మీటర్ రీడర్లను తొలగించడం లేదు.. పుకార్లను నమ్మవద్దు: జలమండలి

మీటర్ రీడర్లను తొలగించడం లేదు.. పుకార్లను నమ్మవద్దు: జలమండలి

మీటర్ రీడర్లను తొలగించడం లేదని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తున్న మీటర్ రీడర్లను విధుల నుంచి తొలగించే ఉద్దేశం లేదని చెప్పారు. 2026 సెప్టెంబర్ 12న మాట్లాడిన ఆయన.. మీటర్ రీడర్ల క్రమబద్ధీకరణపై ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు.

అవుట్‌సోర్సింగ్ విధానంలో కొనసాగించే అంశాన్ని కూడా ప్రతిపాదించినట్లు చెప్పారు.  ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో మీటర్ రీడర్ల క్రమబద్ధీకరణ అంశం ఉందన్నారు. దీనిపై మంగళవారం ( సెప్టెంబర్ 15న) ప్రభుత్వ స్థాయిలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. 

ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. మీటర్ రీడర్ల విజ్ఞప్తుల ను దృష్టిలో ఉంచుకుని గత టెండర్ల ప్రక్రియ నిలిపివేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. 

మీటర్ రీడర్ల పెండింగ్ జీతాలపై చర్యలు జరిపినట్లు చెప్పారు. ఏజెన్సీలకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు విడుదల చేసినట్లు తెలిపారు. హాజరు వివరాల సమర్పణలో జాప్యంతో బిల్లుల చెల్లింపులో ఆలస్యం అయినట్లు చెప్పారు. హాజరు పరిశీలన అనంతరం అర్హత మేరకు బిల్లుల విడుదల చేయనున్నామని అన్నారు. 

జలమండలి బిల్లులు విడుదల చేసిన తర్వాత మీటర్ రీడర్లకు జీతాలు చెల్లించాల్సిన బాధ్యత ఏజెన్సీలదేనని అన్నారు. మీటర్ రీడర్లను తొలగిస్తున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని ఈ సందర్భంగా తెలిపారు. జీతాలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారన్న ప్రచారాన్ని ఖండించింది జలమండలి. మీటర్ రీడర్ల సమస్యలపై సానుకూలంగా వ్యవహరిస్తున్న జలమండలి.. అనవసర పుకార్లు, అపోహలు నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది.