ఇండోనేషియా జావా సముద్రంలో నౌక గల్లంతైంది. నౌకలో 240 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్స్ నుంచి బోర్నియో ద్వీపంలోని దక్షిణ కాలిమంటన్‌కు ప్రయాణిస్తున్న సుమారు 240 మంది ప్రయాణికుల ఓడతో జావా సముద్రంలో సంబంధాలు తెగిపోయాయి.
ఆ ఓడను.. అందులోని ప్రయాణికులను గుర్తించేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అకస్మాత్తుగా సంబంధాలు తెగిపోవడంతో ఈ ఘటనపై అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ప్రతికూల వాతావరణం కారణంగా ఓడ సంబంధాలు కోల్పోయింది.
వర్గో ట్రాన్స్‌పోర్ట్ 8 పేరుతో నడుస్తున్న ఈ ప్రయాణీకుల నౌక, ఇండోనేషియాలోని రెండవ అతిపెద్ద నగరమైన సురబయ నుంచి దక్షిణ కాలిమంటన్ రాజధాని అయిన బంజర్‌మాసిన్ వైపు ప్రయాణిస్తోంది. ప్రయాణ సమయంలో ఆ నౌకలో సమాచార లోపం తలెత్తినట్లు తమకు సమాచారం అందిందని బంజర్‌మాసిన్ శోధన, రక్షణ కార్యాలయం తెలిపింది. ఆ నౌక చివరిగా బంజర్‌మాసిన్‌లోని ఒక రేవు నుంచి సుమారు 148 కిలోమీటర్ల దూరంలో జావా సముద్రంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఆ నౌక స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10:13 గంటలకు సురబయ నుంచి బయలుదేరింది. ప్రతికూల వాతావరణం కారణంగా సంబంధాలు తెగిపోయిన ఈ ఇండోనేషియా నౌకలో ఒకరు మృతి చెందగా, 102 మందిని రక్షించారు. రెస్క్యూ ఆపరేషన్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
