ముంబై: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలో ఉన్న 21 రాష్ట్రాల్లో 2029 నాటికి యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ని అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆదివారం ముంబైలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మతంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, ఆస్తి వారసత్వం, దత్తత వంటి అంశాల్లో అందరికీ సమానమైన ఉమ్మడి పౌర నియమావళిని తీసుకురావడమే యూసీసీ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో దీనిని ప్రవేశపెట్టామని, మిగిలిన ఎన్డీయే పాలిత రాష్ట్రాలన్నింటిలోనూ వచ్చే ఎన్నికల నాటికి పూర్తిస్థాయిలో అమలుచేస్తామని చెప్పారు. 2014కు ముందు దేశంలో అవినీతి, కుటుంబ పాలన సాగేవని, మోదీ ప్రభుత్వం వచ్చాక పనితీరు ఆధారిత రాజకీయాలు ప్రారంభమయ్యాయన్నారు.
