హైదరాబాద్, వెలుగు: పుష్కర కాలంగా ఒక్క పులి కూడా లోకల్‌గా లేని కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లోకి పెద్దపులులను తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. మహారాష్ట్ర నుంచి ఆడ పులులను హెలికాప్టర్ల ద్వారా ట్రాన్స్‌లొకేట్ చేసి ఇక్కడ వదిలేందుకు కసరత్తు జరుగుతోంది. పులుల పునఃప్రవేశానికి (టైగర్ రీ-ఇంట్రడక్షన్), వాటి సంఖ్యను స్థిరంగా పెంచేందుకు శాస్త్రీయ అంచనాలు, సమగ్ర ప్రణాళికల అనంతరం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం విడుదల చేసిన ప్రాధాన్యతా జాబితాలో కవ్వాల్ టైగర్ రిజర్వ్‌ను ‘కీలక ప్రాంతం’గా చేర్చడంతో ఈ దిశగా యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే, సహజసిద్ధమైన అటవీ బాటలను పునరుద్ధరించకుండా ట్రాన్స్‌లొకేషన్ చేస్తే సమస్యలు ఉత్పన్నమవుతాయని వన్యప్రాణి నిపుణలు పేర్కొంటున్నారు.
ముందు ప్రణాళిక లేకుండా చేస్తే మానవ– వన్యప్రాణి సంఘర్షణ తప్పదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ ప్రయత్నం వల్ల అటు పులుల ప్రాణాలకే కాదు, ఇటు అటవీ సరిహద్దు గ్రామాల ప్రజల మనుగడకే ప్రమాదకరంగా మారుతుందనే హెచ్చరిస్తున్నారు. అలాగే తమ పునరావాసం, ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని ఆదివాసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
‘ట్రాన్స్‌లొకేషన్’ ఐడియా ఎందుకొచ్చింది..?
కవ్వాల్‌లో లేళ్లు, సాంబార్లు, అడవి పందులు లక్షల్లో ఉన్నాయి. మేతకు కొదవ లేదు. కానీ, 2010 నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల్లో ఇక్కడ ‘రెసిడెంట్ పులులు’ సున్నా అని తేలింది. 2015 నుంచి మహారాష్ట్ర (తడోబా, తిప్పేశ్వర్) నుంచి 15 పులులు కవ్వాల్ సరిహద్దుల్లోకి రాకపోకలు సాగించినా.. అందులో 13 మగ పులులే ఉన్నాయి. కేవలం రెండే ఆడ పులులు వచ్చాయని చెప్తున్నారు. అయితే, మగ పులులు ఎంతటి అడ్డంకులనైనా దాటుకుని వస్తాయి. కానీ ఆడ పులులు పుట్టిన చోటుకు 50 కిలోమీటర్ల పరిధి దాటి అంత సులువుగా రావు. నేషనల్ హైవే-44, హైదరాబాద్–నాగ్‌పూర్ రైల్వే లైన్, ఓపెన్‌కాస్ట్ మైనింగ్, భారీ ప్రాజెక్టుల రణగొణ ధ్వనులను చూసి ఆడ పులులు వెనక్కి మళ్లుతున్నాయి.
ఆడ తోడు లేకపోవడంతో కవ్వాల్‌లో పులుల సంతతి పెరగట్లేదు. సహజంగా ఆడ పులులు రాలేకపోతున్నాయి కనుక.. మహారాష్ట్ర నుంచి ఆడ పులులను కవ్వాల్ కు తీసుకొస్తే సరిపోతుందని ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్తున్న మాట. అయితే, ఈ తరలింపు ప్రక్రియపై ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా.. వారికి వేరే మార్గం లేదు. ఈ తరలింపు ప్రతిపాదనను వైల్డ్‌లైఫ్ ఎక్స్‌ఫర్ట్స్ తప్పుబడుతున్నారు. పులిని కొత్త అడవిలో వదిలేస్తే అక్కడే ఉండదని, వెంటనే తన పాత మకాం వైపు వెళ్లేందుకు లేదా కొత్త ప్రాంతాన్ని అన్వేషిస్తుందని చెప్తున్నారు.
కవ్వాల్ చుట్టూ సురక్షితమైన కారిడార్లు లేవని, ఒక వైపు హైవే, మరోవైపు రైల్వే ట్రాక్, ఓసీలు దీనికితోడు గూడేలు ఉన్నాయంటున్నారు. ఒకవేళ పెద్దపులి ఊళ్లోకు రావడమో, తప్పిపోయి రైళ్లు, వాహనాల కింద పడితే పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. కారిడార్లు సరిచేయకుండా పులులను ఎయిర్‌లిఫ్ట్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు. సహజ మార్గాల్లో పులుల రాకపోకలు, జన్యు మార్పిడి జరగకపోతే.. ఇలా బలవంతంగా తేవడం వల్ల పులులు అంతర్గత సంతానోత్పత్తి సమస్యలతో, స్థానిక ఘర్షణలతో అంతరించిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరో విషయమేమిటంటే.. కవ్వాల్ కోర్ ఏరియాలోనే ఇంకా 37 గ్రామాలు, 67 చిన్న గూడేలు ఉన్నాయి. బఫర్ జోన్‌లో 267 గ్రామాలున్నాయి. పులులకు పూర్తి స్వేచ్ఛగా తిరిగేందుకు మానవ రహిత నిషిద్ధ ప్రాంతం సిద్ధం చేయకుండా కొత్త పులులను తీసుకురావాలనుకోవడం పొరపాటని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, ఈ తరలింపు ఆలోచన స్థానిక ఆదివాసీల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టైగర్ రిజర్వ్ పేరిట తమను అడవి నుంచి వెళ్లగొట్టడం సరికాదని, ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని ఆదివాసీ, గోండు, కొలాం, గిరిజన తెగలు మండిపడుతున్నాయి.
ఈ నిబంధనలు అమలు చేయాల్సిందే
దేశంలో ఎక్కడైనా పులులను ట్రాన్స్‌లొకేట్ చేయాలంటే జాతీయస్థాయిలో 4 కఠిన నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుంది. కవ్వాల్ గ్రౌండ్ రియాలిటీ చూస్తే.. పెద్ద పులుల ఆహారానికి సరిపడా లేళ్లు, సాంబార్లు పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే మానవ అలజడి లేని కోర్ ఏరియా లేదు. కోర్ ఏరియాలోనే ఇంకా 37 గ్రామాలున్నాయి. సురక్షితమైన కారిడార్లు లేవు.
రైల్వే లైన్లు, హైవేలతో కారిడార్లు తెగిపోయాయి. స్థానికుల సహకారం లేదు. వారికి పునరావాసం దక్కక ఆదివాసీలు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, పులుల సంరక్షించాలంటే ఒక్కటే అడవిని, కారిడార్లను దారులను రక్షిస్తే పులులు అవే వస్తాయంటున్నారు. ఎన్‌హెచ్-44, రైల్వే లైన్ల వెంబడి సరైన అండర్‌పాస్‌లు,ఎకో-బ్రిడ్జిలు నిర్మించి కారిడార్లను అనుసంధానించాలని చెప్తున్నారు. ఆదివాసీలకు ఇచ్చిన పునరావాస ప్యాకేజీలు పూర్తిస్థాయిలో ఇచ్చి, వారిని భాగస్వాములను చేయాలని కోరుతున్నారు.
