నక్కలపల్లి గ్రామంలోని అంగన్వాడీ..పౌష్టికాహారం స్వాహాపై విచారణ

నక్కలపల్లి గ్రామంలోని అంగన్వాడీ..పౌష్టికాహారం స్వాహాపై విచారణ

కోటపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామంలోని అంగన్​వాడీ సెంటర్‌‌‌‌–1లో వెలుగు చూసిన అవకతవకలపై అధికారులు స్పందించారు. ‘పెళ్లికాని యువతిని తల్లిగా చూపించి.. పౌష్టికాహారం స్వాహా!’ శీర్షికతో ‘వెలుగు’ దినపత్రికలో కథనం ప్రచురితం కావడంతో శనివారం ఐసీడీఎస్  అధికారులు విచారణ చేపట్టారు. అంగన్​వాడీ టీచర్‌‌‌‌  వేముగంటి సరోజన అదే గ్రామానికి చెందిన ఓ పెళ్లికాని యువతికి పెళ్లి అయినట్లు, పిల్లలు ఉన్నట్లు రికార్డుల్లో చూపించి ప్రభుత్వం అందించే పౌష్టికాహారం కాజేసింది. 

బాధిత యువతి మనస్తాపానికి గురై ఈ వ్యవహారాన్ని మీడియా దృష్టికి తీసుకువచ్చింది. ఈక్రమంలో ఆఫీసర్లు అంగన్​వాడీ సెంటర్​లో రికార్డులు, వివరాలను పరిశీలించారు. ఇదిలాఉంటే విచారణ సక్రమంగా చేయడం లేదని, పెళ్లి కాని యువతి జీవితానికి సంబంధించిన వివరాలను తప్పుగా నమోదు చేయడమేమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్‌‌‌‌ను అధికారులు వెనకేసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌‌‌  చేస్తున్నారు.