సముద్రం మాయమవడం మీరెప్పుడైనా చూశారా. కిలోమీటర్లు మేరకు సముద్రంలో నీరు కనిపించకుండా పోయింది. విశాలమైన సముద్రగర్భం బయటపడింది. ఓడలు, పడవలు ఒడ్డున పడ్డాయి. సముద్రంలోని పెద్దపెద్ద రాళ్లు, చిన్న చిన్న గుట్టలుగా కనిపించాయి. ఇదంతా రాత్రికి రాత్రే నాటకీయంగా జరిగింది. సముద్రం అదృశ్యమైన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సముద్రం మాయమైపోయింది, ఇక కనిపించదు అని ఆందోళన పడే స్థాయికి ప్రచారం సాగింది. నిజంగా సముద్రం అదృశ్యమైందా.. అర్జెంటినా సముద్ర తీరంలో ఏంజరిగింది.. ఫుల్ డిటెయిల్స్..
అర్జెంటీనా నుండి సముద్రం అదృశ్యమైంది అని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆగస్టు 2026 చివరి రోజుల్లో అర్జెంటీనా అట్లాంటిక్ తీరప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో సముద్రపు నీరు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లడం సంచలనంగా మారింది.బ్యూనస్ ఎయిర్స్ సమీప తీరాల్లో సముద్రగర్భం బయటపడటంతోపాటు పడవలు ఒడ్డున కనిపించాయి. ఆశ్చర్యంగా, నాటకీయంగా సముద్రం వెనక్కి పోవడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.. అంతటితో ఆగలేదు.. సముద్రం శాశ్వతంగా ఎండిపోయింది.. ఇక తిరిగి రాకపోవచ్చు అనే ఊహాగానాలు బయటికొచ్చాయి. ఇంతకీ సముద్రం ఎందుకు వెనక్కిపోయింది.. రాత్రికిరాత్రే కిలోమీటర్ల మేర కనిపించకుండా పోవడం వెనక రహ్యసం ఏంటీ.. వెనక్కి వెళ్లిన సముద్రం తిరిగి వస్తుందా వంటి సందేహాలు నెటిజన్లలో తలెత్తాయి.
అయితే ఇది సముద్రం శాశ్వతంగా అదృశ్యమవుతున్న సంకేతం కాదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. తీవ్రమైన ఆటుపోట్లు, బలమైన తీరగాలుల పరస్పర ప్రభావంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వివరించారు. భూభాగం నుంచి అట్లాంటిక్ వైపు వీచే బలమైన గాలులు ఉపరితల నీటిని తీరం నుంచి దూరంగా తీసుకుపోతాయి. ఇవి సహజ ఆటుపోట్లతో కలిసినప్పుడు తీరప్రాంతంలో నీటిమట్టం ఒక్కసారిగా తగ్గినట్లు కనిపిస్తుంది.
వాతావరణ పరిస్థితులు, గాలి పీడనం, తీరరేఖ ఆకారం, ఆటుపోట్ల చక్రాల్లో మార్పులతో ఇలాంటి హెచ్చుతగ్గులు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితులు మారిన తర్వాత సముద్రపు నీరు తిరిగి తీరానికి చేరుకుంది. కాబట్టి వైరల్ వీడియోలను చూసి ప్రపంచ పర్యావరణ విపత్తుగా భావించకుండా, శాస్త్రీయ కోణంలో అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
