సులభంగా ఓడిస్తుంది. దేశంలోని మైదాన రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీలోనే ప్రభుత్వ స్కూళ్లల్లో పూర్తి ఇంగ్లిష్ మీడియం ఉన్నది.
దీన్ని దెబ్బ తియ్యాలని బీజేపీ ఆలోచనాపరుల ఆలోచన. దాన్ని కేశవరావు అమలు చేయించదలచుకున్నాడన్నమాట. అసలు తెలుగే రాని నాయకుడికి తెలుగు మీద ప్రేమ ఏంది? అసలు ఉన్నది గ్రామీణ ప్రజల మీద కోపం.
గ్రామీణ ప్రాంతంలో ఇంగ్లిష్ విద్యా విధానం పెరగాలి
ఈ స్థితిలో సీజేపీ స్కూల్ టీక్ కరో ప్రోగ్రాం మరో షాక్ ఇచ్చింది. దేశంలో ఇటువంటి ప్రోగ్రాం కమ్యూనిస్టులు, సోషలిస్టులు కూడా ఎన్నడూ చేయలేదు. వాళ్లు దేశ విద్యావ్యవస్థ ప్రభుత్వ రంగంలో అభివృద్ధి అయితే మార్పు వస్తుందని ఏనాడూ అంచనా వేయలేదు. కాంగ్రెస్ పరిపాలనా కాలంలో విద్యారంగం కొంత వేళ్లూనుకున్నా దానిమీద ప్రత్యేక కేంద్రీకరణ ఎప్పుడూ లేదు. ఈ స్థితిని మార్చడం సీజేపీలాంటి యువ మేధావి వర్గానికే సాధ్యం.
గ్రామీణ ప్రాంతంలో ఇంగ్లిష్ విద్యా విధానం పెరగకుండా మార్పు రాదు. ప్రాంతీయ భాషను కేవలం ప్రాంతం వరకు వాడుకునేందుకు మాత్రమే వాడుకోవాలి. ఆ ప్రాంతంలో ఉద్యోగం చేసినా ఇంగ్లిష్ భాష ప్రావీణ్యత చాలా ముఖ్యం. ఇప్పటివరకు సీజేపీ నాయకులెవ్వరూ భాషా బోధనా విధానం మీద మాట్లాడటం లేదు. కానీ వాళ్లంతా ఇంగ్లిష్ మీడియంలో చదివినవారే.
ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
* ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
