- ఘనంగా జాతీయ హిందీ దివస్
బషీర్‌బాగ్, వెలుగు: జాతీయ భాష హిందీని ప్రతిఒక్కరూ గౌరవించాలని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణలో తెలుగుతోపాటు హిందీ, ఉర్దూ భాషలు విస్తృతంగా వాడుకలో ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ప్రదేశ్ లింగ్విస్టిక్ మైనారిటీ సెల్, హైదరాబాద్ హిందీ జర్నలిస్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన జాతీయ హిందీ దివస్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఇటీవల మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం జరగడం బాధాకరమన్నారు. మార్వాడీలు కూడా తెలంగాణలో అంతర్భాగమేనని పేర్కొన్నారు. ఇటీవల హిందీ చదివే వారి సంఖ్య తగ్గిపోతోందని, దాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు తెలంగాణ ప్రదేశ్ లింగ్విస్టిక్ మైనారిటీ సెల్ చొరవ తీసుకోవాలని కోరారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ మాట్లాడుతూ.. హిందీ భాష దేశ ప్రజలందరినీ కలుపుతుందని, దాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతరం హిందీ భాష పరిరక్షణకు కృషి చేసిన ఋషభ దేవ్ శర్మకు వినయ్ వీర్ పురస్కారం, దేవ్ కుమార్ పూఖ్రాజ్ కు సదాశివ శర్మ పురస్కారం, మనోహర్ కోశాండర్ కు విద్యారణ్య పురస్కారాన్ని నిర్వాహకులు అందజేశారు. తెలంగాణ ప్రదేశ్ లింగ్విస్టిక్ మైనారిటీ సెల్ చైర్మన్ రాజేశ్ అగర్వాల్, రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, తెలంగాణ యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఖాజా విరహత్ అలీ, హైదరాబాద్ హిందీ జర్నలిస్ట్స్ సొసైటీ అధ్యక్షుడు అజయ్ కుమార్ శుక్లా తదితరులు పాల్గొన్నారు.
