న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రాత్రి ఏర్పాటు చేసిన విందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాహెద్ బిన్ మొహమ్మద్‌తో సహా పలువురు బ్రిక్స్ దేశాల అగ్రనేతలు గైర్హాజరయ్యారు. ఆ రోజంతా కీలకమైన దౌత్యపరమైన కార్యక్రమాలతో తీరిక లేకుండా బిజీగా గడిపారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ బ్రిక్స్ సదస్సుతో పాటు ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు.
సుదీర్ఘ ప్రయాణం తర్వాత విమానం దిగి నేరుగా కార్యక్రమాలకు హాజరైన చైనా అధ్యక్షుడు టైమ్ జోన్ మార్పు వల్ల తీవ్రంగా అలసిపోవడంతో విందుకు రాలేకపోయినట్టు ఈ విషయంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. అయితే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు బ్రిక్స్ కూటమికి చెందిన ఇతర నాయకులు ఈ విందుకు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్, శివరాజ్ సింగ్ చౌహాన్ అటెండ్ అయ్యారు. అలాగే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, సీఎంలు యోగి ఆదిత్యనాథ్ (యూపీ), దేవేంద్ర ఫడ్నవీస్ (మహారాష్ట్ర), సువేందు అధికారి (పశ్చిమ బెంగాల్), హిమంత బిశ్వ శర్మ (అస్సాం) కూడా హాజరయ్యారు.
