జైలు కాదు జరిమానా.. 180 నేరాలకు శిక్షలు మార్పు 

జైలు కాదు జరిమానా.. 180 నేరాలకు శిక్షలు మార్పు 
  • 180 నేరాలకు శిక్షలపై కీలక సవరణలు 
  • ప్రజా విశ్వాసం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
  • బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు
  • కేంద్ర జన్ విశ్వాస్ చట్టానికి అనుగుణంగా మార్పు

హైదరాబాద్, వెలుగు: చిన్నచిన్న వ్యాపార, నిబంధనల ఉల్లంఘనలకు ఇక జైలు శిక్షలు ఉండవు. వాటి స్థానంలో జరిమానాలతో సరిపెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా విశ్వాసం బిల్లు–2026కు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సులభతర వాణిజ్యాన్ని (ఈజ్‌‌ ఆఫ్‌‌ డూయింగ్‌‌ బిజినెస్‌‌) ప్రోత్సహించడంతోపాటు సామాన్యులు, చిన్న వ్యాపారులు చిన్న తప్పిదాల కోసం కోర్టుల చుట్టూ తిరగకుండా చూడడమే బిల్లు ఉద్దేశం. శనివారం అసెంబ్లీలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌బాబు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. చర్చలో విప్‌‌ ఆది శ్రీనివాస్‌‌, బీజేపీ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్‌‌బాబు, పాయల్‌‌ శంకర్‌‌, సీపీఐ ఫ్లోర్‌‌ లీడర్‌‌ కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌ పాల్గొన్నారు. చర్చ అనంతరం బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

భయం లేకుండా వ్యాపారాలు చేసుకోవచ్చు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జన్‌‌ విశ్వాస్‌‌ చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో ఈ బిల్లును తీసుకొచ్చామని మంత్రి శ్రీధర్‌‌బాబు తెలిపారు. చిన్న తప్పులకు జైలు శిక్షకు బదులుగా జరిమానా విధించడం, పరిపాలనా వ్యవహారాల్లో న్యాయ నిర్ణయ యంత్రాంగాన్ని ప్రవేశపెట్టడం, ఉల్లంఘన తీవ్రత, వ్యవధిని బట్టి దశలవారీగా జరిమానాలు విధించడం, న్యాయ వివాదాలను తగ్గించడం, కొన్ని కేసులను రాజీ ద్వారా పరిష్కరించడం, కాలం చెల్లిన, అనవసర చట్టాలను తొలగించడం బిల్లు ప్రధాన లక్ష్యాలని వివరించారు. కేంద్రం ఇప్పటికే 180కిపైగా చిన్నపాటి నేరాలను నేరపూరిత పరిధి నుంచి తొలగించి జరిమానాల విధానాన్ని అమల్లోకి తెచ్చిందని, అదే తరహాలో రాష్ట్ర చట్టాల్లోనూ మార్పులు చేస్తున్నామని చెప్పారు. వ్యాపారులు ఎలాంటి భయం లేకుండా కార్యకలాపాలు నిర్వహించేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు.

చట్టాలపై అవగాహన కల్పిస్తాం

దేశంలో, రాష్ట్రంలో లక్షల కేసులు పెండింగ్‌‌లో ఉన్నాయని మంత్రి శ్రీధర్‌‌బాబు తెలిపారు. చిన్న తప్పులకు జైలు శిక్షల కారణంగా వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చాలా చట్టాలపై ప్రజలకు సరైన అవగాహన లేదని, వాటిపై ప్రభుత్వం తరఫున అవగాహన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. కేసుల కారణంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. గిరిజనులు, ప్రజల విషయంలో అటవీ శాఖ అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారన్న ఆరోపణల్లో వాస్తవం ఉందన్నారు. బ్యాంకులు రుణాలు ఇచ్చే సమయంలో, వసూలు చేసే సమయంలో చిన్న వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారన్న ఫిర్యాదులపై ఎస్‌‌ఎల్‌‌బీసీ సమావేశంలో అధికారులకు ఆదేశాలు ఇస్తామన్నారు.

చిన్న తప్పులకు జైలు వద్దు: ఆది శ్రీనివాస్

బిల్లుకు మద్దతు తెలిపిన విప్‌‌ ఆది శ్రీనివాస్‌‌.. పరిపాలనపై ప్రజల్లో విశ్వసనీయత పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర చట్టాల కింద ఉన్న చిన్న నేరాలను నేర రహితంగా మార్చడంతోపాటు జైలు శిక్షకు బదులుగా జరిమానా విధించేందుకు బిల్లు వీలు కల్పిస్తుందని చెప్పారు. తెలిసీ తెలియక చేసిన చిన్న పొరపాట్లకూ జైలు శిక్షలు పడుతున్నాయని, లోక్‌‌ అదాలత్‌‌లలో ప్రతి వారం పెద్ద సంఖ్యలో కేసులు రాజీ ద్వారా పరిష్కారమవుతున్నాయని పేర్కొన్నారు. అటవీ, ఎక్సైజ్‌‌, కార్మిక శాఖలకు సంబంధించిన స్వల్ప ఉల్లంఘనలకు ఇక జరిమానాలతోనే పరిష్కారం లభిస్తుందని తెలిపారు.

స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేలా..: పాయల్ శంకర్

బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌‌ శంకర్‌‌ మాట్లాడుతూ, వ్యాపారులు భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని కోరారు. చిన్న తప్పిదాలకు పోలీసుల జోక్యం పెరగకుండా చూడాలన్నారు. దశాబ్దాల కిందట రూపొందించిన కొన్ని లైసెన్సింగ్‌‌ చట్టాలు ఇప్పటికీ అమల్లో ఉన్నాయని, వాటిని తొలగించడమో, సవరించడమో చేయాలని సూచించారు.

ఫారెస్ట్‌‌ యాక్ట్‌‌ పేరుతో ఇబ్బందులు: పాల్యాయి

బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌‌బాబు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీ చట్టాల పేరుతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కవ్వాల్‌‌, తడోబా ప్రాంతాల్లో సమస్య ఎక్కువగా ఉందని, ముఖ్యంగా ఆదిలాబాద్‌‌ జిల్లాలో అటవీ అధికారులతో తరచూ వివాదాలు జరుగుతున్నాయని చెప్పారు. గొర్రెల కాపరులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. 

ఫారెస్ట్‌‌ సిబ్బందికి తుపాకులిస్తే ప్రమాదం: కూనంనేని

సీపీఐ ఫ్లోర్‌‌ లీడర్‌‌ కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ అటవీ సిబ్బందికి తుపాకులు ఇవ్వాలనుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఇది ద్వంద్వ పాలనకు దారితీసే అవకాశం ఉందన్నారు. అటవీ చట్టాల్లో అన్యాయమైన నిబంధనలు ఉన్నాయని, పీడీ యాక్ట్‌‌ ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. తనపై కూడా పీడీ యాక్ట్‌‌ నమోదు చేస్తామని బెదిరించారని, అటవీ చట్టాల పేరుతో ప్రజలను జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బిల్లులో కీలక మార్పులు

జైలు శిక్షల స్థానంలో జరిమానా: వ్యాపార నిర్వహణలో చిన్నచిన్న నిబంధనల ఉల్లంఘనలకు జైలు శిక్షకు బదులుగా జరిమానా విధిస్తారు. 180కిపైగా చిన్న నేరాలను నేరపూరిత పరిధి నుంచి తొలగించారు.
రాజీకి అవకాశం: చిన్నపాటి ఉల్లంఘనలకు కోర్టుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా కొన్ని కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. దీంతో కోర్టులపై భారం తగ్గుతుంది.
తీవ్రతను బట్టి జరిమానా: ఉల్లంఘన తీవ్రత, వ్యవధిని పరిగణనలోకి తీసుకుని దశలవారీగా జరిమానాలు విధించే విధానం ఉంటుంది.
బ్యాంకు రుణాలపై దృష్టి: చిన్న వ్యాపారులు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాల పారిశ్రామికవేత్తలకు బ్యాంకు రుణాల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి స్టేట్‌‌ లెవెల్‌‌ బ్యాంకర్స్‌‌ కమిటీ (ఎస్‌‌ఎల్‌‌బీసీ)కి తగిన ఆదేశాలు ఇవ్వనున్నారు.
పాత చట్టాల తొలగింపు: కాలం చెల్లిన, అనవసరమైన చట్టాలను రద్దు చేయడం లేదా అవసరమైన చోట సవరణలు చేయడం కూడా బిల్లు లక్ష్యాల్లో భాగం.