- స్పీకర్‌గా మాణిక్ రావు.. మంత్రి ఉత్తమ్ పాత్రలో పల్లా..
- సభ నుంచి సస్పెన్షన్ నేపథ్యంలో నిరసనగా కార్యక్రమం
- 22ఏ జాబితాలో భూములు, ఇతర హామీలపై సెటైర్లు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు నిరసనగా తెలంగాణ భవన్లో ఆ పార్టీ నేతలు శనివారం మాక్ అసెంబ్లీ నిర్వహించారు. తాము ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక సభ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపిస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఈ మాక్ అసెంబ్లీలో పాల్గొన్నారు. పార్టీ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో అసెంబ్లీ సెటప్ వేశారు. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివిధ రోల్స్‌లో నటించారు.
స్పీకర్‌గా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు వ్యవహరించారు. సీఎం రేవంత్ పాత్రలో తలసాని శ్రీనివాస్ యాదవ్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాత్రలో గంగుల కమలాకర్, ఇరిగేషన్ శాఖ మంత్రి పాత్రలో పల్లా రాజేశ్వర్ రెడ్డి నటించారు. ఈ సందర్భంగా మన రాష్ట్రానికి దక్కాల్సిన నీళ్లు, పేదల భూములను 22ఏ జాబితాలో పెట్టడం వంటి అంశాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఇక, ప్రభుత్వ ప్రతినిధుల్లా మాక్అసెంబ్లీలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్కూడా ప్రభుత్వంపై వ్యంగ్య వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. అయితే, ఈ మాక్ అసెంబ్లీలో కేటీఆర్, హరీశ్ రావు పాల్గొన్నా.. వాళ్లు మాత్రం మాట్లాడలేదు. మిగతా ఎమ్మెల్యేలంతా తమతమ అభిప్రాయాలను పంచుకున్నారు. గతంలో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్స్‌ను ఇమిటేట్ చేస్తూ మాక్ అసెంబ్లీలో కామెంట్స్ చేశారు.
ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కు కౌంటర్‌గా సీఎంగా వ్యవహరించిన తలసాని శ్రీనివాస్ యాదవ్.. ‘పండబెట్టి తొక్కుతా’ అంటూ వ్యాఖ్యానించారు. ఇటు నీళ్ల విషయంలో చర్చ సందర్భంగా మంత్రి ఉత్తమ్ చేసిన ‘ప్రిపేర్ అయ్యి వస్తా’ అనే వ్యాఖ్యకు వ్యంగ్యంగా.. ‘నేను ప్రిపేర్ అయ్యి రాలేదు. ప్రిపేర్ అయినా రాదు’ అంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఇందిరా గాంధీ కట్టారంటూ సీఎం పాత్రలోని తలసాని శ్రీనివాస్ యాదవ్ సెటైర్ వేశారు. అంతేకాదు.. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నాంగానీ.. ఏ వంద రోజులన్నది చెప్పలేదంటూ కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు.
