తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రం, కామారం (పీటీ) గ్రామపంచాయతీల సరిహద్దు ఆస్తులపై ఇరువురు సర్పంచుల మధ్య వారం రోజులుగా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్లింది. శనివారం కామారం సర్పంచ్ కొర్నిబెల్లి సావిత్రి హరిత హోటల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాడ్వాయి, కామారం గ్రామపంచాయతీల సరిహద్దు ఆస్తుల విషయంలో రాజకీయాలు చేయొద్దన్నారు.
తమ భూభాగం జోలికి రావద్దని, తాడ్వాయి సర్పంచ్ కొటేం ప్రవళిక పూర్తి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. కల్యాణ మండపం, రైతు వేదిక, పెట్రోల్ పంప్, డంపింగ్ యార్డుకు సంబంధించి గతంలో కామారం గ్రామపంచాయతీ తీర్మానం చేసి అధికారులకు అందించిందని తెలిపారు. ఉపసర్పంచ్ రేగ అనిల్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
