దుబాయ్: రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఆసియా కప్‌ను గెలిచేందుకు ఇండియా విమెన్స్ జట్టు రెడీ అయ్యింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో టీమిండియా.. శ్రీలంకతో తలపడనుంది. ఈ టోర్నీలో రెండు హాఫ్ సెంచరీలు సాధించిన షెఫాలీ వర్మ ఫామ్‌లో ఉండటం ఇండియాకు ఆత్మవిశ్వాసాన్నిచ్చే అంశం. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై కూడా ఆమె అలవోకగా పరుగులు సాధిస్తోంది.
అయితే స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (154) సెంచరీ సాధించినా కొన్ని ఇన్నింగ్స్‌ల్లో విఫలమైంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని మంధాన భావిస్తోంది. వన్‌డౌన్‌లో ప్రతీక రావల్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్ కూడా బ్యాట్లు ఝుళిపిస్తే భారీ స్కోరు ఖాయం. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 11 వికెట్లతో రాణించడమే కాకుండా బ్యాటింగ్‌లోనూ కీలక భాగస్వామ్యాలు అందిస్తోంది.
శ్రీచరణి, ప్రేమ రావత్ రూపంలో నాణ్యమైన స్పిన్నర్లు ఉండటం ఇండియాకు బలాన్నిస్తోంది. పేసర్లు క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి కూడా మెరిస్తే బౌలింగ్‌లో ఇబ్బందులు తప్పినట్లే. అయితే ఫీల్డింగ్ వైఫల్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఇండియా ఫీల్డర్లు ఏకంగా తొమ్మిది క్యాచ్‌లు జారవిడిచారు.
మరోవైపు లంక కూడా ఈ మ్యాచ్ కోసం అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంది. సెమీస్‌లో పాక్ చేతిలో తడబడినా.. అద్భుతమైన పోరాటస్ఫూర్తితో కోలుకుంది. కెప్టెన్ చామరి ఆటపట్టు, హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి లంక బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. బౌలర్లు కూడా అండగా నిలిస్తే ఇండియాకు ఇబ్బందులు తప్పవు.
