గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో అంబేద్కర్ భవన నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.50 లక్షల నిధులు కేటాయించామని, భవన నిర్మాణం చేపట్టేందుకు సింగరేణి సంస్థ స్థలం కేటాయించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అంబేద్కర్ భవన నిర్మాణం అంశంపై కలెక్టర్ స్థాయి నుంచి కూడా సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి వెళ్లినప్పటికీ, స్థల కేటాయింపులో జాప్యం జరుగుతోందన్నారు. ఇప్పటికే నిధులు కేటాయించడం, కలెక్టర్ నుంచి నుంచి ఫాలోఅప్ చేస్తున్నందున సింగరేణి మేనేజ్‌మెంట్ ఆలస్యం చేయకుండా స్థలం కేటాయించాలని కోరారు.
మరోవైపు, హైదరాబాద్-, సికింద్రాబాద్ నుంచి ఉత్తర తెలంగాణకు రైలు కనెక్టివిటీ పెంచాలని రైల్వే బోర్డుకు వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఉత్తర తెలంగాణ ప్రజలకు హైదరాబాద్, సికింద్రాబాద్‌తో మెరుగైన రైలు కనెక్టివిటీ కల్పించాల్సిన బాధ్యత రైల్వే శాఖపై ఉందని పేర్కొన్నారు. సిర్పూర్ కాగజ్‌నగర్-, సికింద్రాబాద్/హైదరాబాద్ మధ్య అదనపు రైళ్ల కోసం తాను పలుమార్లు విజ్ఞప్తి చేశానని, పార్లమెంట్ సమావేశాల సమయంలో రైల్వే బోర్డు చైర్మన్ సతీశ్ కుమార్‌ను కూడా కలిసి ఈ ప్రాంత ప్రజల అవసరాలను వివరించినట్లు తెలిపారు.
ఉత్తర తెలంగాణ నుంచి రైల్వేకు భారీ స్థాయిలో ఆదాయం వస్తున్నప్పటికీ, అదే స్థాయిలో ప్రయాణికుల రైలు సౌకర్యాలు లేకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. రైల్వేకు ఆదాయం అందించే ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీ ఎందుకు ఉండకూడదని ఆయన ప్రశ్నించారు. ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో, ప్రజల అవసరం ఎక్కడ ఉందో గుర్తించాలని, రైల్వే బోర్డు నీడ్ బేసిస్‌పై అధ్యయనం చేయాలని ఎంపీ సూచించారు. సిర్పూర్ కాగజ్‌నగర్, -హైదరాబాద్/సికింద్రాబాద్ కనెక్టివిటీని శాశ్వతంగా బలోపేతం చేసే దిశగా రైల్వే శాఖ చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. ఈ విషయమై సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని ఎంపీ వంశీకృష్ణ డిమాండ్ చేశారు.
