- నాగోల్‌లో 72 అడుగుల ఏకో ఫ్రెండ్లీ గణేశ్
- గౌలిపురా కా రాజా రూపంపై సస్పెన్స్
- నేడు రివీల్ చేయనున్న నిర్వాహకులు
- వనస్థలిపురంలో వినాయకుడి సైజు 42 అడుగులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: వినాయక చవితి సందర్భంగా నగర వ్యాప్తంగా వివిధ రూపాల్లో గణనాథులు కొలువుదీరనున్నాయి. ఖైరతాబాద్, బాలపూర్, నాగోల్, గౌలిపుర లాంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న భారీ గణనాథులకు ప్రత్యేకత ఉంది.
బాలాపూర్ లో లడ్డూ ప్రత్యేకం కాగా, ఖైరతాబాద్ లో బడా గణేశుడి దర్శనం కోసం ప్రజలు బారులు తీరనున్నారు. గౌలిపురాలో ఎప్పుడూ ప్రత్యేక కాన్సెప్ట్ తో గణేశ్ మండపాన్ని డిజైన్ చేస్తుంటారు. నాగోల్ లో 72 అడుగుల ఎత్తయిన ఏకో ఫ్రెండ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా.. సోమవారం నుంచి ప్రజలకు దర్శనం కల్పించనున్నారు.
నాగోల్‌లో ఎలా తయారు చేశారంటే..
భారీ విగ్రహం నిర్మాణంలో తొలుత బలమైన స్టీల్ ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం 25 టన్నులకు పైగా స్టీల్‌ను వినియోగించారు. స్టీల్ మెష్‌పై యాదాద్రి జిల్లా నుంచి తెచ్చిన 70కి పైగా కట్టల ఎండిన వరి గడ్డిని అమర్చి.. దానిపై మట్టి, ఇసుక మిశ్రమాన్ని పూస్తూ గణేశుడి శరీరానికి ఆకృతి తీసుకొచ్చారు. దీంతో విగ్రహం భారీగా ఉన్నప్పటికీ నిర్మాణపరంగా పటిష్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా సమీపంలోని బనాస్ నది ప్రాంతం నుంచి సుమారు 30 టన్నుల సహజ నది మట్టిని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. దీనికి హైదరాబాద్‌లో లభించే సుమారు 20 టన్నుల ఇసుకను కలిపి విగ్రహానికి పూతగా ఉపయోగించారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కు దూరంగా ఉండటంతో పాటు నీటి ఆధారిత, సేంద్రియ రంగులతో విగ్రహానికి తుది మెరుగులు దిద్దారు.
ఈ మహా విగ్రహం రూపకల్పన, నిర్మాణంలో 150 మందికి పైగా కళాకారులు, కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు ప్రాంతాలకు చెందిన కళాకారులు ఇందులో భాగమయ్యారు. చివరి దశలో 25 మందికి పైగా పెయింటర్లు మూడు రోజులపాటు పనిచేసి విగ్రహానికి రంగులు, అలంకరణలు పూర్తి చేశారు.
గౌలిపుర గణేశ్ రూపం చివరి వరకు సీక్రెట్‌గా..
గౌలిపుర గణేశ్ మండపంలో (గౌలిపుర కా రాజా) ప్రతి ఏటా ఒక సరికొత్త , ప్రత్యేకమైన రూపంలో వినాయకుడిని ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో ఇక్కడ అమరనాథ్ యాత్ర, తిరుపతి వేంకటేశ్వరుడు, ఆర్మీ థీమ్‌లతో కూడిన ‘ఆపరేషన్ సిందూర్’ వంటి వినూత్న రూపాల్లో దర్శనమిచ్చారు.
గౌలిపుర నిర్వాహకులు ప్రతి ఏటా వినాయక చవితి పందిరి అలంకరణను విగ్రహ పూర్తి రూపాన్ని చవితి మొదటి రోజు వరకూ చాలా రహస్యంగా ఉంచుతారు. మండపానికి వచ్చే భక్తులకు నేరుగా ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికే ఇలా చేస్తుంటారు.
బాలాపూర్ లడ్డూ ప్రత్యేకం
హైదరాబాద్ గణేశ్ ఉత్సవాల్లో బాలాపూర్ వినాయకుడికి ప్రత్యేక స్థానం ఉంది. భారీ విగ్రహంతో పాటు ఇక్కడ జరిగే లడ్డూ వేలంపాట ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దాదాపు 16 అడుగుల ఎత్తుతో పాటు ఏటా వివిధ రకాల ఆలయాల నమూనాలతో బాలపూర్ గణేశ్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. బాలాపూర్ లో ఈ సారి పూరి జగన్నాథ ఆలయం సెట్ వేస్తున్నారు.
అమీర్‌పేట్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్ లో ప్రధాన కూడళ్లలో కూడా స్థానిక అసోసియేషన్ల ఆధ్వర్యంలో 20 నుంచి -30 అడుగుల భారీ విగ్రహాలను కొలువుదీరనున్నాయి.
వనస్థలిపురంలో 42 అడుగుల మట్టి వినాయకుడు..
వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీ బస్టాప్ సమీపంలో ప్రతిష్టించే వినాయకుడు ఈ ప్రాంతంలోనే అత్యంత భారీ విగ్రహంగా నిలుస్తుంది. ఇక్కడ దాదాపు 40 అడుగుల ఎత్తు కలిగిన పర్యావరణ హితమైన మట్టి గణపతిని (ఎకో ప్రెండ్లీ గణేశ్ ) ఏర్పాటు చేస్తారు. పర్యావరణాన్ని రక్షించే ఉద్దేశంతో ఈ భారీ విగ్రహాన్ని చెరువుల్లో కాకుండా, ఫైర్ ఇంజన్ వాటర్ ట్యాంకర్ల సహాయంతో మండపం వద్దే నిమజ్జనం (కరిగించడం) చేయడం ఇక్కడి ప్రత్యేకత.
నాగోల్ లో 72 అడుగుల ఎకో ప్రెండ్లీ వినాయకుడు..
నాగోల్ లోని ఎక్స్ రోడ్డు వద్ద తిరంగా యూత్ అసోసయేషన్ యూత్ ఆధ్వర్యంలో 72 అడుగుల మట్టి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ సారి ఏకో ప్రెండ్లీ వినాయకుడిని రూపొందించారు. ఎలాంటి పొల్యూషన్ లేకుండా పర్యావరణహిత వినాయకుడిని పెట్టి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
69 అడుగులతో ఖైరతాబాద్ బడా గణేశ్..
నగరంలో ఖైరతాబాద్ బడా గణేశ్ ఈసారి మరోసారి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు. 69 అడుగుల ఎత్తులో ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ రూపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఐదు ముఖాలు, ఆరు చేతులతో రూపొందించిన ఈ భారీ విగ్రహం పూర్తిగా పర్యావరణహిత పదార్థాలతో తయారైంది. సుమారు 30 టన్నుల సహజ నది మట్టి, 20 టన్నుల ఇసుక, 25 టన్నులకు పైగా స్టీల్, 70 బండిళ్ల ఎండిన వరి గడ్డి వినియోగించారు.
విగ్రహం పక్కన 15 అడుగుల సోమనాథ్ జ్యోతిర్లింగం, మరోవైపు కాళికామాత ప్రతిరూపాన్ని ఏర్పాటు చేశారు. జూన్ 25న కర్రపూజతో విగ్రహ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టగా.. 80 రోజులపాటు శిల్పులు, కళాకారులు రేయింబవళ్లు శ్రమించారు.
