- మనం అడిగితే కొర్రీలు.. ఏపీ కోరితే మోకరిల్లుడు
- ఫేజ్1లో మనవైపు 14 టెలిమెట్రీలు, ఏపీ వైపు నాలుగే
- కామన్ ప్రాజెక్టులు తమకు అప్పగించే వరకు
- టెలిమెట్రీలు పెట్టేది లేదన్న కృష్ణా బోర్డు
- సుప్రీంకోర్టు కేసు సాకుతో కాలయాపన
- పోతిరెడ్డిపాడు, సాగర్ కుడికాల్వ వద్ద పెట్టేందుకు నో
- టెలిమెట్రీలకు మనమిచ్చిన రూ.4.15 కోట్లు
- సొంతానికి వాడేసుకున్న కృష్ణా బోర్డు
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాలను అడ్డగోలుగా దోచేస్తున్న ఏపీని కట్టడి చేయాల్సిన కృష్ణా బోర్డు.. ఏపీ తానా అంటే తందాన.. చెప్పిందే వేదం అన్న చందాన వ్యవహరిస్తున్నది. లెక్కాపత్రం అన్నదే లేకుండా పొరుగు రాష్ట్రం నీటిని తరలించుకుపోతున్నా అడ్డుకోకుండా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నది. ఏపీ ఎక్కడి నుంచి ఎన్ని నీళ్లు తీసుకుపోతున్నదో తేల్చేందుకు టెలిమెట్రీలను ఏర్పాటు చేయాలని మన ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా.. కృష్ణా బోర్డు చెవికెక్కించుకోవడం లేదు.
మనవైపు ఇప్పటికే తొలిదశలో టెలిమెట్రీలు పెట్టేసిన బోర్డు.. రెండో ఫేజ్‌లో మూడేండ్ల క్రితమే ఏపీ వైపున్న ఔట్ లెట్ల వద్ద ఏర్పాటు చేయాల్సి ఉన్నా నిబంధనల పేరుతో డైవర్ట్ చేస్తున్నది. అంతేకాదు, టెలిమెట్రీల కోసం మనం విడుదల చేసిన సొమ్మును సొంత ఖర్చులకు వాడేసుకుని.. ఏపీని పల్లెత్తు మాట అనకుండా మళ్లీ మనల్ని నిధులు అడుగుతున్నది.
ఇటీవల సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) సమక్షంలో జరిగిన సమావేశంలోనూ టెలిమెట్రీలపై కృష్ణా బోర్డు వితండ వాదనలకు దిగింది. కామన్ ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను అప్పగిస్తేనే రెండోదశ టెలిమెట్రీలను పెడతామని, అప్పటిదాకా పెట్టబోమంటూ మొండికేసింది. ఇక్కడే మన ప్రభుత్వం బోర్డు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. తొలిదశలో తెలంగాణ వైపు టెలిమెట్రీలు పెట్టినప్పుడు అడ్డురాని జురిస్డిక్షన్.. ఇప్పుడు ఏపీ వైపు పెట్టండి అనగానే ఎందుకు అడ్డువస్తున్నదంటూ ప్రభుత్వం, అధికారులు బోర్డు తీరుపై మండిపడుతున్నారు.
సుప్రీంకోర్టు కేసులతో కాలయాపన..
రెండో ఫేజ్‌లో ఏడేండ్ల క్రితమే ఏపీలోని కీలకమైన ఔట్ లెట్లలో టెలిమెట్రీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, తెలంగాణ అడిగిన ప్రతిసారీ కృష్ణా బోర్డు అడ్డమైన వాదనలకు దిగుతూ తప్పించుకుంటున్నది. సుప్రీంకోర్టులో ప్రాజెక్టుల పరిధిపై ఉన్న కేసును సాకుగా చూపించి తప్పించుకు తిరుగుతున్నది. వాస్తవానికి విభజన సమయంలోనే సాగర్ ప్రాజెక్టును తెలంగాణ, శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ నిర్వహించేలా ఒప్పందం ఉంది.
కానీ, అది కాదని ఏపీ సాగర్ ప్రాజెక్టు కుడివైపు సగం భాగాన్ని ఆక్రమించేసి గుప్పిట్లో పెట్టుకుంది. దీనిపై ఏపీని ప్రశ్నించాల్సిన బోర్డు... కనీసం ప్రశ్నించడం లేదు. అదిసరే.. కనీసం రెండో దశలో 9 చోట్ల టెలిమెట్రీలు పెట్టాల్సి ఉండగా.. ఏపీవైపే 7 చోట్ల పెట్టాల్సి ఉంది. ఆయా చోట్ల సైడ్ లుకింగ్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్ అనే అత్యాధునిక వాటర్ రీడింగ్ పరికరాలను పెట్టాలని నిర్ణయించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ 3వ కిలోమీటర్ వద్ద), నాగార్జునసాగర్ కుడి కాలువ, నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ 21వ మెయిన్ బ్రాంచ్ (ఏపీకి వెళ్లే సరిహద్దు వద్ద), కేసీ కెనాల్ ఆఫ్ టేక్ (సుంకేసుల బ్యారేజీ వద్ద), ప్రకాశం బ్యారేజీ పశ్చిమ ప్రధాన కాలువ, ప్రకాశం బ్యారేజీ తూర్పు ప్రధాన కాలువ, పోలవరం కాలువ లింకింగ్ ప్రాంతాల్లో పెట్టాలనుకున్నారు. కానీ, ఏపీ మాత్రం అడుగడుగునా అడ్డుపడుతూనే ఉంది. ఇటు కృష్ణా బోర్డు కూడా ఏపీ ఏం చెబితే అదే వింటం.. అదే చేస్తం అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. ప్రాజెక్టుల జురిస్డిక్షన్‌ను కోర్టు తేల్చే వరకు టెలిమెట్రీలు పెట్టేది లేదంటూ తేల్చి చెబుతున్నది.
పైసలు వాడుకుని..
2018 అక్టోబర్ 10న టెలిమెట్రీల ఏర్పాటుకు బోర్డు నిర్ణయించింది. తెలంగాణలోని రెండు ప్రాంతాలు, ఏపీలోని 7 ప్రాంతాలు సహా 9 ప్రాంతాల్లో టెలిమెట్రీల ఏర్పాటుకు రూ.7.50 కోట్లు ఖర్చవుతాయని పేర్కొన్న బోర్డు.. రూ.7.25 కోట్లకు శాంక్షన్ కూడా ఇచ్చింది. ఏపీ ఎప్పటికప్పుడు అడ్డుపడడం, పైసా కూడా విడుదల చేయకపోవడం వంటి కారణాలతో టెలిమెట్రీల ఏర్పాటు వాయిదా పడుతూ వస్తున్నది. అయితే, తెలంగాణ ప్రభుత్వం 2025 మార్చి 13న రూ.4.15 కోట్లను విడుదల చేసింది. ఏపీ కూడా మ్యాచింగ్ షేర్ ఇవ్వాలని కోరింది. కానీ, ఏపీ మాత్రం స్పందించడం లేదు.
నిధుల విషయంపై బోర్డు ఏపీని అడగకుండా.. తెలంగాణ ఇచ్చిన రూ.4.15 కోట్లను బోర్డు అవసరాలు, జీతాల ఖర్చులకు వాడేసుకున్నది. టెలిమెట్రీలు పెట్టనప్పుడు ఆ డబ్బులెందుకు వాడుకున్నారని బోర్డును తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఏపీ వైపు కాలయాపన చేస్తున్న కృష్ణా బోర్డు.. తొలిదశలో మనవైపు మాత్రం ఆలస్యం చేయకుండా టెలిమెట్రీలు పెట్టేసింది. మన దగ్గర 14 చోట్ల ఏర్పాటు చేసి.. ఏపీలో కేవలం 4 చోట్ల మాత్రమే పెట్టేసి మమ అనిపించింది. ఫేజ్1లో భాగంగా 18 చోట్ల టెలిమెట్రీలను ఏర్పాటు చేశారు. అంతేకాదు.. ఏడాది క్రితం నిర్వహించిన బోర్డు మీటింగ్‌లో ఫేజ్ 3లో భాగంగా బనకచర్ల కాంప్లెక్స్‌లోని తెలుగు గంగ ప్రాజెక్టు, ఎస్కేప్ రెగ్యులేటర్, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్, గాలేరు నగరి, ముచ్చుమర్రి, మల్యాల లిఫ్ట్ సహా 11 చోట్ల టెలిమెట్రీలను ఏర్పాటు చేయాలని కృష్ణా బోర్డును తెలంగాణ డిమాండ్ చేసింది.
కానీ, ఫేజ్2కే ఒప్పుకోని పొరుగు రాష్ట్రం.. ఫేజ్3కి కూడా ససేమిరా అనేసింది. అంటే, తెలంగాణ వాడుకునే ప్రతి నీటి బొట్టునూ కొలిచేలా నిఘా పెట్టిన బోర్డు.. ఏపీ వేలాది క్యూసెక్కుల నీటిని అక్రమంగా తరలించే ప్రధాన ఔట్‌లెట్లను మాత్రం గాలికొదిలేయడం గమనార్హం.
కచ్చితంగా పెట్టాల్సిందే..
కృష్ణా బోర్డు తీరుపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. టెలిమెట్రీల విషయంలో ఏపీకొక న్యాయం.. తమకొక న్యాయమన్నట్టుగా వ్యవహరించడమేంటని నిలదీస్తున్నది. ఫేజ్2లో పెట్టాల్సిన చోట్ల టెలిమెట్రీలను పెట్టడంతో పాటు.. ఫేజ్3లోనూ ఏర్పాటు చేయాల్సిందేనని నిలదీస్తున్నది. ఏపీ ప్రభుత్వం డ్రై కెనాల్స్ ఇచ్చేలా కేంద్రం, కృష్ణా బోర్డు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నది. టెలిమెట్రీలు ఏర్పాటు చేసేదాకా ఏపీ పోతిరెడ్డిపాడు దగ్గర తీసుకుంటున్న రీడింగులను పరిగణనలోకి తీసుకోవద్దంటూ స్పష్టం చేస్తున్నది.
రీడింగుల్లో చేతివాటం..
తొలి దశలో భాగంగా ఏపీలో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్‌లోని 12.265 కిలోమీటర్ వద్ద టెలిమెట్రీ ఏర్పాటు చేశారు. దాంతో పాటు సాగర్ కుడికాల్వకు 0.44 కిలోమీటర్ దూరాన, శ్రీశైలం రిజర్వాయర్ 17/18 బ్లాక్, హంద్రీ నీవా సుజల స్రవంతి లిఫ్ట్1 దగ్గర ఏర్పాటు చేశారు. అయితే, ఇప్పుడు అటువైపు టెలిమెట్రీలు పాడయ్యాయి. ముఖ్యంగా పోతిరెడ్డిపాడు ఎస్‌ఆర్‌ఎంసీ వద్ద ఏర్పాటు చేసిన టెలిమెట్రీ పనిచేయడం లేదు.
దీంతో రోజూ మాన్యువల్‌గా మన అధికారులు, ఏపీ అధికారులు ఉదయం 11.30 గంటలు, సాయంత్రం 5.30 గంటలకు వెళ్లి రెండుసార్లు రీడింగ్ తీసుకుంటున్నారు. అప్పటివరకు అంతా మంచిగానే సాగుతున్నా.. ఆ తర్వాత మాత్రం ఏపీ తొండికి పాల్పడుతున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రిపూట దొంగతనంగా వేలాది క్యూసెక్కుల నీళ్లను మళ్లించుకుంటున్నదన్న ఆరోపణలున్నాయి. కానీ, ఎప్పుడూ ఏపీపై మాత్రం నిఘా లేదు. అలాగే, ఇప్పుడున్న టెలిమెట్రీల నిర్వహణనూ తెలంగాణపైకి నెట్టేందుకు కృష్ణా బోర్డు ప్రయత్నిస్తుండడం విమర్శలకు తావిస్తున్నది. పాడైపోయిన వాటిని ఏపీతో రిపేర్ చేయించకుండా తెలంగాణను మాత్రం నిర్వహణ చేయమనడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
