- భారీ డీజేలు, స్పెషల్ లైటింగ్, క్రాకర్స్, డాన్సర్లతో హడావుడి
- నిమజ్జనంతో సమానంగా వినాయక విగ్రహ
- స్వాగతాలకు ప్రయార్టీ రీల్స్ చేస్తూ
- సోషల్ మీడియాలో ప్రచారం
వరంగల్, వెలుగు: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో ‘ఆగమన్’ ఇప్పుడు నయా ట్రెండ్‌గా మారింది. నిన్నమొన్నటి వరకు భక్తులు గణనాథులను మండపాల్లో ప్రతిష్ఠించి, తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, అనంతరం ఘనంగా నిమజ్జనం చేయడం ఆనవాయితీగా ఉండేది. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ‘ఆగమన్’ (ఆగమనం) పేరుతో దూర ప్రాంతాల నుంచి కాలనీల్లోని మండపాల వద్దకు వినాయక విగ్రహాలను తీసుకొచ్చే క్రమంలోనే భారీగా స్వాగత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో నిమజ్జనం హడావుడి కంటే ఆగమన్ హంగామానే ఎక్కువగా కనిపిస్తోంది.
బడా గణేశ్ తరహాలో జిల్లాల్లోనూ..
ముంబై వంటి నగరాల్లో కనిపించే ‘ఆగమన్’ సంస్కృతి ఇప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చేరింది. ఖైరతాబాద్ బడా గణేశ్‌ను మండపానికి తీసుకొచ్చే సమయంలో కమిటీ సభ్యులు ఆగమన్ కార్యక్రమం నిర్వహిస్తూ మహాగణపతికి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. డప్పుచప్పుళ్లు, మంగళహారతులతో ఎదురెళ్లి సంప్రదాయ పద్ధతిలో గణనాథుడిని ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రెండ్ హైదరాబాద్ దాటి జిల్లా కేంద్రాలు, మండలాలకూ విస్తరిస్తోంది. గ్రేటర్ వరంగల్‌లోనూ వినాయక చవితి ఉత్సవాల కోసం భారీ విగ్రహాలను హైదరాబాద్ నుంచే కొనుగోలు చేస్తున్నారు. 20 – 40, 50 ఫీట్ల ఎత్తు వరకు ఉండే విగ్రహాలను వరంగల్ సిటీకి తరలించే క్రమంలో ‘ఆగమన్’ కార్యక్రమాలు ఏర్పాటు చేసి, తమ ప్రాంత వినాయకుడికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేలా నిర్వాహకులు చూస్తున్నారు.
లక్షల్లో ఖర్చు, సోషల్ మీడియాలో ప్రచారం
నవరాత్రి ఉత్సవాలు ఒకరిని మించి మరొకరు గ్రాండ్‌గా నిర్వహించేందుకు యూత్ పోటీ పడుతోంది. కమిటీ నిర్వాహకులు, కాలనీ పెద్దలు ఇందుకోసం లక్షల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పలుచోట్ల ఒక్కో ఆగమన్ కార్యక్రమం కోసం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనంతటిని స్థానికంగా అందుబాటులో యూత్ ప్రెస్టెజ్‍గా తీసుకుంటోంది.
తమ ప్రాంత వినాయకుడి ఆగమన్ కార్యక్రమం ఏరోజు ఉంటుంది, ఎక్కడనుంచి ప్రారంభమవుతుంది, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. స్పెషల్ ఏంటనే అంశంలో రీల్స్ చేసి ముందస్తు ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సెలబ్రెటీలను ముఖ్య అతిథులుగా పిలిచి ఆగమన్ కార్యక్రమాన్ని ప్రారంభించేలా చూడటం ద్వారా మరింత ప్రచారం తీసుకొచ్చేలా చూస్తున్నారు. ఇదిలా ఉండగా, వినాయక చవితి సందర్భంగా స్వామివారి తొలిపూజకు అవసరమయ్యే పూజా సామగ్రి దుకాణాలు ఫుల్ గిరాకీ కళకళలాడుతున్నాయి.
భారీ డీజేలు, లైటింగ్‌తో ఫుల్ జోష్..
గణనాథుడి ఆగమన్ కార్యక్రమంలో విగ్రహాన్ని తరలించే వాహనాలకు భారీ సినిమా సెట్టింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. కళ్లు చెదిరే లైటింగ్, రెండు, మూడు కిలోమీటర్ల దూరం వరకు డబ్‌డబ్‌మనేలా హైబాస్ సౌండ్ వినిపించే డీజేలను ఏర్పాటు చేస్తున్నారు. పిక్సాబే, కుందన్ వంటి వూఫర్లతో కూడిన సౌండ్ సిస్టమ్‌లను వినియోగిస్తున్నారు. ఆకాశంలో జిగేల్‌మనేలా తారాజువ్వల వెలుగులతో సందడి చేస్తున్నారు. పలుచోట్ల ఆర్కెస్ట్రా బృందాలను ఏర్పాటు చేసి, డ్యాన్స్ టీమ్‌లతో ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు.
దారిపొడవునా వీటిని తిలకించే వారిలో జోష్ నింపుతున్నారు. రూరల్ ప్రాంతాల నుంచి 40 – 50 మంది సభ్యులతో నాట్య బృందాలను తీసుకొచ్చి డప్పు వాయిద్యాలతో హోరెత్తిస్తున్నారు. మరికొన్ని చోట్ల సంప్రదాయ కేరళ డప్పు కళాకారులను తీసుకొస్తున్నారు. ఆగమన్ కార్యక్రమం చివర్లో మహిళలు మంగళహారతులతో గణనాథుడికి గ్రాండ్‌గా స్వాగతం పలుకుతున్నారు.
