ఇరాన్‎పై దాడి చేసేందుకే అణ్వాయుధ ఆరోపణలు.. అమెరికాతో ఇప్పట్లో చర్చలు లేవు: పెజిష్కియాన్

ఇరాన్‎పై దాడి చేసేందుకే అణ్వాయుధ ఆరోపణలు.. అమెరికాతో ఇప్పట్లో చర్చలు లేవు: పెజిష్కియాన్

న్యూఢిల్లీ: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల వేళ చర్చలు, అణ్వాయుధాల తయారీపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించిన నేపథ్యంలో యుద్ధం ముగింపు కోసం అమెరికాతో ఇప్పట్లో దౌత్యపరమైన చర్చలు జరిగే అవకాశం లేదన్నారు. ఇక, తాము అణ్వాయుధాల తయారీకి ప్రయత్నిస్తున్నామన్న అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపణలను ఆయన ఖండించారు. ఇదంతా ఆ దేశాల కుట్ర అని.. ఇరాన్‌పై దాడి చేసేందుకు ఈ ప్రచారాన్ని సాకుగా వాడుకుంటున్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడే తాము అణు కార్యకలాపాలు సాగిస్తున్నామని స్పష్టం చేశారు. 

భారత రాజధాని ఢిల్లీ వేదికగా బ్రిక్స్ కూటమి 18వ శిఖరాగ్ర సదస్సు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా నేషనల్ మీడియా ఛానల్ ఇండియా టుడేకు పెజిష్కియాన్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మేము అణ్వాయుధాలను కోరుకుంటే ఎన్‌పీటీలో సభ్యత్వం తీసుకుని ఉండేవాళ్ళం కాదు. ఇరాన్ భూభాగంపై దాడి చేయడానికి అమెరికా, ఇజ్రాయెల్ ఈ ప్రచారాన్ని సాకుగా చూపిస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై విస్తృతమైన నిఘా ఉంది. ఎన్‌పీటీ, అంతర్జాతీయంగా చట్టాల ప్రకారం అణు సమస్యలపై చర్చలకు ఇరాన్ సిద్ధంగా ఉంది. ఎన్‌పీటీ ఇరాన్‌లోని అణు కార్యకలాపాలపై ప్రతిరోజూ పర్యవేక్షణ జరుపుతున్నారు. మేము ప్రతిదీ అంతర్జాతీయ సూత్రాల పరిధిలోనే చేస్తున్నాం’’ అని ఆయన స్పష్టం చేశారు. 

కాగా, అమెరికా, ఇరాన్ మధ్య ఇటీవల మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరుదేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. అమెరికా దాడులకు ధీటుగా ఇరాన్ కౌంటర్ ఇస్తోంది. దీంతో పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంటోంది. ఈ తరుణంలో అమెరికాతో ఇప్పట్లో చర్చలు లేవని ఇరాన్ అధ్యక్షుడు పేర్కొనడంతో వార్ ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు.