మంగపేట, వెలుగు: ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో రహదారుల దుస్థితిపై యువత వినూత్నంగా నిరసన చేపట్టింది. ‘మన రోడ్డు ఐసీయూలో ఉంది’ అంటూ రోడ్డుపై గుంతలను చూపిస్తూ, వైద్యులు ఆపరేషన్ చేస్తున్నట్లుగా రూపొందించిన భారీ ఫ్లెక్సీతో సుమారు 200 మంది యువకులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బస్టాండ్ నుంచి గంపనిగూడెం వై జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సుమారు గంటపాటు రాస్తారోకో, ధర్నా చేపట్టారు. అకినేపల్లి మల్లారం నుంచి ఏటూరునాగారం వరకు ప్రధాన రహదారిపై ఇసుక లారీల రాకపోకలతో గుంతలమయమై ప్రమాదకరంగా మారిందని యువత ఆవేదన వ్యక్తం చేసింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని, భారీ వాహనాల రాకపోకలు, రోడ్లపైనే లారీల నిలిపివేతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
రహదారుల దుస్థితిపై ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు. ధర్నాతో బూర్గంపాడు–ఏటూరునాగారం రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో యువత ప్రతినిధులు అక్షిత్, సాయిరాం, నరేందర్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
