న్యూఢిల్లీ: కోచ్‌గా గౌతమ్ గంభీర్ శైలి బాగుందని టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. గౌతీ పని తీరుపై వస్తున్న విమర్శలను కొట్టిపారేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున పని చేసిన అనుభవంతో గంభీర్ ఆలోచన విధానం తనకు ముందే తెలుసని చెప్పాడు. ‘గంభీర్ జట్టులో ప్లేయర్ల మధ్య నమ్మకాన్ని పెంచుతాడు. దానివల్ల ప్రతి ఆటగాడికి తన బాధ్యత ఏమిటనేది స్పష్టత ఉంటుంది. ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడతాడు.
ఇది చాలా కీలకమైన అంశం. ప్లేయర్లకు నిర్దిష్టమైన బాధ్యతలు అప్పగించి వారిపై భారం మోపడం కంటే అతని అవసరం ఎంతుందో తెలియజేస్తాడు’ అని శ్రేయస్ పేర్కొన్నాడు. వరుసగా మ్యాచ్‌లు ఆడటం ద్వారా ప్లేయర్లు గాయాలపాలు కావడం చాలా సహజమైందన్నాడు. ఎవరూ కావాలని గాయపడరని, జట్టు కోసం శ్రమిస్తున్న క్రమంలో ఇవి జరుగుతాయన్నాడు.
వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ రూపంలో జట్టుకు మంచి ఓపెనింగ్ ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్నాడు. అవకాశం లభించిన ప్రతి ఒక్కరికి జట్టు నుంచి పూర్తి మద్దతు ఉంటుందని కెప్టెన్ వెల్లడించాడు. ప్రాక్టీస్‌లో గాయపడిన ఇషాన్ కిషన్ కోలుకున్నాడని, తొలి మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నాడని స్పష్టం చేశాడు.
