న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఎయిర్ ఇండియా మాజీ పైలట్ అనుమానస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. విమానయాన సంస్థలో కెప్టెన్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి సెప్టెంబర్ 10న దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో ఉన్న ది గ్రాండ్ హోటల్‌లో చెక్-ఇన్ అయ్యాడు. అయితే, ఎన్నిసార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో బాధితుడు సోదరుడు హోటల్ మేనేజర్‌ను సంప్రదించాడు.
ఆ సమాచారం మేరకు మేనేజర్ అతడి గదికి వెళ్లి చూడగా తలుపు లోపలి నుండి తాళం వేసి ఉంది. దీంతో హోటల్ మాస్టర్ కీ ఉపయోగించి గదిని తెరిచారు. లోపల బాధితుడు స్పృహ లేకుండా అచేతన స్థితిలో పడి ఉన్నాడు. హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వసంత్ కుంజ్ నార్త్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
బాధితుడిని వైద్య సహాయం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని.. మృతికి గల కారణాలపై వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణానికి కారణమేంటన్నది తెలుస్తుందన్నారు.
