పొంగులేటివన్నీ అబద్ధాలే.. తన మామ భూమిపై హరీశ్ రావు క్లారిటీ 

పొంగులేటివన్నీ అబద్ధాలే.. తన మామ భూమిపై హరీశ్ రావు క్లారిటీ 
  • నిలదీద్దామంటే సస్పెండ్ చేసిన్రు
  • తన మామ భూమిపై మాజీ మంత్రి హరీశ్ క్లారిటీ 
  • 2010లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఎన్వోసీ ఇచ్చింది 
  • చెక్కు ఇచ్చి ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నరు
  • భూమి కేటాయింపు.. ఎన్వోసీ, రిజిస్ట్రేషన్ 
  • అన్నీ కాంగ్రెస్ హయాంలోనే చేశారని వివరణ
  • అత్యాశ కోసమే పేదల భూములనూ 22ఏలో పెట్టారు: హరీశ్​ రావు

హైదరాబాద్, వెలుగు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అసెంబ్లీలో అబద్ధాల ప్రవాహాన్ని పారించారని బీఆర్ఎస్​డిప్యూటీ ఫ్లోర్​లీడర్​హరీశ్​రావు ఆరోపించారు. తాను అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ ఆయన సమాధానం చెప్పలేదన్నారు. రాష్ట్రంలో ఒక సమస్య వస్తే పార్టీలకతీతంగా విపక్షాలు స్పందిస్తాయని.. ఆ మాత్రం సోయి కూడా లేకుండా బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అన్నట్టుగా చిల్లర వ్యాఖ్యలు చేశారన్నారు. ఎంఐఎం ఫీజు రీయింబర్స్ మెంట్‎పై మాట్లాడిందని.. అప్పుడు బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే అంటారా? అని ప్రశ్నించారు. 

ఎన్ని ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారని అడిగితే సమాధానం చెప్పలేదని, తప్పు జరిగిందని పొంగులేటి ఒప్పుకున్నారన్నారు. 2025 డిసెంబర్​ 3న అప్​లోడ్​ చేసిన ఒక లిస్ట్​తోనే సమస్య వచ్చిందని చెప్పారని.. టైం తక్కువ ఉన్న కారణంగా చూసుకోకుండా అందరి భూములను అప్ లోడ్ చేసినం అని చెప్పారన్నారు. అసెంబ్లీలో 22ఏపై నిలదీస్తామన్న ఉద్దేశంతోనే తమను కావాలనే సస్పెండ్​ చేశారని హరీశ్ ఆరోపించారు. అసెంబ్లీలోనైనా రిలీఫ్​ వస్తుందని భావించిన బాధితులకు ఉపశమనమేమీ లేదని మండిపడ్డారు. 

సీఎం ఇల్లు జాబితా నుంచి ఎలా తీశారో.. ప్రజల భూములనూ అలాగే తీస్తారనుకుంటే తీయలేదన్నారు. ఎన్ని భూములు 22ఏలో పెట్టారు.. ఎన్నింటిని తొలగించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేసినా అతీగతీ లేదని మండిపడ్డారు. వెంటనే క్షమాపణలు చెప్పి సీఎం ఇంటిని జాబితా నుంచి ఎలా తొలగించారో.. పేదల భూములనూ తొలగించాలన్నారు. శనివారం తెలంగాణ భవన్​లో మీడియాతో హరీశ్​మాట్లాడారు. 

అత్యాశ కోసం నిషేధిత జాబితాలో పెట్టిన్రు

యాదాద్రి జిల్లాలో తాతముత్తాతలు సంపాదించిన 42 వేల ఎకరాల ఆస్తిని నిషేధిత జాబితాలో పెట్టారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి చెప్పారని, ఇదే విషయాన్ని సీఎం రేవంత్​కూ చూపించామని ఆయన అన్నారని హరీశ్​ రావు పేర్కొన్నారు. కానీ, ఇప్పుడేమో 25 వేల ఇండ్లు తెలిసో తెలియక పడ్డవి అంటూ మాట మార్చారన్నారు. ఎంత తప్పించుకుందామని చూసినా తప్పించుకోలేరన్నారు. 

తమ హయాంలోనే సమస్య ఉందంటూ బుకాయించే ప్రయత్నం చేశారని, అప్పుడే సమస్య ఉంటే ఇప్పుడెందుకు రిజిస్ట్రేషన్లు ఆగాయని హరీశ్​రావు ప్రశ్నించారు. తప్పు చేసింది కాంగ్రెస్​ ప్రభుత్వం.. మంత్రి పొంగులేటి అని అన్నారు. అత్యాశ కోసం భూములను 22ఏలో పెట్టారని ఆరోపించారు. ‘‘నాదర్ గుల్ భూములపై , ముఖ్యమంత్రి అన్న భూముల విషయం, మీ కొడుకు వట్టినాగులపల్లిలో వృద్ధ దంపతుల మీద దాడి చేస్తే కేసు అయ్యింది.. వాటిమీద కనీసం సమాధానం లేదు. ఖాజాగూడ భూములు, ఫీనిక్స్ కంపెనీ అగ్రిమెంట్ పై స్పందించలేదు.

 మా మామ భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. మా మామ రిటైర్డ్ బ్యాంకు అధికారి. ఆయన చెక్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆయనకు భూమి అలాట్ చేసింది 1995లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత 2010లోనే కాంగ్రెస్​ ప్రభుత్వమే ఎన్వోసీ ఇచ్చింది. భూమి ఇచ్చింది కాంగ్రెస్, ఎన్వోసీ ఇచ్చింది కాంగ్రెస్ రిజిస్ట్రేషన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం’’ అని ఆయన అన్నారు. 

సీనియర్​ ఎమ్మెల్యేకి కనీస గౌరవం ఇవ్వరా

సీనియర్ ఎమ్మెల్యేలకు గౌరవం కూడా ఇవ్వరా అనిహరీశ్​ నిలదీశారు. అగ్గిపెట్టె రావు అంటూ ఎందుకు అంటున్నారని మండిపడ్డారు. అలా అంటే నన్ను అవమానించినట్లు కాదు.. తెలంగాణ ఉద్యమకారులను అవమానించినట్టేనని అన్నారు. భూములు 22ఏలో పొరపాటున పడ్డాయని చెబుతున్న ప్రభుత్వం.. అధికారుల మీద చర్యలు తీసుకుంటే బయటపెట్టాలని డిమాండ్​ చేశారు. ఆపరేటర్ల మీద చర్యలు తీసుకుని తప్పించుకుంటున్నారని ఆరోపించారు. 

పొంగులేటిది అహంకారం: పల్లా రాజేశ్వర్​ రెడ్డి

మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి అహంకారంతో మాట్లాడారని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డి అన్నారు. తాను వట్టినాగులపల్లిలో రూ.3 వేల కోట్ల భూమి భూదాన్ భూమి తీసుకున్నానని ఆయన అంటున్నారని, తెలంగాణ రాకముందు ఒక ఎకరం 10 గుంటలకు అగ్రిమెంట్ అయినా, తెలంగాణ వచ్చిన మొదటి నెలలో రిజిస్ట్రేషన్ చేసుకున్నానని చెప్పారు. అది భూదాన్ లో లేదని 2008లో కోర్టు కూడా చెప్పిందని, తన భూమి ఉందని పొంగులేటి బినామీ వచ్చి తనను అమ్మాలని అడిగారని, 10 నుంచి 15 రోజుల్లో తన భూమిని 22ఏలో చేర్చి బ్లాక్​ మెయిల్​ చేస్తున్నారని ఆరోపించారు. తన భూమిలో ఇన్వాల్వ్​ కావొద్దంటూ కోర్టు కూడా చెప్పిందని, రెవెన్యూ అధికారులూ కాబోమన్నారని చెప్పారు.