- సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాల్సిందే
- ట్యాంక్‌బండ్‌పై ఆపరేషన్ పోలో అమరులకు నివాళి
హైదరాబాద్, వెలుగు: సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ దృఢ సంకల్పం, అమరవీరుల ఆత్మబలిదానాలతోనే హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. వారి త్యాగాల ఫలితంగానే ప్రస్తుతం మనం భారత యూనియన్‌లో అంతర్భాగమై స్వేచ్ఛగా జీవిస్తున్నామని తెలిపారు. ఆపరేషన్ పోలో ప్రారంభ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విమోచన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ట్యాంక్‌బండ్‌పైనున్న యుద్ధ ట్యాంక్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు.
అనంతరం పలువురు మాజీ సైనికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. ట్యాంక్‌బండ్‌పై ఉన్న చారిత్రక యుద్ధ ట్యాంక్ తెలంగాణ ప్రజల పోరాట పటిమకు నిరంతర స్ఫూర్తి కేంద్రమని చెప్పారు. దేశ సమగ్రతను దెబ్బతీసే విద్రోహ శక్తులను అణచివేసేందుకు 1948 సెప్టెంబర్ 13న పటేల్ ఆపరేషన్ పోలోకు శ్రీకారం చుట్టారనీ, నాలుగు రోజుల పాటు సాగిన పోరులో ఎందరో సైనికులు ప్రాణాలర్పించి హైదరాబాద్‌కు స్వేచ్ఛను ప్రసాదించారని గుర్తు చేశారు.
పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ విమోచన పోరాటాన్ని చేర్చాలి
సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలందరికీ అత్యంత పవిత్రమైన విమోచన దినోత్సవమని, దానిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ దశాబ్దాలుగా పోరాడుతోందని రాంచందర్ రావు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా జరుపుతామని చెప్పి, మజ్లిస్ పార్టీకి భయపడి వెనకడుగు వేసిందని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు కూడా గాంధీ భవన్‌లో పార్టీ కార్యక్రమంగా సరిపెడుతోందే తప్ప, అధికారికంగా నిర్వహించకుండా ప్రజాపాలన పేరిట అసలు చరిత్రను మరుగున పరిచే కుట్ర చేస్తోందని విమర్శించారు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే అమరవీరుల త్యాగాలను విస్మరించడం క్షమించరాని నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ పుస్తకాల్లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన పోరాట చరిత్రను సమగ్రంగా పొందుపరచాలని డిమాండ్ చేశారు.
పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి: బూర నర్సయ్య గౌడ్
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర విమోచన ఉత్సవ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. తరతరాలుగా మరుగునపడిన తెలంగాణ విమోచన వీరగాథలను, అమర యోధుల త్యాగాలను వెలికితీసి భావితరాలకు అందించడమే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కంటే తెలంగాణ విమోచన స్ఫూర్తి ఎంతో గొప్పదని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా పండుగలా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కె. లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పాల్గొన్నారు.
