- రూ.33 వేల కోట్ల భూములను ఎందుకు వెనక్కి తీస్కోలే?
- ధరణిలో 23 లక్షల ఎకరాల స్వాహా నిజమైతే రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలె
- భూబాగోతంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
- బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో గత ఐదు రోజులుగా నడిచింది ప్రజాస్వామ్య సభ కాదని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ఆడిన కుమ్మక్కు నాటకమని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్అయ్యారు. ప్రజాసమస్యలపై నిలదీస్తున్న బీజేపీ గొంతు నొక్కేందుకు ప్రభుత్వం మైకులు కట్ చేయిస్తూ అసెంబ్లీని తప్పుదోవ పట్టించిందన్నారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. మొదటి మూడు రోజులు ఇరు పార్టీలు పరస్పరం దూషించుకుంటూ సభా సమయాన్ని వృథా చేశాయన్నారు. 22ఏ నిషేధిత జాబితాపై చర్చ పేరిట మంత్రి పొంగులేటి 4 గంటల పాటు అవగాహనా రాహిత్యంతో మాట్లాడారే తప్ప, 50 లక్షల మంది రైతులకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు.
గత బీఆర్ఎస్ పాలనలో ధరణి పోర్టల్ ద్వారా 13 వేల లావాదేవీల్లో దాదాపు 23 లక్షల ఎకరాల ఆస్తులు అన్యాక్రాంతమైనట్లు ఫోరెన్సిక్ ఆడిట్‌లో తేలిందని స్వయంగా మంత్రులే ఒప్పుకున్నారని ఏలేటి గుర్తుచేశారు. ఇంత భారీ స్కాం జరిగిందని తెలిసి కూడా ఆ అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, భూములను ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని నిలదీశారు. ‘రిజిస్ట్రేషన్ అనేది టైటిల్ డీడ్ కాదు.. తప్పుడు రిజిస్ట్రేషన్లను రద్దు చేసే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉంది. మరి ఎందుకు తాత్సారం చేస్తున్నారు? గతంలో వేసిన సిట్ కాదని.. ఇప్పుడు కొత్తగా వేసిన సెట్ కేవలం సెట్టింగులు చేసుకోవడానికేనా?’ అని ఫైర్ అయ్యారు. ఈ మొత్తం భూదోపిడీపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఫోర్త్ సిటీ పేరిట కొత్త దందా
ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ ముసుగులో హైదరాబాద్ పరిసరాల్లోని వేలాది ఎకరాల అసైన్డ్ భూములను కారుచౌకగా కొట్టేసేందుకు సరికొత్త దందాకు తెరలేపారని ఆరోపించారు. కుత్బుల్లాపూర్ పరిధిలోని ఐడీపీఎల్‌కు చెందిన 333 ఎకరాల విలువైన భూమి ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిందని, దాదాపు రూ.33 వేల కోట్ల విలువైన ఈ భూములను ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని నిలదీశారు. దీనిలో ప్రభుత్వ పెద్దలకు 30 శాతం వాటాలు ఉన్నాయా అని ప్రశ్నించిన ఆయన, అక్రమాలకు పాల్పడిన అధికారులపై పీడీ యాక్ట్ ఎందుకు పెట్టలేదని, కనీసం సస్పెండ్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రులు అక్రమ మైనింగ్ వ్యవహారాలు నడపడం, ప్రభుత్వంలో ఉంటూనే రూ.1,400 కోట్ల కాంట్రాక్టులను రివైజ్డ్ ఎస్టిమేషన్ల పేరిట రూ.4వేల కోట్లకు పెంచుకోవడం ముమ్మాటికీ ‘క్విడ్-ప్రో-కో’ కాదా అని మండిపడ్డారు.
రాహుల్ ఇంటి ముందుధర్నా చేస్తం
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల భూదోపిడీ నాటకాన్ని ఆధారాలతో సహా ప్రజల ముందు పెడతామని ఏలేటి హెచ్చరించారు. తమ వద్ద 200లకు పైగా పక్కా ఆధారాలతో కూడిన కేసు స్టడీలు ఉన్నాయని తెలిపారు. ఈ అక్రమాలపై గవర్నర్‌ను, కేంద్ర దర్యాప్తు సంస్థలను కలుస్తామని, త్వరలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసం ముందే ధర్నా చేపడతామన్నారు.
