ఫీజు బకాయిలు ఇచ్చేదాకా ఊరుకోం..పాతవి, కొత్తవి కలిపి రూ.15 వేల కోట్లకు చేరాయి: రాంచందర్ రావు

ఫీజు బకాయిలు ఇచ్చేదాకా ఊరుకోం..పాతవి, కొత్తవి కలిపి రూ.15 వేల కోట్లకు చేరాయి: రాంచందర్ రావు
  • స్టూడెంట్లకు పైసలు ఎప్పుడేస్తారో తేల్చాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు ఇచ్చేదాకా ఊరుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తేల్చిచెప్పారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల పాపంతో మొత్తం బకాయిలు రూ.15 వేల కోట్లకు చేరాయని వెల్లడించారు. ఆ డబ్బులు స్టూడెంట్లకు ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో విద్యావ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నాశజనం చేసిందని ఫైర్ అయ్యారు.  ఫీజు రీయింబర్స్​మెంట్ పథకాన్ని అటకెక్కించి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలను పక్కదారి పట్టించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పారు. తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు శాసనమండలిలో ఫీజు రీయింబర్స్​మెంట్, స్కాలర్​షిప్​లపై గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశానని గుర్తుచేశారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మొదటి ఎనిమిదేళ్లు ఇచ్చి, చివరి రెండేళ్లలో రూ.5,430 కోట్ల బకాయిలు పెట్టిందన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లు కావస్తున్నా పాత బకాయిలు తీర్చకపోగా, కొత్తవి పెంచుకుంటూ పోయిందన్నారు. 2024–-25 నాటికే రూ.6,037 కోట్లు ఉన్నట్లు ప్రభుత్వమే చెప్పిందన్నారు. 2026 నాటికిబకాయిలు సుమారు రూ.15 వేల కోట్లకు చేరాయని వివరించారు. ప్రభుత్వం బకాయిలు ఇవ్వకపోవడంతో కాలేజీలు సర్టిఫికెట్లు ఆపేస్తున్నాయని..విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని రాంచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.  

డీబీటీకి వ్యతిరేకం కాదు..

కాలేజీలపై విజిలెన్స్ దాడుల పేరిట గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వేధిస్తే, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూడా అదే బాటలో నడుస్తోందని రాంచందర్ రావు  విమర్శించారు. తమకు కాలేజీ మేనేజ్మెంట్లతో ఎలాంటి సంబంధం లేదనీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌‌‌‌ఫర్ (డీబీటీ) ద్వారా నేరుగా విద్యార్థుల ఖాతాల్లోనే వేస్తామంటే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ, అసలు ఆ బకాయిలను ఖాతాల్లో ఎప్పుడు జమచేస్తారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

బీజేపీలో చేరికలు.. 

సూర్యాపేట జిల్లాతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి పలువురు బీజేపీలో చేరారు. రిటైర్డ్ డీసీపీ శ్రీనివాస్, సూర్యాపేటకు చెందిన ప్రముఖ వైద్యులు, యువజన సంఘాల నాయకులకు ఎన్.రాంచందర్ రావు కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలను తరిమికొట్టే ప్రత్యామ్నాయ శక్తి బీజేపీ మాత్రమేనని ప్రజలు విశ్వసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.