- 32 బంతుల్లో 82 పరుగులతో చెలరేగిన అభిషేక్ శర్మ
- ఇషాన్‌తో కలిసి రెండో వికెట్‌కు
- 121 పరుగుల భాగస్వామ్యం
- 38 బంతులు మిగిలుండగానే
లక్ష్యం ఛేదించిన టీమిండియాన్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ ఘనవిజయంతో ప్రారంభించింది. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసింది. 157 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 13.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 32 బంతుల్లో 82 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి భారత విజయాన్ని ఏకపక్షం చేశాడు. ఈ గెలుపుతో సిరీస్‌లో భారత్ 1–0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులు చేసింది. అనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది.
22 బంతుల్లోనే ఫిఫ్టీ
జింబాబ్వే టూర్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన అభిషేక్.. ఈ మ్యాచ్‌లో మాత్రం తన అసలు సత్తా చూపించాడు. ఫజల్‌హక్ ఫరూఖీ, ముజీబ్ ఉర్ రహ్మాన్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్.. ఇలా బౌలర్ ఎవరైనా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 22 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అభిషేక్‌కు ఇది 12వ హాఫ్ సెంచరీ. అతని ధాటితో భారత్ 8.2 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్‌ను దాటింది. ఇషాన్ కూడా అభిషేక్‌కు చక్కటి సహకారం అందించాడు.
వీరిద్దరూ రెండో వికెట్‌కు కేవలం 52 బంతుల్లో 121 పరుగులు జోడించారు. 32 బంతుల్లో 82 పరుగులు చేసిన అభిషేక్.. మహ్మద్ నబీ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ 30 బంతుల్లో 37 పరుగులు చేసి మూడో వికెట్‌గా ఔటయ్యాడు. చివర్లో శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ లాంఛనం పూర్తి చేశారు. 13.4 ఓవర్లలో భారత్ 157/3తో లక్ష్యాన్ని అందుకొని 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అఫ్గానిస్థాన్ తరఫున మహ్మద్ నబీ రెండు వికెట్లు పడగొట్టగా, ఒమర్జాయ్ ఒక వికెట్ తీశాడు.
మ్యాచ్‌కు ముందు ‘వందేమాతరం’
అంతర్జాతీయ క్రీడా వేదికపై తొలిసారిగా భారత జాతీయ గేయం ‘వందేమాతరం’ను జాతీయ గీతం ‘జనగణమన’ కంటే ముందు వినిపించారు. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్–అఫ్గానిస్తాన్ తొలి టీ20 ప్రారంభానికి ముందు ఈ చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల మేరకు బంకించంద్ర ఛటర్జీ రచించిన ‘వందేమాతరం’లోని మొత్తం ఆరు చరణాలను ప్లే చేశారు. అనంతరం ‘జనగణమన’ను ఆలపించారు. రాబోయే ఐసీసీ టోర్నీల్లోనూ జాతీయ గీతంతోపాటు వందేమాతరం వినిపిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
