హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరీశ్ రావు తన పరపతిని ఉపయోగించి వేల కోట్ల విలువైన ప్రభుత్వ, అసైన్డ్ భూములను అన్యాక్రాంతం చేశారన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. శనివారం (సెప్టెంబర్ 12) ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి అన్ని అబద్ధాలే చెప్పాడన్నారు.
22ఏతో రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. 22ఏపై ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీస్తామనే భయంతోనే మమ్మల్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. సభలో మేం లేకుండా చేసి పొంగులేటి పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. మేం అడిగిన ఒక్క ప్రశ్నకు పొంగులేటి సమాధానం చెప్పలేదని విమర్శించారు. అసలు ఎన్ని ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారో ప్రభుత్వం చెప్పనే లేదని వ్యాఖ్యానించారు.
రైతుల వ్యవసాయ భూములను పొరపాటుగా నిషేధిత జాబితాలో చేర్చామని అసెంబ్లీ సాక్షిగా పొంగులేటి ఒప్పకున్నారు. కానీ ఇందుకు క్షమాపణలు చెప్పకుండా ఆయన తప్పించుకున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసం కూడా 22ఏలో ఉందన్నారు కదా.. ఆయన ఇళ్లును ఎప్పుడు తీసేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
మా మామ భూములు గజ్వేల్‌లో ఉన్నయ్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేటలో తన మామ పేరిట హరీష్ రావు అసైన్డ్ భూములు పట్టా చేసుకున్నారన్న మంత్రి పొంగులేటి ఆరోపణలను హరీష్ రావు ఖండించారు. తన మామ భూములు ఉన్నది సిద్దిపేటలో కాదని.. గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. మా మామ ఒక రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ అని.. చెక్ ఇచ్చి లీగల్‌గానే ఆయన భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వివరణ ఇచ్చారు.
మా మామ భూములు కొన్నప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని.. కావాలంటే అన్ని ఆధారాలు చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తాతముత్తాతల నుంచి వచ్చిన భూములను కూడా 22ఏలో పెట్టారని విమర్శించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదు అయితే రాత్రికి రాత్రే సీఐని మార్చాడని ఆరోపించారు.
పొంగులేటి ఆయన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు నాపై బురద జల్లుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన అవినీతి, అసమర్థతను ప్రశ్నిస్తున్నామన్న ఆక్రోశంతో అగ్గిపెట్టే రావు అంటూ పొంగులేటి అవమానించేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
