- కేసీఆర్, హరీశ్ రావు, గంగుల అక్రమాలివిగో..
- బీఆర్ఎస్హయాంలో రూ. 30 వేల కోట్ల భూదోపిడీ
- సింఫనీ నుంచి ఇస్నాపూర్ వరకు లెక్కలివే
- అసెంబ్లీలో చిట్టా విప్పిన మంత్రి పొంగులేటి
- ధరణిని దన్నుగా తమవాళ్లకు భూసంతర్పణ
- మాజీ మంత్రి హరీశ్ తన మామకు జాగా రాసిచ్చారు
- నిషేధిత జాబితా నుంచి తొలగించి మరీ పట్టాలు
- ‘22-ఏ ఇవాళ పుట్టలే.. 2007 నుంచే అమలు
- పదేండ్లు పాలించిన కేసీఆర్‌కు ఇవి కనిపించలే
- మీరే సరిదిద్ది ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేదా?
- సరిచేస్తం.. ప్రతిపక్షాలు సహకరించాలన్న మంత్రి
హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వ పెద్దలు ధరణిని అడ్డంపెట్టుకొని వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను తమ సొంత మనుషులకు ధారాదత్తం చేశారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. వాటిలో కొన్నింటిని తిరిగి 22ఏలో చేర్చడం ద్వారా తాము కాపాడామని స్పష్టంచేశారు. కేసీఆర్, హరీశ్ రావు, గంగుల కమలాకర్‌సహా అందరూ భూబకాసురులే అని పేర్కొంటూ.. వారు కొల్లగొట్టిన భూముల వివరాలను ఆధారాలతో సహా మంత్రి పొంగులేటి బయటపెట్టారు.
‘‘మాజీ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ప్రభుత్వ భూములను కొల్లగొట్టి, కావాల్సిన వాళ్లకు పంచిపెట్టిండు.. ఫ్రీడమ్ ఫైటర్స్, ఎక్స్‌సర్వీస్‌మెన్ పేర్లతో అసైన్చేసుకొని, కోర్టుల్లో కేసులు పెట్టించి, నిషేధిత జాబితాలోంచి తొలగించి మరీతన మామ హనుమంతరావు పేరుతో పట్టా ఇప్పించుకున్నడు. ఇప్పుడు తాము నిషేధిత జాబితాలో పెట్టేసరికి గగ్గోలు పెడ్తున్నడు. అధికారంలో ఉంటే దోచుకోవడం.. ప్రతిపక్షంలోకి రాగానే బ్లాక్‌మెయిలింగ్ చేయడం.. ఇదేనా మీ రాజకీయం ?’’ అని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో 22ఏ కింద నిషేధిత జాబితాలో తమ సర్కారు కొత్తగా ఎలాంటి భూములనూ చేర్చలేదని, అవన్నీ గత ప్రభుత్వాల రికార్డుల నుంచే తీసుకున్నామని స్పష్టం చేశారు.
‘‘గత ప్రభుత్వం ఇచ్చిన వివరాలనే ఆఫీసర్లు భూ భారతి వెబ్సైట్లో అప్‌లోడ్ చేశారు. ఏవైనా తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సర్కారు రెడీగా ఉంది. ప్రతిపక్షాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉంది’’ అని పొంగులేటి పేర్కొన్నారు. శాసనసభలో శనివారం 22-ఏ పై జరిగిన చర్చలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని, ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు దీటుగా బదులిచ్చారు. హరీశ్‌రావు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు చేసిన విమర్శలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లను చూపిస్తూ.. ప్రతి అంశానికి ఆధారాలతో సహా సమాధానం ఇచ్చారు.
22-ఏలో పెట్టి, కావాలనే రిజిస్ట్రేషన్లు నిలిపివేశారన్న ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలు తప్పని చెప్తూ , రిజిస్ట్రేషన్ జరిగిన తేదీలు, ఇతర వివరాలను అసెంబ్లీలో చదివి వినిపించారు. ‘‘22-ఏ అనేది ఇవాళ పుట్టింది కాదు.. 2007 నుంచి అమల్లో ఉంది. అదే వ్యవస్థను గత బీఆర్‌ఎస్ సర్కారు కూడా కొనసాగించింది. ధరణి వచ్చిన తర్వాత తయారు చేసిన 22-ఏ జాబితానే హైకోర్టు ఆదేశాల మేరకు 2025 డిసెంబర్ 3న ఆన్‌లైన్‌లో అధికారులు అప్‌లోడ్ చేశారు. ఈ సమయంలో జరిగిన పొరపాట్లను వెంటనే ప్రభుత్వం గుర్తించింది.
ఆ తర్వాత సరిదిద్దాం. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ఈ సమస్యను ఎందుకు పట్టించుకోలేదు? మీరు పరిష్కరించి ఉంటే ఈ రోజు ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. దొంగే పోలీస్‌ను పట్టుకొని దొంగా... దొంగా... అని అరిచినట్టుగా ఉంది’’ అని బీఆర్‌ఎస్, బీజేపీ నాయకుల తీరుపై మంత్రి పొంగులేటి మండిపడ్డారు. ధరణిని అడ్డం పెట్టుకొని వేల కోట్లు దోచుకోవడమే కాకుండా తప్పుడు ఆధారాలతో ఇప్పుడు ప్రజలను రెచ్చగెడ్తున్నారని ఫైర్అయ్యారు.
ఆ ఆరోపణలు నిజం కాదు..
22ఏను అడ్డం పెట్టుకొని తమ ప్రభుత్వం లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో చేర్చి అమ్ముకోకుండా చేస్తున్నదని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు నిజం కాదని మంత్రి పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న భూ రికార్డులు, ఇప్పటి తమ ప్రభుత్వ రికార్డులను అధికారికంగా అసెంబ్లీలో ప్రకటించారు. 2023 డిసెంబర్ 7న తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి వివిధ రకాల భూములు కలుపుకొని 22ఏలో కోటి 2 లక్షల 52 వేల 690 ఎకరాలు ఉండగా, ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి కోటి 2 లక్షల 5 వేల 250 ఎకరాలు మాత్రమే ఉన్నాయన్నారు. దీనిని బట్టి గతంలో కంటే ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో 47 వేల 440 ఎకరాలు తగ్గాయని వివరించారు. వాస్తవం ఇలా ఉంటే 22-ఏ లక్ష కోట్ల ఎకరాలు చేర్చారంటు విష ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశించారు.
సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండడంతో..
శంషాగుడ -సర్వే నెం. 57లోని జన్మభూమి కాలనీ, ఇందిరా హిల్స్, వివేకానంద నగర్ ఉన్న 274.33 ఎకరాల భూమి ‘సీఎస్ 7’ పరిధిలోకి వస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు. సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నందున 2013 నుంచి ఈ సర్వే నంబరు పీవోబీ జాబితాలోనే ఉందని వెల్లడించారు. కూకట్‌పల్లి మండలం పరిధిలో ఏ ఒక్క పట్టా భూమిని కూడా 22-ఏ నిషేధిత జాబితాలో కొత్తగా చేర్చలేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. భువనగిరి జిల్లాలో సుమారు 40 వేల ఇంటి స్థలాలు 22-ఏ లో చేర్చామనడం నిజం కాదని స్పష్టం చేశారు.
ఇక్కడ సమస్య 40 వేల ఎకరాలు కాదని, 40 వేల ఇంటి స్థలాలు మాత్రమేనని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు 2025 డిసెంబర్‌లో జరిగిన డేటా అప్‌డేషన్ సమయంలో ఇంటి నంబర్‌తోపాటు లబ్ధిదారుడి పేరును కూడా రికార్డులో చేర్చడం వల్ల సాంకేతిక సమస్య తలెత్తిందని వివరించారు. ఆ సమస్యను పరిష్కరించామన్నారు. భువనగిరి పట్టణ పరిధిలో ఉన్న ఐదు రెవెన్యూ గ్రామాల్లో సుమారు 113 ఎకరాల వ్యవసాయేతర భూమిని 1980 నుంచి పేదల ఇండ్ల స్థలాల కోసం కేటాయిస్తూ వచ్చారని, ఇప్పటివరకూ ఈ భూముల్లో దాదాపు 3,390 ఇంటి స్థలాలను ప్రజలకు కేటాయించారని తెలిపారు.
హరీశ్‌రావు ఆరోపణలు తప్పు
ఇస్నాపూర్ గ్రామం 18వ వార్డు పరిధిలోని సర్వే నంబర్ 496లో 2 వేల ఇళ్లను 22-ఏ జాబితాలో కొత్తగా చేర్చారన్న హరీశ్‌రావు ఆరోపణలు తప్పని మంత్రి పొంగులేటి ప్రకటించారు. ‘‘సర్వే నంబర్ 496లో మొత్తం 173.31 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 120 ఎకరాలను ఇందిరమ్మ ఇళ్ల కోసం 850 ప్లాట్లకు, మరో 38 ఎకరాలను స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు కేటాయించారు.
ఇందులో 28 ఎకరాల అసైన్డ్ భూమిని ప్రభుత్వ ఎన్‌వోసీ లేకుండా పదేండ్ల లాక్‌ఇన్ నిబంధనను ఉల్లంఘించి కొందరు లబ్ధిదారులు రియల్ ఎస్టేట్ సంస్థలకు విక్రయించినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ భూముల్లో సూర్యవంశీ, మల్లికార్జున, పినాకిల్, నాగార్జున తదితర రియల్ ఎస్టేట్ లేఅవుట్లు ఏర్పడ్డాయని తెలిపింది.ఈ భూములు 2016 నుంచే 22-ఏ జాబితాలో కొనసాగుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా చేర్చలేదు’’ అని స్పష్టంచేశారు.
సరూర్‌నగర్‌లో 379.32 ఎకరాల పట్టా భూములు 22-ఏలో లేవు
సరూర్‌నగర్ పరిధిలోని సర్వే నంబర్ 9/1 లో 540 ఎకరాల 32 గుంటల భూమిని 22-ఏలో చేర్చారన్న హరీశ్‌రావు ఆరోపణపైనా సర్కారు రికార్డుల ఆధారంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ‘‘రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 9/1లో మొత్తం ప్రభుత్వ భూమిగా వర్గీకరించబడింది. ఇందులో నిజాం, ఇతరుల అభ్యర్థనల మేరకు 388.36 ఎకరాలు కేటాయించగా, అందులో 9 ఎకరాల 04 గుంటలను అదనపు భూమిగా ప్రకటించి నిషేధిత జాబితాలో ఉంచారు.
మిగిలిన 151.36 ఎకరాల ప్రభుత్వ భూమిని హెచ్ఎండీఏ, ఆలిండియా రేడియో, పోలీస్ శాఖ, స్పోర్ట్స్ కౌన్సిల్, ఇళ్ల స్థలాలకు కేటాయించారు. కొంత భాగం ఎన్టీఆర్ నగర్, మురికివాడ ఆక్రమణలో ఉన్నట్టు రికార్డుల్లో ఉంది. మరోవైపు టెలిఫోన్ కాలనీ, గ్రీన్ హిల్స్ కాలనీ, ఆర్కె. పురం తదితర కాలనీలు ఉన్న 9/1/ఏ నుంచి 9/1/ఎల్ పరిధిలోని 379.32 ఎకరాల పట్టా భూములు 22-ఏలో లేవని మంత్రి స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ తప్పిదాలను బటయపెట్టిన పొంగులేటి
22ఏ విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను మంత్రి పొంగులేటి బయటపెట్టారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామంలోని సర్వే నంబర్లు 191, 193లో 25 ఎకరాల 15 గుంటల పట్టా భూమిని బోయినపల్లి నర్సింహులు, బోయినపల్లి యాదగిరి భూదాన్ యజ్ఞబోర్డుకు దానం చేయగా..ఈ భూమిని 1993లో ఆరుగురు లబ్ధిదారులకు కేటాయించినట్టుగా మంత్రి తెలిపారు.
2005లో వాళ్లు ఇతరులకు విక్రయించగా.. 2021లో మళ్లీ భూదాన్ దాతల పేర్లపై భూమి తిరిగి నమోదైందన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే 2022లో ఈ భూమికి హెచ్‌ఎండీఏ లేఅవుట్ అనుమతి ఇచ్చినప్పటికీ, 2007 నుంచే ఈ భూమి నిషేధిత జాబితాలో కొనసాగుతున్నట్టు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా ఈ భూమిని 22-ఏలో చేర్చిన విషయం కాదని స్పష్టం చేశారు.
‘‘రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పిగ్లిపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 17లో మొత్తం 386 ఎకరాల భూమి ఉంది. ఇందులో 197 ఎకరాలు పట్టా భూమి కాగా, 189 ఎకరాలు సీలింగ్, భూదాన్ ల్యాండ్ ఉన్నాయి. ఈ భూమి 2007లో 22-ఏ చట్టం వచ్చినప్పటి నుంచే నిషేధిత జాబితాలో కొనసాగుతున్నది” అని మంత్రి పొంగులేటి తెలిపారు. సీలింగ్ జాబితాలోని 189 ఎకరాల్లో పిగ్లిపూర్ గ్రామానికి సంబంధించిన 26 ఎకరాలకు 2023 మే 15న హెచ్‌ఎండీఏ ఎంజీవై కన్‌స్ట్రక్షన్స్‌కు అనుమతి ఇచ్చినప్పటికీ పాత భూ వర్గీకరణ, గతంలో అమల్లో ఉన్న ఆంక్షలే కొనసాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు.
ఎన్‌వోసీ లేక 22-ఏలో
కొల్లూరు–ఉస్మాన్‌సాగర్ భూములు ఎన్‌వోసీ లేక 22-ఏలో కొనసాగుతున్నట్టు మంత్రి పొంగులేటి ప్రకటించారు. ‘‘సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని కొల్లూరు సర్వే నంబర్ 191లో 143 ఎకరాలు, ఉస్మాన్‌సాగర్ సర్వే నంబర్ 30లో 93 ఎకరాల భూమిని 1972-–73లో మాజీ సైనికులకు అసైన్‌మెంట్ చేశారు. అయితే సంబంధిత శాఖల నుంచి అవసరమైన ఎన్‌వోసీ లేక ఈ భూములు 22-ఏ పరిధిలోనే కొనసాగుతున్నాయి” అని తెలిపారు. ఈ భూముల్లో ఎస్‌ఎస్‌పీడీఎల్, బీహెచ్‌ఈఎల్ ఎంప్లాయిస్ హౌజింగ్ సొసైటీ కలిసి 2022లో హెచ్‌ఎండీఏ నుంచి లేఅవుట్ అనుమతి పొందినప్పటికీ 22-ఏ నుంచి భూములు తొలగిపోలేదని ప్రకటించారు.
22ఏ వర్గీకరిస్తూ జీవో ఇచ్చింది గత సర్కారే
రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు 22ఏ భూములను వర్గీకరిస్తూ 2016లో జీవో నెంబర్ 121 జారీ చేసింది గత బీఆర్‌ఎస్ సర్కారేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. 22ఏ లోని స్మాల్ ‘ఏ’ విభాగంలో అసైన్డ్ భూములు, ‘బీ’ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములు, ‘సీ’లో ఎండోమెంట్, వక్ఫ్ భూములు, ‘డీ’లో సీలింగ్ భూములు, ‘ఇ’ లో ప్రభుత్వ ఆసక్తి గల భూములను చేర్చుతూ ఏడాది తర్వాత 2017లో ఆనాటి ప్రభుత్వం గైడ్‌లైన్స్ ఇచ్చిందని చెప్పారు. ఈ గైడ్ లైన్స్‌ను నాటి ప్రభుత్వం సరిగ్గా అమలు చేయకపోవడంతో 2017 నుంచి 2025 వరకు హైకోర్టులో 28,611 కేసులు నమోదైనట్టు మంత్రి తెలిపారు. ఆ తర్వాత తమ ప్రభుత్వంలో హైకోర్టు ఆదేశాల మేరకు కేటగిరీల ప్రకారం 22-ఏ జాబితాను 2025 డిసెంబర్ 3న పబ్లిక్ డొమైన్‌లో ఉంచినట్టు చెప్పారు.
మెదక్ జిల్లా ఎన్నికల ఖర్చు కోసం 372 ఎకరాల ధారాదత్తం
2023 అసెంబ్లీ ఎలక్షన్ల సందర్భంగా మెదక్ జిల్లాలో ఖర్చు కోసం శివంపేట మండలం, సికింద్లాపూర్ గ్రామం లోని 569.05 ఎకరాలు ఇనాం భూ కుంభకోణానికి పాల్పడ్డారని పొంగులేటి ఆరోపించారు. కొందరు రెవెన్యూ ఆఫీసర్ల సహాయంతో మొదట ఆంధ్రాకు చెందిన ఓ బడా కంపెనీ పేరుతో 2023 అక్టోబర్ 5న 372.32 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు.
నర్సాపూర్ మండలంలో 58, 59 సర్వే నంబర్లలో 546 ఎకరాల భూమిలో 476.30 ఎకరాలు ప్రభుత్వ భూమి 22ఏ లో ఉండగా రికార్డులను తారుమారు చేసి సిరిపురం సత్యనారాయణ ప్రసాద్, జ్యోతి, శరత్ చంద్ర, శీతల్ అనే వ్యక్తులకు 112.21 ఎకరాలు కట్టబెట్టారని చెప్పారు. ఈ అక్రమాలను తమ ప్రభుత్వం అడ్డుకుందని పొంగులేటి వివరించారు. ‘రెండో సారి ఇదే సర్వే నంబర్లలో 195.25 ఎకరాలను 22ఏ నుంచి డిలీట్ చేసి ఓఆర్సీలు ఇచ్చారన్నారు. అయితే కాంగ్రెస్అధికారంలోకి వచ్చాక ఓఆర్సీలు క్యాన్సిల్ చేశామని పేర్కొన్నారు.
రూ.30 వేల కోట్ల సర్కారు భూమి హాంఫట్
రంగారెడ్డి జిల్లాలో గండిపేట మండలం, వట్టినాగులపల్లి గ్రామంలోని శంకర్ హిల్స్ ఏరియాలో ఎకరం రూ.150 కోట్లకు పైగా ధర పలుకుతుంది. ఇక్కడి సర్వే నం. 111 నుంచి 191 వరకు మొత్తం 460 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొందరు 1983లో జీపీఏ ద్వారా లావాదేవీలు జరిపి 3,333 ప్లాట్లు వేసి అమ్మారు. ఇంకొందరు ఎకరాల చొప్పున అమ్ముతున్నారు.
ఈ భూములపై కోర్టు నిషేధాజ్ఞలు ఉన్నాయి. అయితే అప్పటి సీఎం కేసీఆర్ అండదండలో సుమారు రూ.30 వేల కోట్ల విలువ చేసే 226.06 ఎకరాల భూములు చేతులు మారినట్లు మంత్రి ప్రకటించారు. ఇందులో మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఐదు ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఈ అక్రమాల కోసం ఒక్క నెలలోనే ధరణి వెబ్సైట్లో 22ఏ విభాగంలో వందకు పైగా మార్పు లు చేశారని మంత్రి ప్రకటించారు.
సింఫనీ కాలనీ రిజిస్ట్రేషన్లే నిదర్శనం
పటాన్‌చెరు పరిధిలోని సింఫనీ కాలనీ హోమ్స్ భూములను మొత్తం 22-ఏలో చేర్చారని, ఆ భూములను అమ్ముకోకుండా పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే హరీశ్‌రావు, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన ఆరోపణలపై మంత్రి పొంగులేటి స్పష్టత ఇచ్చారు. ‘‘2000-2001లో సర్వే నంబర్లు 354 నుంచి 400 వరకు ఉన్న 55 ఎకరాల పట్టా భూముల్లో సింఫనీ కాలనీ ఏర్పడింది. ఇందులో సుమారు 850 ఇళ్లు ఉన్నాయి. అయితే సర్వే నంబర్లు 373, 386లో బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ కోసం సేకరించిన 4.15 ఎకరాల భూములు మాత్రమే 22-ఏ జాబితాలో ఉన్నాయి.
మిగిలిన సర్వే నంబర్లలోని కాలనీ భూములు లేవు. కాలనీలో రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయని చేసిన ఆరోపణకు కూడా రిజిస్ట్రేషన్ గణాంకాలే ఆధారం. 2026 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మొత్తం 21 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి’’ అని అసెంబ్లీలో ఆధారాలు చూపించారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగస్టు 30న సింఫనీ కాలనీలో పర్యటించగా.. ఆయన పర్యటన కంటే 19 రోజుల ముందు ఆగస్టు 7, 11 తేదీల్లో కూడా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయని అన్నారు.
మామ కోసం హరీశ్ అధికార దుర్వినియోగం
మంత్రిగా ఉన్నప్పుడు హరీశ్ అధికారం దుర్వినియోగం చేస్తూ తన భార్య తండ్రి మాధవరం హన్మంతరావుకు 22ఏ లోని భూమిని పట్టా భూమిగా మార్చినట్టు మంత్రి పొంగులేటి అసెంబ్లీలో ప్రకటించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల వెలికట్టె గ్రామం. సర్వే నంబర్ 271లో 327.09 ఎకరాల ప్రభుత్వ భూమికి బీవోటీ యాక్ట్‌లో భాగంగా పేదలకు పట్టాలిచ్చారు. ఇందులో మాధవరం హన్మంతరావు 271/18, 271/98 సర్వే నంబర్లలో సుమారు వంద కోట్ల విలువ చేసే 6.18 ఎకరాల భూమిని తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు మంత్రి ప్రకటించారు. విలువైన ప్రభుత్వ భూమిని కాజేయడానికి 22ఏ లోని రికార్డులను మార్చినట్టు తెలిపారు.
వట్టినాగుల పల్లిలో ‘పల్లా’ భూ బాగోతం
ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ సర్కారు తొలి దశలో చేసిన సుమారు రూ.2,400 కోట్ల భూ బాగోతాన్ని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఎకరం రూ.వంద కోట్లకు పైగా ధర పలికే రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, వట్టినాగులపల్లి గ్రామంలోని సర్వే నం. 186 నుంచి 189 లలోని 29.27 ఎకరాల భూధాన్ భూములు ఉన్నవి. వీటిలో 24.27ఎకరాల భూమిని పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎం.వాసు, ఎం.వెంకటరాజు పేర్లతో కూడిన కంపెనీకి ధారాదత్తం చేశారు. 22ఏలో ప్రొహిబిటెడ్ లీస్ట్‌లో ఉన్న భూములను పట్టా భూములుగా మార్చడంతో ఈ భూములు అన్యాక్రాంతం అయ్యాయి’ అని మంత్రి వివరించారు.
22-ఏతో రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గలే
రాష్ట్రంలో 22ఏ జాబితాలో లక్షలాది ఎకరాల భూములను చేర్చడం వల్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గి సర్కారు ఆదాయం పడిపోయిందని బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న ప్రచారం అబద్ధమని మంత్రి పొంగులేటి తెలిపారు. ‘‘రాష్ట్రంలో 2025-26లో ఏప్రిల్ నుంచి ఆగస్టు ఐదు నెలల్లో రూ.6,216 కోట్ల ఆదాయం రాగా.. 2026-27లో అదే ఐదు నెలల్లో రూ.7,575 కోట్ల ఇన్‌కమ్ వచ్చింది. అంటే దాదాపు రూ.1,359 కోట్ల ఆదాయం పెరిగింది’’ అని అన్నీ ఆధారాలతో సహా అసెంబ్లీలో వివరించారు.
ఒక రూపాయి జీతం తీసుకుంటున్నా
నేను నిత్యం ప్రజల కోసం పనిచేస్తూ నెలకు ఒక రూపాయి జీతమే తీసుకుంటున్నా.. నన్ను రాజీనామా చేయాలని బీఆర్ఎస్ లీడర్లు కోరుతున్నారు. ప్రభుత్వ సొమ్ము రూ.17 కోట్లు జీతం, ఇతర అలవెన్స్‌లుగా తీసుకొని అసెంబ్లీలో కూడా అడుగుపెట్టని కేసీఆర్ రాజీనామా చేయాలా? నేను చేయాలా? వేల కోట్లు అవినీతి చేసిన వాళ్లు నా రాజీనామా కోరడం సిగ్గుచేటు. పొంగులేటి మనస్సు పాల పొంగు మాదిరిగా సున్నితంగా ఉంటది. గోదావరిలా ఉగ్రరూపం దాల్చితే మీ పార్టీ నామరూపాల్లేకుండా పోతుంది.
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
